
విజయవాడ స్క్వేర్ కు సీఎం ఆమోదం
► పీవీపీ పద్ధతిలో నిర్మాణం
► రూ.135 కోట్ల వ్యయం
►350 స్టాల్స్‌తో మోడల్ రైతుబజార్
► ప్రభుత్వంపై ఆర్థిక భారం పడబోదు
► కలెక్టర్ బాబు.ఎ వెల్లడి
విజయవాడ : విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న స్వరాజ్యమైదానం ఆవరణలో రాష్ట్రానికే తలమానికంగా నిలిచేలా నిర్మాణం చేపట్టనున్న విజయవాడ స్క్వేర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారని జిల్లా కలెక్టర్ బాబు.ఎ ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం నివాసంలో ఆదివారం జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ బాబు.ఎ, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్, ఇరిగేషన్ అధికారులు, జీఐఐసీ చైనా సంస్థ ప్రతినిధుల సమక్షంలో విజయవాడ స్క్వేర్ నమూనాలను సీఎం పరిశీలించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్క్వేర్ వివరాలను కలెక్టర్ వెల్లడించారు. ఎంతో ఆసక్తికరంగా చేపట్టబోతున్న విజయవాడ స్క్వేర్ నమూనా డిజైన్‌ను అక్కడ నిర్మించనున్న వివిధ షాపుల కాంప్లెక్స్,పార్కింగ్ ఏరియాలు, భవనాల నిర్మాణ వివరాలను చైనా సంస్థ నుంచి సీఎం తెలుసుకున్నట్లు కలెక్టర్ వివరించారు.
వివిధ దశల్లో చేపట్టే ఈ నిర్మాణాలు పూర్తయితే విజయవాడ స్క్వేర్ పర్యాటకులను ఆకర్షించటంతో పాటు, గణనీయమైన ఆదాయ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈ నిర్మాణాల వల్ల ఎగ్జిబిషన్లు, వివిధ ప్రదర్శనలు, పబ్లిక్ మీటింగ్‌లు గతంలో కంటే రెండున్నర రెట్లు అధికంగా నిర్వహించుకునేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించే ఈ విజయవాడ స్క్వేర్‌కు సుమారు రూ.135 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. దీని నిర్మాణానికి ప్రభుత్వంపై ఆర్థిక భారం పడబోదని కలెక్టర్ వివరించారు.
రూ.4 కోట్లతో 350 స్టాల్స్‌తో రైతుబజార్
స్వరాజ్యమైదానం రైతుబజార్‌ను అలంకార్ థియేటర్ ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసే రైతుబజార్‌ను రూ.4 కోట్ల వ్యయంతో మోడల్ రైతుబజార్‌గా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. ఈ రైతు బజార్‌లో 350 స్టాల్స్‌ను అత్యాధునికంగా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.