విలపింఛెన్ | Vilapinchen | Sakshi
Sakshi News home page

విలపింఛెన్

Published Wed, Oct 8 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

విలపింఛెన్

విలపింఛెన్

 ‘5 రెట్లు ఎక్కువ అంటూ ఆర్భాటపు ప్రకటనలిస్తున్నారు.. అర్హులైన పింఛన్ లబ్ధిదారులను నిలువునా ముంచుతున్నారు.. కొన్ని చోట్ల గ్రామ కమిటీలు ఓకే చేసినా.. మండల, జిల్లా కమిటీలు పింఛన్లలో కోత విధించి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు తీరని వేదన కలిగిస్తున్నాయి.. అతి చిన్న కారణాలతో కొన్ని చోట్ల, ఎలాంటి కారణాలు లేకుండానే మరికొన్ని చోట్ల నిర్ధాక్షిణ్యంగా పింఛన్లను తప్పించార’ంటూ వివిధ పార్టీల నేతలు నిప్పులు చెరిగారు.
 
 అనంతపురం రూర ల్ :   
 అర్హులైన వారికి పింఛన్ రద్దు చేయడంపై వృద్ధులు, వితంతువులు కన్నీటిపర్యంతమయ్యారు. అనంతపురం రూరల్ మండలం కందుకూరు, అక్కంపల్లి గ్రామాలకు చెందిన 200 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆపసోపాలు పడుతూ మంగళవారం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని అర్హులైన తమకు పింఛన్లు రద్దు చేసి పొట్టకొట్టవద్దని అధికారులను వేడుకున్నారు. ఐదెకరాల పొలం ఉందని, ఆధార్ నంబర్ లేదని, వయసు తక్కువగా నమోదైందని తదితర కారణాలతో చాలా మందికి పింఛన్‌ను రద్దు చేశారు.

పింఛన్‌పై ఆధారపడి ఇంతకాలం జీవితాన్ని నెట్టుకొచ్చిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు జాబితాలో తమ పేర్లు లేకపోయే సరికి గుండె ఆగినంత పనైంది. రూ.200 పింఛన్ రూ.1000, రూ.1500కు పెరుగుతోందని సంతోషడిన వారు పింఛన్లు రద్దయ్యాయని తెలిసి ఆందోళనకు గురయ్యారు. శరీరం సహకరించకపోయినా ఆయాస పడుతూనే అతికష్టం మీద మెట్లు ఎక్కుతూ అధికారుల కోసం వెదికారు. వారికి తమ గోడు చెప్పుకుని పింఛన్‌ను పునరుద్ధరించేలా చూడాలని కన్నీళ్లు పెట్టుకున్నారు. పిల్లల ఆదరణకు నోచుకోని తమకు పింఛన్ రద్దు చేస్తే ఎలా బతకాలయ్యా అంటూ విలపించారు.

వీరి ఆందోళనకు సీపీఐ, సీపీఐ, వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీ నేతలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు శివారెడ్డి, సూర్యనారాయణ, వెంకట్రాముడు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐకి చెందిన సర్పంచ్ నాగలక్ష్మి, నేతలు రామకృష్ణ, గోవింద్‌రెడ్డి, టీడీపీ నేతలు శంకర్‌రెడ్డి, వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు.  

 కణితి తొలగింపు
 గుత్తి : తొలిసారిగా గుత్తిలో శస్త్రచికిత్స ద్వారా 70 ఏళ్ల వృద్ధురాలికి బ్రెస్ట్ క్యాన్సర్ కణితిని తొలగించారు. ఈ శస్త్రచికిత్స నిర్వహించిన అనంతపురం మెడికల్ కళాశాల ప్రొఫెసర్ ఆఫ్ సర్జర్ ఆర్.నారాయణ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. గుత్తి మండలం పి.ఎర్రగుడి గ్రామానికి చెందిన సుంకమ్మ ఐదేళ్లుగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతుండేది. హైదరాబాద్, కర్నూలు, అనంతపురం, బళ్లారి ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంది. ఆపరేషన్‌కు రూ.2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు.

నిరుపేదరాలైన ఈమెకు నలుగురు కొడుకులున్నప్పటికీ వారి వద్ద మందులు కొనడానికి కూడా డ బ్బు లేదు. మందులు వాడకపోవడంతో వ్యాధి తీవ్రమైంది. ఈ క్రమంలో ఆమె 15 రోజుల క్రితం గుత్తిలోని ఉజ్వల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి వచ్చింది. అత్యవసరంగా ఆపరేషన్ చేయకపోతే ప్రాణహాని ఉందని చెప్పారు. అష్టకష్టాలుపడి పాతిక వేలు సమకూర్చుకుని రెండు రోజుల తర్వాత ఆస్పత్రిలో చేరి శస్త్ర చికిత్స చేయించుకుంది. డాక్టర్ ఆర్.నారాయణను ఆస్పత్రి యాజమాన్యం బాలరాజు, కుష్బూలు అభినందించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement