సాక్షి, నెల్లూరు : అల్లూరు మండలం ఇస్కపల్లి సర్పంచ్, మత్స్యకార బీసీ మహిళ, గర్భణి అయిన బుజ్జంగారి మమత వైఎస్సార్‌సీపీలో చేరిందన్న అక్కసుతో టీడీపీ నేతలైన బీద సోదరులు దురాయిని అడ్డం పెట్టుకుని గ్రామబహిష్కరణ చేయడం వారి ఆటవిక రాజ్యానికి ప్రతీకని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ ధ్వజమెత్తారు.
ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగులుతుందన్నారు. సోమవారం గ్రామ బహిష్కరణకు గురైన సర్పంచ్ మమత, ఆమె భర్త బాబు, అల్లూరు సర్పంచ్ చంద్రలీలమ్మ తదితరులతో కలిసి మంగళవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మేరిగ మురళీధర్ మాట్లాడుతూ రాష్ట్రపతి పాలన మొదలైన కొన్ని గంటల్లోనే ఇస్కపల్లి పంచాయతీలో దారుణం జరగడం అమానుషమన్నారు. ఇది సభ్యసమాజం తలదించుకునే చర్యని ఆయన పేర్కొన్నారు. ఇస్కపల్లి పంచాయతీ బీసీలకు రిజర్వు కాగా మత్స్యకార బీసీ మహిళ సర్పంచ్‌గా ఎన్నికయ్యారన్నారు. అయితే బీద సోదరుడైన గిరిధర్ ఉప సర్పంచ్‌గా ఎన్నికై తానే ఏక పక్షంగా చెలాయించాడని మేరిగ చెప్పారు. ఈ నేపథ్యంలో మహానేత వైఎస్సార్ పథకాలకు ఆకర్షితురాలైన సర్పంచ్ కుటుంబం ఆయన కుమారుడు వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని తలచి ఇటీవలే వైఎస్సార్‌సీపీలో చేరారన్నారు. దీన్ని సహించలేని బీద సోదరులు గ్రామ పెద్దలైన కొందరు మత్స్యకారులను తమవశం చేసుకుని దురాయిని అడ్డం పెట్టి సర్పంచ్ మమతకు గ్రామ బహిష్కరణ శిక్ష విధించడమే కాక ఆమె అత్త పోలమ్మ, మామ తాతయ్యను గుడిలో నిర్బంధించడం దారుణమని మేరిగ మండిపడ్డారు.
ఇప్పటికే ఆ కుటుంబాన్ని తీవ్ర స్థాయిలో బెదిరిస్తున్నారని, ఇళ్లు, పొలాలు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారని మేరిగ మురళీ పేర్కొన్నారు. వారికి ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారుణంపై ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్, మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ బాధితులకు అండగా నిలిచి ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు.
నిండు గర్భిణికి గ్రామ బహిష్కరణ శిక్షా?: అనిత
నిండు గర్భిణి మమతకు బీద సోదరులు గ్రామ బహిష్కరణ శిక్ష విధించడం దారుణమని, ఇది క్షమించరాని నేరమని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ బండ్లమూడి అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మేరిగ మురళీధర్‌తో పాటు ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాజకీయ లబ్ధి కోసం నియంతృత్వ పోకడలతో బీద సోదరులు బీసీ మత్స్యకార మహిళ అని చూడకుండా ఇంతటి దారుణానికి ఒడిగట్టడం అమానుషమన్నారు. తక్షణం రాష్ట్ర, జిల్లా అధికారులు బీద సోదరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు సైతం పారిపోతున్నారని, వారి సంగతి పట్టించుకోని ఆ పార్టీ నేతలు బీసీ మత్స్యకార మహిళ పార్టీని వీడితే దారుణానికి ఒడిగట్టడమేమిటని ఆమె ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అల్లూరు సర్పంచ్ చంద్రలీలమ్మ, వార్డు సభ్యులు శేషారెడ్డి, వసంతమ్మ, రమణమ్మ, సుహాసిని, లలితమ్మ, బుజ్జంగారి మమత, ఉండ్రాళ్ల ఉమ, సర్పంచ్ భర్త బాబు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ బహిష్కరణ ఆటవికం
Published Wed, Mar 5 2014 4:23 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement