3 గ్రామాలకు మహర్దశ | villages boom | Sakshi
Sakshi News home page

3 గ్రామాలకు మహర్దశ

Published Fri, Aug 14 2015 12:42 AM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

3 గ్రామాలకు మహర్దశ

3 గ్రామాలకు మహర్దశ

దివిసీమలోని పల్లెలను దత్తత తీసుకున్న ‘మిత్సుబిషి’
రూ.7.9 కోట్లతో ‘స్మార్ట్’గా అభివృద్ధి
2,200 కుటుంబాలకు లబ్ధి
ముఖ్యమంత్రి, మిత్సుబిషి కంపెనీ చైర్మన్ వెల్లడి

 
విజయవాడ : జిల్లాలోని నాగాయలంక మండలం సొర్లగొంది, నాలి, చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామాలకు మహర్దశ పట్టనుంది. ఈ గ్రామాలను జపాన్‌కు చెందిన మిత్సుబిషి కంపెనీ దత్తత తీసుకుంది. స్థానిక ఏ-1 కన్వెన్షన్  సెంటర్‌లో గురువారం జరిగిన సమావేశంలో మూడు గ్రామాలతో పాటు వాటి శివారు గ్రామాలను మిత్సుబిషి కంపెనీ స్మార్ట్ గ్రామాలుగా తీర్చిదిద్దే శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ఆవిష్కరించారు. ఆయా గ్రామాల ప్రజలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
 
రూ.7.9 కోట్లతో అభివృద్ధి
 దివిసీమకు వచ్చిన ఉప్పెనలో సొర్లగొంది, నాలి, మంగళాపురం గ్రామాలు బాగా దెబ్బతిన్నాయి. సొర్లగొంది, నాలి గ్రామాలతో పాటు మరో నాలుగు శివారు గ్రామాలు సముద్రం ఒడ్డున ఉంటాయి. ఈ గ్రామాల్లో ఎక్కువమంది మత్స్యకారులే జీవిస్తారు. మంగళాపురం వ్యవసాయదారుల గ్రామం. దీనికి మరో శివారు గ్రామాన్ని కలిపి మొత్తం ఎనిమిది గ్రామాలను అభివృద్ధి చేసేందుకు మిత్సుబిషి కంపెనీ ముందుకొచ్చింది. ఈ గ్రామాల్లో 2,200 కుటుంబాలు ఉంటాయి. గ్రామాల అభివృద్ధికి కంపెనీ సుమారు రూ.7.9 కోట్లు ఖర్చు చేస్తుంది. కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యత నిర్వహించడంలో భాగంగా స్వామినాథన్ ఫౌండేషన్ సూచన మేరకు ఈ గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి సముద్రతీర ప్రాంతాన్ని రక్షించేందుకు, మడ అడవుల పెంపకంపై స్వామినాథన్ ఫౌండేషన్ పనిచేస్తోంది.

అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు
 ఆయా గ్రామాల్లో ప్రజల జీవనశైలిలో మార్పులు తెచ్చేందుకు మిత్సుబిషి కంపెనీ ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించిందని సమావేశంలో మిత్సుబిషి కంపెనీ చైర్మన్ మసకబు నకకిడ తెలిపారు. ఆయా గ్రామాల్లో రోడ్లు అభివృద్ధి చేయడం, ప్రజలకు మంచినీరు, పారిశుధ్యం, విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తారు. సునామీలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడంపై అవగాహన కల్పిస్తారు. గ్రామస్తులు ఆర్థికంగా స్థిరపడేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేస్తారు. మత్స్యకారులు తమ ఉత్పత్తులు ఎక్కువ ధరలకు విక్రయించుకోవడంపై కూడా శిక్షణ  ఇచ్చి వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు మిత్సుబిషి కృషిచేస్తుంది.
 
కోరాపుట్ అభివృద్ధిలో మిత్సుబిషి

 ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలో మిత్సుబిషి, డాక్టర్ స్వామినాథన్ ఫౌండేషన్‌లు కలిసి పనిచేశాయి. ఫలితంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచ వ్యవసాయ వారసత్వ వ్యవస్థగా పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకటించడం విశేషం. మనజిల్లాలోని ఈ మూడు ప్రాంతాలను కూడా ఈ రెండు సంస్థలు అద్భుతమైన స్మార్ట్ విలేజ్‌లుగా తీర్చిదిద్దుతాయేమో వేచి చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement