
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డిని ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఎటువంటి జీత భత్యాలు, కేబినెట్ ర్యాంకు లేకుండా ఆయన్ను నియమించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆయనకు ఎటువంటి అధికారిక సదుపాయాలను కూడా కల్పించడం లేదు. కేవలం సేవా భావంతోనే ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డి వ్యవహరించనున్నారు.
ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ
గత నెల 22వ తేదీన విజయసాయిరెడ్డిని కేబినెట్ ర్యాంకుతో ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ మరో లాభదాయక పదవి (ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్) చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని తేలడంతో విజయసాయిరెడ్డి నియామక ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 4వతేదీన రద్దు చేసింది. తాజాగా ఎటువంటి జీత భత్యాలు, కేబినెట్ తదితర హోదా లేకుండా ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆయన్ను నియమించేందుకు వీలుగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనల్లో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆర్డినెన్స్ జారీ చేసింది. విజయసాయిరెడ్డిని ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment