సమస్యల శిక్ష | VIP Reporter Abhiyan Project Director Ganapathi Rao | Sakshi
Sakshi News home page

సమస్యల శిక్ష

Published Sun, Dec 14 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM

సమస్యల శిక్ష

సమస్యల శిక్ష

‘ఇంటి పేరు కస్తూరివారు.. ఇల్లంతా గబ్బిలాల కంపు’ అన్న సామెతను నిజం చేస్తున్నాయి కస్తూర్బా గాంధీ విద్యాలయాలు (కేజీబీవీ).

 ‘ఇంటి పేరు కస్తూరివారు.. ఇల్లంతా గబ్బిలాల కంపు’ అన్న  సామెతను నిజం చేస్తున్నాయి కస్తూర్బా గాంధీ విద్యాలయాలు (కేజీబీవీ). కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నత లక్ష్యాలతో 2005-06 విద్యా సంవత్సరంలో ప్రారంభమైన ఈ విద్యాలయాలు దశాబ్దకాలం గడిచినా బాలారిష్టాలను అధిగమించలేకపోతున్నాయి. మొదట 12 విద్యాలయాలతో ప్రారంభమై ఈ వ్యవస్థ ప్రస్తుతం 32 సంస్థలకు పెరిగింది. ఇందులో మూడు గిరిజన సంక్షేమశాఖ, ఒకటి సాంఘిక సంక్షేమశాఖ, ఎనిమిది ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తుండగా మిగిలిన 20 సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. 32 కేజీబీవీల్లో 22 పాఠశాలలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి.
 
 మిగిలినవి అద్దె భవనాల్లో నడుస్తున్నాయి.పేద విద్యార్థినులకు రెసిడెన్షియల్ విద్య అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఈ విద్యాలయంలో కొలువుదీరిన సమస్యలు నీరుగార్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థినులతో పాటు ఉపాధ్యాయులు (సీఆర్టీలు), బోధనేతర సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యాలయాల్లో లోపాలను స్వయంగా తెలుసుకునేందుకు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డెరైక్టర్ గణపతిరావు ముందుకొచ్చారు. సాక్షి తరపున వీఐపీ రిపోర్టర్‌గా శ్రీకాకుళం రూరల్ మండలం మునసబుపేట సమీపంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని సందర్శించారు. పరిస్థితిని స్వయంగా వీక్షించారు. అందరితో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. ఆయన సమస్యలు సేకరించిన తీరు యథాతథంగా..
 
 స్పెషలాఫీసరు గదిలో..
 పీవో(ఎస్‌వోతో) : మీరు ఏ పద్ధతిలో ఎంపికయ్యారు? ఎంపికలు పారదర్శకంగా జరిగాయా.. అవకతవకలు ఏమైనా జరిగాయా?
 గొలివి లత(ఎస్‌వో) : స్పెషలాఫీసర్ ఎంపిక ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగింది. జిల్లాలో మొదటి ర్యాంకు సాధించడంతో నేను ఎంచుకున్న శ్రీకాకుళం కేజీబీవీలోనే నన్ను నియమించారు. అవకతవకలు జరిగి ఉంటే నాకు ఇక్కడ పోస్టింగ్ వచ్చేది కాదు.
 పీవో: మొదటి ర్యాంకు సాధించినందుకు కంగ్రాట్స్ అమ్మా.. విద్యాలయంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా?
 ఎస్‌వో: నూతన భవనం కావడం వల్ల పరిస్థితి మెరుగ్గా ఉన్నా.. భద్రత పరంగా కొంత భయం ఉంది. జాతీయ రహదారిని ఆనుకొని నిర్మానుష్య ప్రదేశంలో భవనం ఉండడం వల్ల ఒంటరితనంతో ఆడవాళ్లందరం భయపడుతున్నాం. రాత్రి వేళల్లో చాలా భయంగా ఉంటోంది.
 పీవో: ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారా?
 ఎస్‌వో: ఎస్సైతో పాటు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాను. భద్రత కల్పిస్తామని ఎస్సై హామీ ఇచ్చారు. రాత్రి వేళల్లో పోలీసులను గస్తీ తిప్పుతున్నారు. దాని వల్ల కొంత భరోసా ఏర్పడింది.
 పీవో: ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా?
 ఎస్‌వో: పాఠశాల ఆవరణలో ఏఎన్‌ఎం లేకపోవడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే విద్యార్థినులను సింగుపురం పీహెచ్‌సీకి తీసుకువెళ్లాల్సి వస్తోంది. ఏఎన్‌ఎం పోస్టులు భర్తీ కాకపోవడం వల్లే ఇలా జరుగుతోంది.
 పీవో: సిలబస్ సకాలంలో పూర్తవుతోందా.. బోధనను పర్యవేక్షిస్తున్నారా?
 ఎస్‌వో: గ ణితం తప్ప మిగతా సిలబస్ అంతా పూర్తయింది. గణితాన్ని నెమ్మదిగా బోధించాలని నేనే చెప్పాను. బోధనను నిరంతరం పర్యవేక్షిస్తున్నాను.
 పీవో: విద్యార్ధినులు, సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తున్నారా?
 ఎస్‌వో: ప్రతి వారం సమావేశాలు నిర్వహిస్తున్నాను. సమస్యలు ఉంటే ఏ సమయంలోనైనా తనకు చెప్పాలని సూచిస్తున్నాను. సమస్య నా దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నాను.
 10వ తరగతి గదిలో....
 పీవో: విద్యార్థినుల హాజరు ఎలా ఉంది?
 ఎస్‌వో లత: ఓ విద్యార్థిని అస్వస్థతకు గురవడంతో రెండు రోజుల క్రితం వారి తల్లిదండ్రులతో ఇంటికి పంపించాం. చికిత్స చేసిన తరువాతే పంపించాం. రెండు రోజుల్లో వచ్చేస్తుంది.
 పీవో: బోధన ఎలా ఉంది?
 సంధ్య (విద్యార్థిని) : బోధన చాలా బాగుంటోంది. కానీ కొన్ని ఇబ్బందులు మాత్రం ఉన్నాయి.
 పీవో: ఏమిటా ఇబ్బందులు చెప్పండి?
 హేమలత(విద్యార్థిని): వీధి దీపాలు లేకపోవడం వల్ల చీకటి వల్ల వేకువజామున లేచి చదవాలంటే భయం వేస్తోంది. తరచూ సర్పాలు కూడా వస్తున్నాయి.
 పీవో: శానిటరీ న్యాప్‌కీన్స్ ఇస్తున్నారా..ఎలా ఉన్నాయి?
 ఢిల్లీశ్వరి(విద్యార్థిని): ఇస్తున్నారు. కానీ అవి అంతగా బాగోవడం లేదు. అందువల్లనే వినియోగించడం లేదు.
 పీవో: అందరూ పాసవుతారా?
 విద్యార్థిని లావణ్య: అందరం పాసవుతాం.
 పీవో: పదో తరగతి గణిత సబ్జెక్టులో గత ఏడాది అత్యధిక మార్కులు ఎన్ని వచ్చాయి.
 వనజాక్షి(గణిత సీఆర్టీ): గత ఏడాది 98 మార్కులు వచ్చాయి. ఈ ఏడాదికి మంచి కిట్లు రావడంతో 100కి వంద మార్కులు వచ్చే పరిస్థితి ఉంది. ఈ కిట్లు ఉపయోగకరంగా ఉన్నాయి.
 8వ తరగతి గదిలో...
 పీవో: 32 మంది హాజరు కావాల్సి ఉండగా, ఏడుగురు గైర్హాజరయ్యారెందుకు?
 కుమారి(తరగతి లీడర్): పలు కారణాలతో ఏడుగురు ఈ రోజు సెలవు పెట్టారు. వారి తల్లిదండ్రులు వచ్చి అడగడంతో ఎస్‌వో పంపించారు.
 పీవో: డిస్కనరీ, అట్లాస్, యూనిఫారాలు ఇచ్చారా? ఉపాధ్యాయులు కొడుతున్నారా?
 విద్యార్థినులు: అన్నీ ఇచ్చారు. ఉపాధ్యాయులు ఎవరూ కొట్టడం లేదు.
 పీవో: కొత్త భవనానికి పెచ్చులెందుకు ఊడుతున్నాయి.. విషయాన్ని ఇంజనీరింగ్ అధికారుల దృష్టిలో పెట్టారా?
 ఎస్‌వో: పది రోజుల క్రితమే పెచ్చులు ఊడాయి. విషయాన్ని ఏఈ దృష్టికి తీసుకువెళ్లాం. రెండు రోజుల్లో బాగు చేయిస్తామన్నారు.
 వంటగదిలో:
 పీవో: వంట చేసేందుకు తెచ్చిన సరుకులు బాగుంటున్నాయా? ఏమైనా సమస్యలు వస్తున్నాయా?
 వేదవతి(కుక్): సరుకులు బాగుంటున్నాయి. బియ్యంలో రాళ్లు ఎక్కువగా ఉంటున్నాయి. అదనంగా సహాయకురాలు అవసరం. 170 మంది పిల్లలకు ఇద్దమే వంట చేయాల్సి వస్తోంది.
 భవనం వెనుక...
 పీవో : పాఠశాల ఆవరణంతా ఇలా బురదమయం అయింది ఎందుకు? సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారా?
 ఎస్‌వో: విద్యార్థినులు, వంట పనివారు వినియోగిస్తున్న నీరు బయటకు వెళ్లేందుకు మార్గం లేక మురికికూపంగా మారింది. కాలువ తవ్వించినా వెలుపల భాగంలో ఎత్తుగా ఉండడం వల్ల సమస్య వస్తోంది. ఇంజనీరింగ్ అధికారులకు చెప్పాం. కాలువ నిర్మిస్తామన్నారు.
 ఆట మైదానంలో..
 పీవో: పిల్లలకు ఆటలు నేర్పిస్తున్నారా?
 పీఈటీ : ఆటల్లో మంచి శిక్షణ ఇస్తున్నాం. దేవీ కుమారి, తేజేశ్వరి, విజయలక్ష్మీ, ఇంద్రజ, పద్మజ, చందనలు జిల్లాస్థాయితో పాటు, రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. సంధ్య, శ్రీలలిత, సీతమ్మ సాఫ్ట్‌బాల్‌లో పతకాలు సాధించారు.
 వసతిగృహంలో...
 పీవో: బెడ్‌షీట్లు, ట్రంక్ పెట్టెలు విద్యార్థులందరికీ ఇచ్చారా?
 ఎస్‌వో: అందరికీ ఇచ్చాం.
 పీవో : మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేలా విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నారా?
 ఎస్‌వో: కల్పిస్తున్నాం. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంటున్నాయి.
 బోధనేతర సిబ్బందితో..
 పీవో : మీకేమైనా సమస్యలున్నాయా?
 లీలావతి(అకౌంటెంట్): ఇతర జిల్లాల్లో కొత్త వేతనాలు ఇస్తున్నారు. మన జిల్లాలో సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో కూడా కొత్త జీతాలు ఇస్తున్నారని చెబుతున్నారు. మాకు మాత్రం మాకు మాత్రం ఇంకా పాత జీతాలే ఇస్తున్నారు.
 
 15 రోజులకోసారి సమీక్ష:పీడీ
 ఇక్కడి సమస్యలు గుర్తించాను. అన్ని కేజీబీవీల్లోనూ దాదాపు ఇవే సమస్యలు ఉన్నట్లు తెలిసింది. నా స్థాయిలో వాటి పరిష్కారానికి కృషి చేస్తాను. విద్యార్థినులకు, సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాను. ముఖ్యంగా నాణ్యమైన శానిటరీ న్యాప్‌కీన్స్‌తో పాటు భవనాల ఆవరణలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసేలా చూస్తాను. అందరూ మహిళలే కావడం వల్ల భద్రతా ఏర్పాట్లు అవసరం. పాఠశాలల్లో ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాను. అదనంగా వంటమనిషిని సమకూర్చేందుకు ప్రయత్నిస్తాను. బోధనేతర సిబ్బందికి కొత్త జీతాలు అందించేందుకు ఏజెన్సీని నియమించాల్సి ఉంది. త్వరలోనే ఏజెన్సీని నియమిస్తాను. ఎస్‌వోల ద్వారా 15 రోజులకోసారి సమస్యను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement