విశాఖ ఐటీ రివర్స్‌ గేర్‌! | Visakha IT Rivers Gear! | Sakshi
Sakshi News home page

విశాఖ ఐటీ రివర్స్‌ గేర్‌!

Published Wed, Aug 15 2018 4:45 AM | Last Updated on Thu, Sep 27 2018 3:58 PM

Visakha IT Rivers Gear! - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:‘‘హైదరాబాద్‌ సిటీని ప్రపంచంలోనే గొప్ప ఐటీ హబ్‌గా అభివృద్ధి చేసింది నేనే. దేశంలో ఐటీకి ఆద్యుడిని నేనే. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టా. కొత్తగా సైబరాబాద్‌ అనే నగరాన్నే సృష్టించా’’... ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) ప్రస్తావన వచ్చినప్పుడల్లా సీఎం చంద్రబాబు కచ్చితంగా చెప్పే మాటలివీ. ఐటీ తనతోనే మొదలైందని తరచూ చెప్పుకునే చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ఈ రంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొం టోంది. ప్రభుత్వ ప్రోత్సాహం లేక ప్రముఖ ఐటీ కంపెనీలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. పక్క రాష్ట్రాలకు తరలివెళ్తున్నాయి. రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య, ఐటీ ఆధారిత ఎగుమతులు గణనీయంగా పడిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబు హయాంలో ‘అయ్యో పాపం.. ఐటీ’ అనే పరిస్థితి ఉత్పన్నమైంది. 

హైదరాబాద్‌ తర్వాత ఐటీ బూమ్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్న విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రం చేస్తామని, నవ్యాంధ్రలో ఐటీ రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చిన ప్రముఖ కంపెనీలే తప్ప ఇప్పటిదాకా కొత్తగా ఒక్క బహుళ జాతి సంస్థ కూడా విశాఖకు తరలిరాలేదు. మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఒరాకిల్‌ కార్పొరేషన్‌ వంటి ప్రఖ్యాత కంపెనీలు విశాఖలో లేవు. కేవలం విప్రో, టెక్‌ మహేంద్ర వంటి ప్రముఖ ఐటీ కంపెనీల కార్యాలయాలే ఉన్నాయి. ఈ రెండూ కూడా వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రారంభించేందుకు ముందుకొచ్చాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో విశాఖపట్నంలో 18 వేల మంది ఐటీ ఉద్యోగులుండేవారు. ఈ నగరం నుంచి ప్రతిఏటా దాదాపు రూ.2 వేల రూ.కోట్ల ఐటీ ఆధారిత ఎగుమతులు జరిగేవి. విశాఖ నుంచి ఐటీ ఆధారిత ఏగుమతులు ప్రస్తుతం రూ.1,445 కోట్లకు పడిపోయాయి. ఇక్కడ ఇప్పుడున్న ఐటీ ఉద్యోగుల 16,988 మాత్రమే కావడం గమనార్హం.  కాలానుగుణంగా ఐటీ ఉద్యోగాలు, ఎగుమతులు పెరగాల్సింది పోయి తగ్గుముఖం పట్టడం గమనార్హం. 

నామమాత్రంగా నడుస్తున్న విప్రో 
వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో విప్రోకు స్థలం కేటాయించగా, నిర్మాణాలు పూర్తి చేసుకుని 2012లో లాంఛనంగా ప్రారంభమైంది. కొద్దికాలం బాగానే కార్యకలాపాలు సాగించిన విప్రో గత నాలుగేళ్లుగా నామమాత్రంగా నడుస్తోంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి విప్రో క్యాంపస్‌ సెలక్షన్లకు ఎంపికైన వారికి శిక్షణ, బేసిక్‌ ఆపరేషన్స్‌ మినహా విప్రో ప్రస్తుతం ఎలాంటి కార్యకలాపాలు చేపట్టడం లేదు. ప్రస్తుతం ఈ సంస్థలో కేవలం 250 మంది పనిచేస్తున్నారు. ఇక వైఎస్‌ లాంఛనంగా ప్రారంభించిన టెక్‌ మహేంద్రలో మాత్రమే ఐటీ కార్యకలాపాలు ఓ మాదిరిగా నడుస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వైఎస్‌ హయాం అనంతరం నిర్మాణం పూర్తి చేసుకున్న టెక్‌ మహేంద్ర–2(రెండో బిల్డింగ్‌) చాలా ఏళ్లపాటు ఖాళీగానే ఉంది. ఇటీవలే ఈ బిల్డింగ్‌లో క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్‌(సీఎంఎం) స్థాయి లేని 8 చిన్నపాటి కంపెనీల ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

వచ్చినవి చిన్నాచితక కంపెనీలే 
రాష్ట్ర ఐటీ మంత్రిగా నారా లోకేశ్‌ బాధ్యతలు చేపట్టాక ప్రతిసారీ విశాఖను ఐటీ హబ్‌గా చేస్తామని ప్రకటనలు చేసి వెళ్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక  ఈ నాలుగున్నరేళ్లలో క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్‌(సీఎంఎం) స్థాయి ఉన్న కంపెనీ ఒక్కటి కూడా విశాఖకు రాలేదు.  నగరంలోని వీఐపీ రోడ్‌లోని పాంటలూన్‌లో, వుడా కాంప్లెక్స్‌లో, టెక్‌ మహేంద్ర–2లో,  మధురవాడ ఐటీ హిల్స్‌–1, 2, 3లలో నెలకొల్పినవన్నీ చిన్నపాటి సంస్థలే కావడం గమనార్హం. ‘‘వైఎస్‌ హయాంలో ప్రముఖ కంపెనీలకు స్థలం కావాలంటే వెంటనే ఇచ్చేవారు. మౌలిక సదుపాయాలు సమకూర్చేవారు. ఇప్పుడు విశాఖలో స్థలం కావాలంటే ముందుగా మంత్రి లోకేశ్‌ను కలవాలి. చాలా ‘ఫార్మాలిటీస్‌’ పూర్తయిన తర్వాత సీఎం చంద్రబాబును  కలవాలి. మళ్లీ అక్కడ ‘ఫార్మాలిటీస్‌’ పూర్తి చేసుకున్న తర్వాతే స్థలం వస్తుంది. ఇదంతా ఎందుకని ప్రముఖ కంపెనీలు విశాఖకు దూరంగా ఉంటున్నాయి. అందుకే ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క ప్రముఖ కంపెనీ కూడా విశాఖకు రాలేదు’’ అని నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థ అధినేత వ్యాఖ్యానించారు. 

మూతపడుతున్న కంపెనీలు 
విశాఖలో ఐటీ... వెరీ పిటీ అన్నట్టుగా తయారైంది. మాట్లాడితే ఐటీ హబ్‌ అంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు సర్కారు కార్యాచరణలో మాత్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. కొత్తగా ఐటీ కంపెనీలకు స్థలాల కేటాయింపు సంగతి పక్కనపెడితే ప్రస్తతం కేటాయించిన ఐటీ పార్కులు సైతం చాలావరకు ఖాళీ అయిపోతున్నాయి. 

సగానికి పైగా స్పేస్‌ ఖాళీ 
విశాఖపట్నంలోని ఐటీ సెజ్‌తోపాటు ఐటీ పార్కుల్లో ఉన్న విస్తీర్ణంలో సగానికి పైగా ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఉన్న ఐటీ పార్కులు, ఇంక్యుబేషన్‌ సెంటర్లు, స్టార్టప్‌ విలేజ్‌లలో 7,41,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఐటీ స్పేస్‌ ఉంటే..  అందులో 4,67,500 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఐటీ స్పేస్‌ ఖాళీగా ఉంది. రుషికొండ ఐటీ హిల్స్‌తోపాటు వీఐపీ రోడ్‌లో సైతం ఐటీ స్పేస్‌ ఖాళీగానే ఉంది. విప్రో బిల్డింగ్స్‌లో ఉన్న కంపెనీలన్నీ సెజ్‌లో మారేందుకు దరఖాస్తు చేసకున్నాయి. ఇక రుషికొండ హిల్‌–3లో స్టార్టప్‌ విలేజ్‌కు, ఇన్నోమైన్డ్‌ కంపెనీకు స్థలం ఇవ్వగా కేవలం 6,500 చదరపు అడుగుల ప్రాంతాన్ని మాత్రమే వినియోగించుకోగలుగుతున్నాయి. 

ఐటీ హబ్‌.. ప్రకటనలకే పరిమితం 
విశాఖను ఐటీ హబ్‌గా మార్చాలంటే కనీసం 10 వేల ఎకరాల భూమి అవసరమని, అందులో కనీసం నాలుగో వంతు భూములు కూడా అందుబాటులో లేవని ఐటీ శాఖ మంత్రి లోకేష్‌ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అందుబాటులో ఉన్నంత వరకు తగరపువలస వద్ద రాజాపు లోవ– చెరుకుపల్లి ప్రాంతంలో 100 ఎకరాలు, నరవ వద్ద 40 ఎకరాలు, నడిపూడి వద్ద 440 ఎకరాలు, కాపులుప్పాడ వద్ద 1,350 ఎకరాలను గుర్తించారు. వీటిని ఐటీ సంస్థలకు కేటాయించేందుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో 5 వేల స్టార్టప్‌ కంపెనీలను ఏర్పాటు చేయిస్తామని, తొలిదశలో 500 కంపెనీలు విశాఖకు వస్తాయని రెండేళ్ల క్రితం సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు విశాఖలో ఓ ఐటీ స్టార్టప్‌ విలేజ్‌ మాత్రమే వచ్చింది. 

వచ్చే వాటి కంటే మూతపడేవే ఎక్కువ 
విశాఖపట్నంలో గడిచిన నాలుగున్నరేళ్లలో వచ్చిన కంపెనీల కంటే మూతపడ్డ కంపెనీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మధురవాడ ఐటీ సెజ్‌తోపాటు విశాఖ సిటీ పరిధిలోని సత్యం జంక్షన్, వీఐపీ రోడ్, సీతమ్మధారల్లోని వుడా కాంప్లెక్స్‌లో మొత్తం 128 ఐటీ కంపెనీలున్నాయి. ఐటీ హిల్‌–2లో ఏడాది క్రితం ఓ సంస్థ 300 మందికి ఉద్యోగాలిచ్చి ఐదు నెలలు పనిచేయించుకుంది. చివరికి వారికి పైసా కూడా జీతం ఇవ్వకుండానే చేతులెత్తేసింది. ద్వారకానగర్‌లోని ఓ కన్సెల్టెన్సీ సంస్థ కూడా ఇదే రీతిలో గతేడాది బోర్డు తిప్పేసింది. మర్రిపాలెంలో మరో ఐటీ కంపెనీ ఇటీవలే మూతపడింది. ఇలా విశాఖలో ఐటీ సంస్థలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఐటీ హీల్స్‌లోని పలు కంపెనీల్లో ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఆరంభంలో ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, భూముల కోసమే కొన్ని ఐటీ కంపెనీలు ముందుకొచ్చాయి. రాయితీలు వస్తాయనుకుని వచ్చామని, కేటాయించిన భూమి కూడా తమ పేరు మీద లేకపోవడంతో బ్యాంకర్లు, ఫైనాన్స్‌ సంస్థలు రుణాలు ఇవ్వడం లేదంటూ కొన్ని సంస్థలు విశాఖపట్నం నుంచి బిచాణా ఎత్తేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement