కష్టాలు వింటూ...
పౌరుషానికి పుట్టినిల్లు, చరిత్రాత్మక బొబ్బిలి పట్టణ శివారున 35 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇందిరమ్మ కాలనీ. 2004లో ఆర్వీ సుజయకృష్ణ రంగారావు ఎమ్మెల్యేగా మొదటి సారి ఎన్నికైన తరువాత పట్టణంలో ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి ఇక్కడ మూడు విడతల్లో ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. రెండు విడతల్లో 20 వార్డులకు చెందిన నిరుపేదలకు ఇక్కడ పట్టాలు ఇచ్చారు. 2006లో వారు ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్నారు. ప్రస్తుతం 18 వందల మంది వరకూ ఇక్కడ నివాసముంటున్నారు.. కాలనీ ఏర్పడి ఎనిమిదేళ్లవుతున్నా ఇక్కడ సరైన రహదారులు, వీధి లైట్లు, తాగునీటి వంటి కనీస సదుపాయాలు లేవు. చీకటి పడితే ఒకవైపు పాములు, మరో వైపు దొంగల భయంతో కాలనీవాసులు అల్లాడిపోతున్నారు. నిత్యావసర సరుకుల కోసం చాలా దూరం వెళ్లవలసిన పరిస్థితి. ఈ కాలనీ వాసుల సమస్యలు తెలుసుకునేందుకు బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయకృష్ణ రంగారావు ‘సాక్షి’ తరఫున వీఐపీ విలేకరిగా మారారు. కాలనీ ప్రజలతో మాట్లాడి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇందిరమ్మ కాలనీని మోడల్ కాలనీగా చేయడానికి ఎంతో ప్రయత్నించాను కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఇక్కడ నీటి సమస్య తీర్చడానికి రక్షిత పథకం నిర్మించాలని ప్రతిపాదించినా ప్రభుత్వం ముందుకు రాలేదు. పర్యటనలో నా దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు పరిష్కరిస్తాను. ఇక్కడ కాలనీ వాసుల కోసం ప్రత్యేక రేషన్ డిపో ఏర్పాటు చేస్తాను. మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తాను. రహదారులు, వీధిలైట్లు, కాలువల నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తాను. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో కూడా ఈ సమస్యను ఫ్లోర్‌లీడరు, కౌన్సిలర్లు ద్వారా తెలియపరిచి కాలనీవాసులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తాను.
ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు
సుజయ్: నేను సుజయ్ కృష్ణ రంగారావు, బొబ్బిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాను.. మీ కాలనీ సమస్యలు తెలుసుకోవడానికి మీ దగ్గరికి విలేకరిగా వచ్చాను..
ఏం బాబూ బాగున్నావా... నీ పేరేంటి.. ఏమిటీ నీ ఇబ్బంది?
నా పేరు పాపారావు బాబు.. నాకు రెండు కాళ్లు రావు.. సైకిల్ అయితే ఉంది గానీ ప్రభుత్వం నుంచి ఏ సాయం అందడం లేదు..
సుజయ్: ఎన్ని ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నావు
పాపారావు: అయిదేళ్లుగా ఉంటున్నాను బాబు.. ఉండడానికి స్థలం లేదు.. ఇద్దరు పిల్లలున్నారు.
సుజయ్: నీకు రేషను కార్డు ఉందా?
పాపారావు: ఉందండీ
సుజయ్: సరే నీకు ఇంటి స్థలం వచ్చేలా చేస్తాను..
సుజయ్: ఏమ్మా! నీ పేరేంటి. ఏమిటీ సమస్య
లక్ష్మి : నాపేరు లక్ష్మి నాయన.. మాది పక్క
ఊరు గున్నతోటవలస. మా ఇళ్లు కాలిపోయింది. అయినా ఇప్పటివరకూ ఇల్లు లేదు బాబు
సుజయ్: ఎన్నాళ్లు అయ్యింది కాలిపోయి?
లక్ష్మి: రెండు సంవత్సరాలు అయ్యింది.. ఎన్ని కాగితాలు పెట్టినా ఎవరు పట్టించుకోవడం లేదు.
సుజయ్: నేను అధికారులతో మాట్లాడతాను.. నీకు ఇళ్లు ఇచ్చేలా చేస్తాను...
సుజయ్: మీ పేరేమిటి... కాలనీలో సమస్యలు ఏమిటో చెప్పు?
శ్రీరాములు: నా పేరు శ్రీరాములు సార్.. తమరు మాకు కాలనీ ఇచ్చారు, కానీ సమస్యలు మాత్రం వదలడం లేదు..
సుజయ్: ఏమేమి సమస్యలున్నాయి.?
శ్రీరాములు: ఈ కాలనీకి బొబ్బిలి నుంచి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కోడి చెరువు పక్కనుంచి మధ్యాహ్నం రాలేకపోతున్నాం.. అసాంఘిక కార్యక్రమాలన్నీ ఆ రోడ్డులోనే జరుగుతున్నాయి సార్
సుజయ్: పోలీసులు ఎవరూ రారా అటువైపు..?
ఎల్లంనాయుడు: ఎప్పుడో ఫిర్యాదు ఇస్తే ఒకసారి అలా వచ్చి వెళ్లిపోతారు.. అంతే మళ్లీ మామూలే.
సుజయ్: కాలనీలో వీధిలైట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి?
బొంతు శ్రీరాములునాయుడు: లైట్లు ఇలా వేస్తే వారం రోజుల్లోనే అవి పోతున్నాయి.. ఎన్ని సార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు..
సుజయ్: నీ పేరేంటింటి తాతా?
చిన్నంనాయుడు: నా పేరు చిన్నంనాయుడు బాబు.. మీరు దయ ఉంచి కాలనీలో వీధిలైట్లు వెలిగేటట్టు చేయండి
సుజయ్: ఎక్కడా లైట్లు వెలగడం లేదా..అసలు వేయలేదా?..
చిన్నంనాయుడు: మెయిన్ రోడ్డు తప్పించి ఎక్కడా లైట్లు లేవు.. చీకటి పడితే పాములు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి.
అల్లు సింగమ్మ: పాములే కాదు బాబు.. దొంగల భయం కూడా ఉంది.. బళ్లు, బక్కలు ఏవీ వీధిలో ఉంచుకోలేక పోతున్నాం
సుజయ్: నీ పేరేంటమ్మ..
రత్నం: నా పేరు రెడ్డి రత్నం నాయన..
సుజయ్: ఎంత కాలం నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు..
రత్నం: కాలనీ కట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం బాబు.. కుళాయిలు లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది
సుజయ్: మరి మీకు నీరు ఎలా?
రత్నం: ట్యాంకరు వస్తుంది. అది కూడా రెండు రోజులకొకసారి. ఆ నీటినే జాగ్రత్తగా వాడుకోవాలి
సుజయ్: కాలనీలో బోర్లు ఉన్నాయి కదా. బాగోవా?
రత్నం: ఆ నీరు మట్టివాసన కొడుతున్నాయి బాబు..
సుజయ్: నీపేరేమిటి పాప (అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో)
స్రవంతి: నా పేరు స్రవంతి
సుజయ్: ఏం నేర్చుకుంటున్నావు.. పాటలు పాడడం వచ్చా.. ఏమైందీ ఈ పాపకు ?
కార్యకర్త: పుట్టిన దగ్గర నుంచి ఈ పాపకు రెండు కాళ్లు, చేతులు ఇలాగే ఉన్నాయి.
సుజయ్: ఈ పాప పేరు ఏమిటి?
కార్యకర్త: అలేఖ్య.. ఈయనే తండ్రి తాతారావు
తాతారావు: పుట్టినప్పటి నుంచి కాళ్లు చేతులు ఇలాగే ఉండిపోయాయి. ఏమి చేయాలో అర్థం కావడం లేదు..
సుజయ్: పాప ఏ పనీ చేసుకోలేదా?
తాతారావు: ఏ పనీ చేయలేదు..దేనికీ సహకరించవు కూడా...
సుజయ్: వయసు ఎంత ఉంటుంది?
తాతారావు: అయిదేళ్లు సార్
సుజయ్: ఈ పాపకు సరైన న్యాయం చేస్తాను.. సరేనా..
సుజయ్ : నీ పేరేంటమ్మ..?
శారద: నా పేరు శారద బాబు.. ఈ ఇంటి పక్కనే నలుగురు నడిచిన రోడ్డు ఉంది..అక్కడ విద్యుత్తు వైర్లు ఎలాడుతున్నాయి. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు..
సుజయ్: ఎన్నాళ్లు నుంచి ఉంది ఇది?
శారద: చాలా కాలం నుంచి ఉంది మధ్యలో స్తంభాలు వేసి వైర్లను మీదకు పెట్టాలి బాబు
సుజయ్: ఇక్కడ ఇళ్లన్నీ పునాదులు వేసి వదిలేశారు ఎవరూ కట్టరా..?
శారద: కట్టడానికి రెడీ అవుతున్న టైంలో ఇసుక ధరలు పెరిగిపోవడం వల్ల ఎవ్వరూ కట్టడానికి ముందుకు రావడం లేదు..
షేక్ షకీలా: బాబు..మేం కాలనీలో మొదటి విడతలో ఇళ్లు వచ్చిన వాళ్లం... మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు..
సుజయ్: ఏమిటీ మీ సమస్య?
షకీలా: ఎవరు ఏ పని చేసినా మొదట్లోనే చేస్తున్నారు గానీ ఇటువైపు ఎవరూ రావడం లేదు. నీళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నాం
సుజయ్: మీకు బోరింగు లేదా.. ట్యాంకరు రావడం లేదా?
షకీలా: బోరింగు ఆరు వీధుల తరువాత ఉంది.. ట్యాంకరు ఒక సారి వస్తే మరో సారి రాదు..
సుజయ్: నీ సమస్య ఏంటమ్మా?
రామలక్ష్మి: నా పేరు రామలక్ష్మి.. బాడంగి గూడేపువలస మాది. ఇక్కడకు వచ్చి ఉంటున్నాం. మా ఆయన మూగోడు, కొడుకు పరిస్థితి కూడా అంతే, అయినా పింఛను ఇవ్వడం లేదు..
సుజయ్: వికలాంగుల ధ్రువీకరణ పత్రం ఉంటే పింఛను ఇస్తారు కదా..?
రామలక్ష్మి: ఉన్నా ఇవ్వడం లేదు.. అద్దె ఇంట్లో ఉంటున్నాం.. చాలా ఇబ్బందిగా ఉంది.
సుజయ్: ఏం బాబు.. ఏం పేరు.. ఏం చేస్తున్నావు..?
శ్రీనివాసరావు: నా పేరు శ్రీనివాసరావు సార్.. నేను వృత్తివిద్యాకోర్సు చేస్తున్నాను. బొబ్బిలి పట్టణంలో తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది
సుజయ్: ఏమైంది..సమస్యేంటి?
శ్రీనివాసరావు: ఎప్పుడో వేసిన పాత రోడ్లే ఇంకా ఉన్నాయి. వాటిని విస్తరించకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి.
సుజయ్: అవును.. వాటి వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. రోడ్ల విస్తరణ కోసం మా ప్రయత్నాలు కూడా చేస్తున్నాం.
బబ్బులు: సార్ నా పేరు బబ్బులు.. ఇక్కడ మైయిన్ రోడ్డు తప్పించి మిగతా రోడ్లన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయి. పాములు తిరుగుతున్నాయి.
సుజయ్ : అవును.. అదే చూస్తున్నాను..
బబ్బులు: మొదట వేసిన రోడ్లును అలాగే వదిలేశారు. మున్సిపాలిటీ అసలు పట్టించుకోవడం లేదు..చైర్‌పర్సన్‌ను చూడడానికి రమ్మంటే ఈ చివరకు అసలు రానేలేదు..
సుజయ్: నీ సమస్య ఏంటమ్మా?
రామలక్ష్మి: నా సమస్య కాదు సార్.. ఈ కు ర్రోడు వికలాంగుడు..ఎవరూ లేరు. సర్టిఫికెట్ ఉన్నా ఫించను ఇవ్వడం లేదు సార్
సుజయ్: ఎన్నాళ్లుగా రావడం లేదు..
రామలక్ష్మి: అయిదేళ్లుగా రావడం లేదు.
సుజయ్ : సరే చూస్తాను... ఏమండీ సర్పంచ్ గారు, మీ సమస్యేంటి?
ఈశ్వరరావు: మా గున్నతోటవలస గ్రామానికి చెందిన 25 ఇళ్లు ఈ కాలనీ శివారున ఉన్నాయి సార్.. వాటికి విద్యుత్ సమస్య, రోడ్డు ఇబ్బంది ఉంది..
సుజయ్: విద్యుత్ సమస్య ఏంటి?
