సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టును తొలి దశలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ నిర్మించేందుకు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ) సన్నాహాలు చేస్తోంది. కేవలం నగరంలోనే మెట్రో రైలు నడపడం వల్ల భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాలను తీర్చలేమన్న ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చింది. అంతర్జాతీయ విమానాశ్రయంగా ఏర్పడే భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ లైట్ మెట్రో రైలు ప్రాజెక్టును తొలి దశలో నిర్మిస్తేనే ప్రయోజనం ఉంటుందని అంచనాకు వచ్చినట్లు ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు కారిడార్లు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అనుసంధానం కాకపోవడం ఒక లోపంగా మారింది. అలాంటి పరిస్థితి విశాఖలో ఉత్పన్నం కాకుండా చూడాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
విశాఖపట్నంలో 46.40 కిలోమీటర్ల మేర మూడు లైట్ మెట్రో కారిడార్లు నిర్మించాలని గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం మొత్తాన్ని కలుపుతూ 140 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో కారిడార్లను ప్రతిపాదించింది. అందులో కొమ్మాది–ఆనందపురం జంక్షన్, ఆనందపురం జంక్షన్–భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ ప్రతిపాదించిన కారిడార్లను రెండో దశలో నిర్మించాలని తొలుత భావించారు. కానీ, భోగాపురం ఎయిర్‌పోర్టుతో తొలి దశలోనే నగరాన్ని అనుసంధానిస్తే బాగుంటుందన్న అంచనాతో రోడ్ మ్యాప్ రూపొందించారు.
డీపీఆర్, టెండర్ల ప్రక్రియ ఒకేసారి
తొలి దశలో స్టీల్‌ప్లాంట్–కొమ్మాది జంక్షన్, గురుద్వారా–పాత పోస్టాఫీస్, తాటిచెట్లపాలెం–ఆర్‌కే బీచ్, కొమ్మాది–ఆనందపురం జంక్షన్, లా కాలేజి–మరికివలస, ఆనందపురం జంక్షన్–భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ 79.91 కిలోమీటర్ల మేర ఆరు కారిడార్ల నిర్మాణం చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్, యూఎంటీసీ, రైట్స్ సంస్థలను సంప్రదించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెప్పారు. డీపీఆర్‌కి సమాంతరంగా ఈ ఆరు కారిడార్ల నిర్మాణానికి ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో టెండర్లు పిలిచే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తద్వారా మూడు నెలల్లో డీపీఆర్ సిద్ధమయ్యేటప్పటికి నిర్మాణ సంస్థను కూడా ఎంపిక చేసి, వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు.
రెండో దశలో ట్రామ్ వ్యవస్థ!
రెండో దశలో 60.2 కిలోమీటర్ల మేర నిర్మించే ఎన్‌ఏడీ జంక్షన్–పెందుర్తి, స్టీల్‌ప్లాంట్–అనకాపల్లి, పాత పోస్టాఫీస్–రుషికొండ బీచ్, రుషికొండ బీచ్–భీమిలి బీచ్ కారిడార్లను ఆధునిక ట్రామ్ వ్యవస్థలుగా నిర్మించాలని భావిస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం తొలి దశలో చేపట్టే ఆరు కారిడార్లలో జన సమ్మర్థం ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో వాటిని లైట్ మెట్రోగా, రెండో దశలో చేపట్టే కారిడార్లలో జన సమ్మర్థం తక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో ట్రామ్ వ్యవస్థను ప్రతిపాదిస్తున్నారు. పూర్తిస్థాయిలో అధ్యయనం తర్వాతే దీనిపై తుదినిర్ణయం తీసుకోనున్నారు. కానీ, ముందస్తు అంచనాతో ట్రామ్ వ్యవస్థపైనా డీపీఆర్ తయారు చేయించాలని నిర్ణయించారు. మొదటి దశ కారిడార్లను ఈ సంవత్సరమే ప్రారంభించి 2024 నాటికి, రెండో దశను 2023లో ప్రారంభించి 2028–29 నాటికి పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు ఏఎంఆర్‌సీ అధికారులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment