
ఆలయం వద్ద చీరలు పంపిణీ చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి
యల్లనూరు: అధికారంలో ఉన్నాం కదా అని.. తాము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నిబంధనలను బేఖాతరు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నా అవేమీ తనకు పట్టవన్నట్లు వ్యవహరించారు. పోలీసులు కూడా ఆయనకే వత్తాసు పలికారు. వివరాల్లోకెళితే.. యల్లనూరు మండలం కొడవండ్లపల్లి పెద్దమ్మతల్లి ఆలయం నిర్వహణ విషయం ఇటీవల వివాదాస్పదమైంది. ఇక్కడ అవాంఛనీయ ఘటనలలు చోటుచేసుకోకుండా ఉండేందుకు, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఈ నెల ఆరో తేదీ నుంచి పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ సెక్షన్ అమలులో ఉన్నపుడు ఆలయానికి 400 మీటర్ల పరిధిలో ఎక్కడా ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూడదు. భారీగా వాహనాల్లో రావడం తదితర వాటిని చేయకూడదు.
నిబంధనలు జాన్తా నై..
పామిడి సీఐ నరేంద్రరెడ్డి, తాడిపత్రి రూరల్ సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి, పుట్లూరు ఎస్‌ఐ సురేష్‌బాబు, పెద్దపప్పూరు ఎస్‌ఐ ఆంజనేయులు, యల్లనూరు ఎస్‌ఐ గంగాధర్, తాడిపత్రి తాలూకా పీఎస్‌ఐ, యల్లనూరు స్టేషన్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది సుమారు 60 మంది పోలీసుల బందోబస్తు నడుమ శనివారం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి భారీ కాన్వాయ్‌తో కొడవండ్లపల్లి పెద్దమ్మతల్లి ఆలయం చేరుకున్నారు. ఆయనతోపాటు మండల వ్యాప్తంగా ఉన్న వారి అనుచర వర్గం కూడా తరలివచ్చింది. ఆలయం వద్ద అనుచర వర్గానికి ఎమ్మెల్యే అల్పాహార విందు ఇచ్చారు.
ఆలయ ఆవరణంలోనే చీరల పంపిణీ చేపట్టారు. 144 సెక్షన్ అమలులో ఉన్న ప్రాంతంలో ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించినా పోలీసులే దగ్గరుండీ పర్యవేక్షించడం విమర్శలకు దారితీసింది. తాడిపత్రి ఎమ్మెల్యే యల్లనూరు మండలానికి వచ్చి చీరలు పంపిణీ చేయడం రాజకీయలబ్ధి పొందడం కోసమేనన్న వాదనా లేకపోలేదు. కొడవండ్లపల్లిలో 144 సెక్షన్ అములులో ఉందా లేదా అనే విషయంపై తహసీల్దార్ నాగరాజును వివరణ కోరగా ఉందని సమాధానమిచ్చారు.