సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించాలని, రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. జీవిత బీమా సంస్థలో పెట్టుబడులు ఉపసంహరించుకోవాలన్న ప్రభుత్వ ప్రతిపాదన చారిత్రక తప్పిదం కాగలదన్నారు. నిధుల సమీకరణ కోసం జోరుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించాలన్న ప్రతిపాదనలు శ్రేయస్కరం కావన్నారు. వార్షిక బడ్జెట్‌పై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
బడ్జెట్‌కు తమ మద్దతును ప్రకటిస్తూనే పన్నుల ద్వారా కాకుండా పరోక్ష పద్ధతుల్లో నిధులు సేకరించే మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిన అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రస్తుతం వస్తున్న రూ.65 వేల కోట్లకు బదులుగా 2020–21లో రూ.2.10 లక్షల కోట్ల నిధులను సమీకరించాలని బడ్జెట్‌లో నిర్దేశించారు. అత్యంత విలువైన జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)లో పెట్టుబడులను ఉపసంహరించాలన్న నిర్ణయం చారిత్రక తప్పిదంగా మిగిలిపోగలదు..’ అని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పన్నుల వసూళ్ల ద్వారా రూ. 1.5 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని గత ఏడాది బడ్జెట్‌లో నిర్దేశించుకున్న ప్రభుత్వం ఆ లక్ష్య సాధనలో దారుణంగా విఫలమైందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అంశాలపై..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీఎస్టీ ఆదాయం నష్టపోయి తీవ్రంగా ఇబ్బందిపడుతోందని, కేంద్రం వెంటనే నవంబరు, డిసెంబరు మాసాలకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించాలని విజయసాయిరెడ్డి కోరారు. ‘పోలవరం ప్రాజెక్టుకు రూ. 3,283 కోట్ల మేర వ్యయం రీయింబర్స్ చేయాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయం రూ. 55,548 కోట్లుగా ప్రతిపాదనలు ఇవ్వగా కేంద్ర ప్రభుత్వం ఇంకా దానిని ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచింది. దీనిని త్వరితగతిన పరిష్కరించాలి..’అని కోరారు.
2013–14 కంటే చాలా మెరుగ్గా ఉంది..
బడ్జెట్‌ను ఐసీయూలో ఉన్న పేషంట్‌గా అభివర్ణిస్తూ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలను విజయసాయిరెడ్డి తప్పుబట్టారు. 2013–14లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక రంగానికి అద్దం పట్టే వివిధ సూచీలను ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గణాంకాల సాయంతో వివరించారు. ‘నేను ఆర్థిక స్థితి అంతా బాగుందని అనడం లేదు. 2013–14 కంటే చాలా చాలా మెరుగ్గా ఉంది..’ అని విశ్లేషించారు.
రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల పెన్షన్ సవరించాలి
రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల పెన్షన్‌ను సవరించాలని విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఈ అంశాన్ని సభలో లేవనెత్తారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా 20 ఏళ్ల క్రితం నిర్ణయించిన పెన్షన్ ఈరోజున ఏమూలకు సరిపోని పరిస్థితి ఏర్పడిందని వివరించారు.
పునరుత్పాదక శక్తి రంగం ద్వారా 7 లక్షల ఉద్యోగాలు
పునరుత్పాదక శక్తి (రెన్యూవబుల్ ఎనర్జీ) రంగం ద్వారా దేశంలో 7 లక్షల 19 వేల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉన్నట్లు పునరుత్పాదక శక్తి శాఖ సహాయ మంత్రి ఆర్.కే. సింగ్ మంగళవారం రాజ్యసభలో ప్రకటించారు. విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ (ఇరేనా) వెల్లడించిన నివేదిక ప్రకారం 2018 నాటికి దేశంలో సోలార్ ఫొటో వాల్టిక్ రంగంలో ఒక లక్షా 15 వేల ఉద్యోగాలు, పవన విద్యుత్ రంగంలో 58 వేల ఉద్యోగాలు, జల విద్యుత్ రంగంలో 3 లక్షల 47 వేల ఉద్యోగాలు కల్పించవచ్చని అంచనా వేసిందని చెప్పారు.
పోలవరానికి సవరించిన అంచనా వ్యయం ఆమోదించండి
Published Wed, Feb 12 2020 3:55 AM | Last Updated on Wed, Feb 12 2020 3:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment