ఏలూరు : గ్రామాలను స్మార్ట్ విలేజ్‌లు (ఆకర్షణీయ గ్రామాలు)గా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛంద సంస్థలు, ఎన్నారైలు ముందుకు రావాలన్న సర్కారు పిలుపునకు ఆశించిన స్పందన రావడం లేదు. నిధులు ఇవ్వకుండా గ్రామాలను ‘స్మార్ట్’గా తీర్చిదిద్దడం ఎలా సాధ్యమనే ప్రశ్నలు వెల్లువెత్తు న్నాయి. జిల్లాలో 908 గ్రామ పంచాయతీలు ఉండగా.. వాటిని ఎన్నారైలు, స్వచ్ఛంద సంస్థలు, ఆయా ప్రాంతాల్లో నివసించే అధికారులకు దత్తత ఇవ్వాలన్న సర్కారు నిర్ణయించింది. 908 గ్రామాలకు కేవలం 62 గ్రామాలను దత్తత తీసుకోవడానికే ఎన్నారైలు, వివిధ సంస్థలు ముందుకు వచ్చినట్టు సమాచారం. 20 అంశాల అజెండా స్మార్ట్ విలేజ్ కార్యక్రమం కింద గ్రామాల అభివృద్ధిపైనే కీల కంగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. ఇందులో 20 అంశాలను పొందుపర్చారు.
ఆ అంశాల ఆధారంగా గ్రామాలను ప్రగతి బాట పట్టించాల్సి ఉంటుంది. అందరికీ గృహం, మరుగుదొడ్లు, రక్షిత నీరు, నిరంతర విద్యుత్, ప్రసూతి మరుణాల నివారణ, నూరు శాతం సంస్థాగత ్రపసవాలు, 12వ తరగతి వరకు విద్యార్థులు బడి మానివేయకుండా చూడటం, అంగన్‌వాడీ కేంద్రాలను పటిష్టం చేయడం, స్వయం సహాయక సంఘాలకు, యువకులకు నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇవ్వ డం, బ్యాంకు, మార్కెటింగ్ అనుసంధానం తదితర అంశాలను ‘స్మార్ట్’ కార్యక్రమంలో భాగం చేశారు. ఇవన్నీ క్షేత్రస్థాయిలో ప్రజలకు నూరుశాతం అందించేందుకు ఏప్రిల్ 1నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది.
స్వచ్ఛంద సంస్థలు, ఎన్నారైలు గ్రామానికి ఏదైనా ఒక సహకారం లేదా ఒక సౌకర్యాన్ని సమకూర్చగలుగుతారు. మొత్తం 20 అంశాలపై దృష్టి సారించి.. వాటిని అమలు చేయడం వారికి కష్టమవుతుంది. ప్రభుత్వ భాగస్వామ్యం, కొంతమేర నిధులు ఉంటే ఎన్నారైలు, స్వచ్ఛంద సంస్థలు మరింత ముందుకొచ్చి గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించగలుగుతారు. అతిపెద్ద వ్యవస్థ.. యం త్రాంగం ఉన్న ప్రభుత్వానికి గ్రామాలను అభివృద్ధి చేయడం సాధ్యం కానప్పుడు ఒక సంస్థ లేదా విదేశాల్లో స్థిరపడిన వ్యక్తులు మాత్రమే పూర్తిస్థాయి అభివృద్ధిని ఏమేరకు సాధించ గలుగుతారనే అభిప్రాయం వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. స్మార్ట్ కార్యక్రమానికి నిధులిచ్చే దిశగా సర్కారు ఆలోచన చేయాలని, అప్పుడే పల్లెలు ప్రగతిబాట పడతాయని పలువురు పేర్కొంటున్నారు.
పట్టణాల్లో ప్రహసనంగా..
కాగా.. స్మార్ట్ కార్యక్రమం మునిసిపాలిటీల్లో ప్రహసనంగా మారింది. ఏ పట్టణాన్ని చూసినా కనీసం 10 శాతం వార్డులనైనా ఎవరూ దత్తత తీసుకోలేదు. స్మార్ట్ గ్రామాలు, స్మార్ట్ వార్డుల అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లాలోని ముఖ్య అధికారులు తరచూ ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఇతర అధికారులను ఆదేశిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెలలో రెండు మూడుసార్లు వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహిస్తూ ఇదే విషయమై దిశానిర్ధేశం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి వీలుకాకపోతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వీడియో కాన్ఫెరెన్స్‌లో మాట్లాడుతున్నారు. కలెక్టర్ కె.భాస్కర్ ప్రతి వారం సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయినా క్షేత్రస్థాయిలో ఆశించిన పురోగతి కనిపించడం లేదు.
పల్లె.. ‘స్మార్ట్’ కల్లే
Published Tue, Feb 24 2015 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM
Advertisement