ఈశ్వరరావు: ఊర్లోంచి వచ్చే మెయిన్ విద్యుత్ వైరుకు ఎక్కడా స్తంభాలు వేయలేదు. దాంతో మధ్యలో ఇళ్ల మీద నుంచి వైర్లు రావడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది.
సుజయ్: సరే...మధ్యలో స్తంభాలు వేసేలా చూస్తా..
నీ పేరు ఏంటి మామ్మా?
శాంత: నా పేరు పిట్ల శాంత బాబు..
సుజయ్: చెప్పు నీ సమస్యేంటో?
శాంత: ఈ మధ్యను నాకు రెండు నెలల పింఛ ను ఇచ్చారు బాబు.. దానిలో 5 వందలు ఇరుపుకొంటున్నారు.. ఇలాగైతే మేం ఎలా బతకాలి
సుజయ్: ఎవరు తీసుకుంటున్నారు... ఎందుకు తీసుకుంటున్నారో అడగలేదా..?
శాంత: పెన్సన్ ఇచ్చిన రామారావే ఇరిపేశారు.. ఎందుకో చెప్పడం లేదు..
సుజయ్: పింఛను తీసుకుంటున్నవారు ఎవరికి డబ్బులు ఇవ్వక్కరలేదు.. అలా అడిగితే మీ కౌన్సిలర్లకు చెప్పండి.. వెయ్యి ఇస్తేగాని వేలి ముద్ర వేయకండి
ఇందిర: సార్.. నా పేరు ఇందిర..నేను ఐద్వా జిల్లా నాయకురాలిగా పనిచేస్తున్నాను..
సుజయ్: చెప్పండమ్మా....
ఇందిర : ఈ కాలనీ ఉన్న వాళ్లకు టౌన్‌లో రేషను సరుకులు ఇస్తున్నారు.. అవి విడిపించడానికంటే వాటికి కాలనీకి తీసుకురావడానికే ఎక్కువ ఖర్చు అవుతోంది.
సుజయ్: సరుకుల కోసం ఎక్కడెక్కడకు వెళతారు ?
ఇందిర: గతంలో ఈ కాలనీకి రాకముందు ఎక్కడున్నారో ఆ వీధుల్లోకే వెళ్లి తెచ్చుకోవాలి సార్, వీళ్లు వెళ్లేసరికి డిపో తీయకపోతే తిరుగుతుండడమే పని. ఈ కాలనీకి ప్రత్యేకమైన డిపోను ఏర్పాటు చేయించాలి సార్.
సుజయ్: తప్పకుండా అలాగే ఏర్పాటు చేయిస్తాను. నీ పేరేంటమ్మా?
భారతి: వియ్యపు భారతి సార్.. నా భర్త చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చినా పింఛను మంజూరు చేయలేదు.. సార్
అప్పారావు: సార్ .. నాకు భూములున్నాయని పింఛను తీసేశార్ సార్.
సుజయ్: ఎన్నాళ్లు నుంచి పింఛను తీసుకుంటన్నారు. ?
అప్పారావు: 20 ఏళ్లుగా పింఛను తీసుకుంటున్నాను. సెంటు భూమి లేదు..ఎవరు చెప్పారో తీసేశారు. సార్..
సుజయ్: ఏమైందయ్యా నీకు..ఏం పేరు నీ పేరు?
సత్యారావు: కోట సత్యారావు సార్.నేను ఒకటో వార్డుకు చెందిన వాడిని. నాకు వికలాంగుడి ధ్రువీకరణ పత్రం ఉన్నా ఫించను మాత్రం ఇవ్వడం లేదు..
సుజయ్: ఏమంటున్నారు..ఎందుకు ఇవ్వడం లేదు.?
సత్యారావు: ఏమీ చెప్పడం లేదు.. ఈ సర్టిఫికెట్ చేయించుకోవడానికే నాలుగు వేలు ఖర్చు పెట్టాను..
సుజయ్: సరే నేను చూస్తాను.
అక్కడ నుంచి కొత్తగా పెట్టిన పాఠశాలకు వెళ్లారు.. మాస్టారు ఇక్కడ ఎంత మంది చదువుతున్నారు?
సత్యనారాయణ: ఇక్కడ ప్రస్తుతం 25 మంది ఉన్నారండీ.. కానీ ఈ కాలనీలో సుమారు 50 మందికి పైగా పిల్లలున్నారు..
సుజయ్: ఇక్కడకు ఎప్పుడు వచ్చారు.. మీరు డెప్యుటేషన్‌పై వచ్చారా.?
సంతోష్‌కుమార్: ఆగస్టు నెలలో ఇక్కడ స్కూలు పెట్టారు సార్.. టౌన్‌లో రెండు స్కూళ్లు మూసేసి ఇక్కడ పెట్టారు. మమ్మల్ని బదిలీపై వేశారు..
సుజయ్: అదేంటి ఇక్కడ గతంలో స్కూలు లేకుండా బదిలీపై ఎలా వేశారు?
సత్యనారాయణ: ఏమో సార్ ఆర్డర్ అలా ఇచ్చారు..
సునీత: నమస్తే సార్, నేను ఇక్కడ మధ్యాహ్న భోజనాన్ని నడుపుతున్నాను..
సుజయ్: చెప్పమ్మా! నీ సమస్య ఏంటో..?
సునీత: స్కూలు ఇక్కడ పెట్టినా వంటకు ఇక్కడ స్టవ్, గ్యాస్, వంట పాత్రలు వంటివి ఇవ్వలేదు. రోజూ ఇంటి దగ్గర వండి తెస్తున్నాను.
సుజయ్: బిల్లులు ఇచ్చేస్తున్నారా..?
సునీత : రెండు మాసాలుగా అదీ లేదండీ
ధనలక్ష్మి: సార్ నమస్తే సార్.. నా పేరు ధనలక్ష్మి.. నేను ఇందిరా గాంధీ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాను.
సుజయ్: నమస్తే చెప్పమ్మా! ఏం చదువుతున్నావు
ధన లక్ష్మి: బీకాం ఫస్ట్ ఇయర్ సార్..మాకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం.
సుజయ్: నీ పేరేంటమ్మా
తులసి: నా పేరు తులసి., మేం నక్కలోల్లం సార్.. మమ్మల్ని ఎస్టీలో కలపాలని ఎన్ని సార్లు కోరుతున్నా అది జరగడం లేదు. సార్
సుజయ్: గతంలో ఎక్కడైనా ఎస్టీలో చేర్చినట్లు ఇచ్చారా?
తులసి: చోడవరంలో ఇచ్చారు సార్.. అది చూపించినా ఇక్కడ ఇవ్వడం లేదు.. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు..
సుజయ్: దీనిని గవర్నమెంటు దృష్టికి తీసుకెళ్తాను.. ఏమ్మా: పిల్లల్ని బడికి పంపుతున్నారా..
మర్రి ఉమ: లేదండీ...
సుజయ్: పంపకుండా ఏమి చేస్తున్నారు..?
ఉమ: వాళ్లు పనికి వెళితే మా కడుపులు ఎలా నిండుతాయి. బాబు..
సుజయ్: మీ కడుపులు నిండడానికి, వాళ్లని పనిలో పెడతారా... ఇక్కడే ఉన్న స్కూలుకు పంపండి అక్కడ భోజనాలు పెడతారు..చదువులు చెబుతారు సరేనా..
నారాయణమ్మ: బాబూ ఇక్కడ ఉన్న బావి ప్రమాదకరంగా ఉంది.
సుజయ్: దీని గురించి అధికారులకు చెప్పలేదా..?
నారాయణమ్మ: చెబుతున్నా పట్టించుకోవడం లేదు.. ఈ బావి నీరు తోడేసి రాతికట్టు కట్టి గట్టు ఎత్తు చేయాలి. అలాగే ప్లాట్‌పారం కట్టాలి బాబు..
సుజయ్: సరే చూద్దాం.. మీకు రుణమాఫీ అందుతుందా?
నారాయణమ్మ: ఏం అందడం సార్.. చంద్రబాబు అసలు కట్టవద్దంటే మానేశాం. ఇపుపడు వడ్డీల కింద బ్యాంకులో ఉన్న డబ్బుల్ని ఇరుపుకుంటున్నారు.
సుజయ్: ఇప్పటివరకూ ఎంత జమచేశారు?
నారాయణమ్మ: 5 లక్షలు తెచ్చాం సార్... నెలకు పది వేలు చొప్పున ఆరుమాసాలకు 60 వేలు ఇరిపేశారు.
సుజయ్: మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు..?
నారాయణమ్మ: రుణమాఫీ సంగతి దేవుడెరుగు వడ్డీలు పడకుండా ప్రతీ నెలా కట్టేస్తున్నాం.
సరే వస్తానమ్మా...