పోరాడి గెలిచిన వీణ
ఆడబిడ్డ పుట్టిందని ముఖం చాటేసిన అత్తింటివారు
మూడు రోజులుగా మెట్టినింటి ఎదుట బాధితురాలి నిరశన
ఎమ్మెల్యే జోక్యంతో కథ సుఖాంతం
తిరుపతి క్రైం/మంగళం: తిరుపతి భవానీ నగర్‌కు చెందిన హరికృష్ణకు, జీవకోనకు చెందిన వీణాకు గత ఏడాది వివాహం జరిగింది. ఇతను మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. వీరికి 11 నెలల క్రితం పాప పుట్టింది. కొడుకు పుట్టలేదని వీణను కాపురానికి తీసుకురాలేదు. కనీసం పాపను చూసేందుకు కూడా హరికృష్ణ, అతని అమ్మానాన్నలు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం వీణ తన కుమార్తెను తీసుకుని అత్తగారింటికి చేరుకుంది. అయితే ఆమె అత్తామామ ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారు.
హరికృష్ణ కూడా దుకాణం మూసేసి అదృశ్యమయ్యాడు. దీంతో బాధితురాలు అత్తగారింటి ముందు నిరాహార దీక్షకు దిగింది. ఈమెకు పలు ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. చివరకు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే వెంకటమరణ అక్కడకు చేరుకుని బాధితురాలికి అండగా నిలిచారు. హరికృష్ణను పిలిపించి ఇద్దరితో మాట్లాడారు. మీడియా సమక్షంలో మళ్లీ పూలదండుల మార్పించి ఒకటి చేశారు. ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటానని అతడు తెలిపాడు. తమను కలిపేందుకు కృషి చేసిన ప్రతిఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు.