విక్రమ్ లొంగుబాటు హైడ్రామా!
కల్వకుర్తి/మహబూబ్‌నగర్ క్రైం/అమ్రాబాద్: మావోయిస్టు దారగోని శ్రీనువాసులు అలియాస్ విక్రమ్ లొంగుబాటుకు సంబంధించి ఆదివారం రాత్రి పొద్దుపోయేవరకు కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో హైడ్రామా నెల కొంది. విక్రమ్‌ను నల్గొండ జిల్లా దేవరకొండ సమీపంలో లొంగుబాటుకు అంగీకరించగా.. స్థానిక పోలీసులు అక్కడికి వెళ్లి తీసుకొచ్చారనే ప్రచారం జరిగింది. దీంతో విషయం తెలుసుకున్న విక్రమ్ కుటుంబసభ్యులు, బంధువులు అక్కడికి చేరుకున్నా రు. అయితే తీవ్ర హైడ్రామా మధ్య సా యంత్రం 6 గంటల తర్వాత విక్రమ్‌ను కల్వకుర్తి పీఎస్‌కు తీసుకొచ్చారు.
పోలీసు లు రహస్యంగా రాత్రి 8 గంటల వరకు విచారించి..మరింత సమాచారం సేకరించి నట్లు తెలిసింది. అనంతరం జిల్లా కేంద్రం నుంచి జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్, ఓఎస్ డీ సూర్యప్రకాష్ కల్వకుర్తికి చేరుకున్నారు. దీంతో పోలీస్‌స్టేషన్ ఆవరణలో సందడి నెలకొంది. విక్రమ్ భార్య లక్ష్మమ్మ తమ బి డ్డ, మామ, అన్నతో కలిసి అక్కడికి వచ్చిం ది. అయితే వారితో మాట్లాడకుండా పోలీ సులు అడ్డుకున్నారు. ఎస్పీ చేరుకున్న తర్వా త అక్కడి విక్రమ్ లొంగిపోతాడని అనుకున్నప్పటికీ ఎవరూ ఊహించని విధం గా అతని జిల్లాకేంద్రానికి ప్రత్యేకవాహనంలో తీసుకెళ్లారు. సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిసింది.
ఏకే 47 అపహరించిన కేసులో..
అమ్రాబాద్ మండలంలోని తిర్మలాపూర్(బీకే) గ్రామానికి శ్రీనివాసులు అలియాస్ విక్రమ్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. గ్రామంలోనే వ్యవసాయం చేస్తుం డేవాడు. అప్పట్లో మావోయిస్టుల కార్యక్రమాలకు ఆకర్షితుడై 2004లో దళంలో చేరి నల్లమల దళ సభ్యునిగా, డిండి ఏరియాకమిటీ సభ్యునిగా పనిచేశారు. 2007లో ఆమనగల్లు మాజీ ఎంపీపీ పంతునాయక్ హత్యకేసులో విక్రమ్ ఏ5 ముద్దాయిగా ఉన్నాడు. అయితే ఈ హత్యకు ఉపయోగించిన ఏకే 47 ఆయుధాన్ని కోర్టులో భద్రపరిచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మవోయిస్ట్ విక్రమ్ ఆ తరువాత కొన్ని రోజులకు పోలీసులకు లొంగిపోయాడు. అతని వద్ద నుంచి స్వాధీనపర్చుకున్న ఏకే 47 ఆయుధాన్ని కోర్టులో భద్రపరిచారు. ఈ క్రమంలో పలుమార్లు ఈ కేసుకు సంబంధించి విచారణకు జిల్లా కోర్టుకు వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో కోర్టు స్టోర్‌రూమ్‌లో భద్రపరిచిన ఈ ఆయుధం 2013 జూన్ 20న అదృశ్యమైంది. 26న కోర్టు సిబ్బంది ఏకే 47 ఆయుధం అదృశ్యమైనట్లు గుర్తించారు. ఈ మేరకు కోర్టు సూపరింటెండెంట్ అల్‌బర్ట్ విక్టర్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీనిపై ఎస్పీ విచారణ చేపట్టి ఇద్దరు కోర్టు సిబ్బందిని సస్పెండ్‌చేశారు.
పలుకోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు విక్రమే ఈ ఆయుధాన్ని అపహరించి ఉంటాడని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఈనెల 18 ప్రకాశం జిల్లా, మహబూబ్‌నగర్ సరిహద్దు నల్లమల అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జిల్లా కోర్టు నుంచి అదృశ్యమైన ఏకే 47 ఆయుధం పోలీసులకు చిక్కింది. ఆ ఎన్‌కౌంటర్‌లో విక్రమ్ ఆ ఆయుధాన్ని వాడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఆదివారం కల్వకుర్తి పోలీసులకు లొంగిపోయాడు.