విమానాశ్రయం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయం ప్రయాణికుల సంఖ్యలోనే కాదు.. ఎయిర్ కార్గో హ్యాండ్లింగ్‌లోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. ఏటికేడాది కార్గో రవాణాలో ముందుకు దూసుకువెళ్తోంది. ఇటీవల ఎయిర్‌పోర్టు సర్వీస్ క్వాలిటీలో ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) ఇచ్చిన ర్యాంకింగ్‌లో విశాఖ విమానాశ్రయం 173 నుంచి 112వ ర్యాంకు సాధించింది. ఈ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2016–17లో 2.33 మిలియన్ల మంది ప్రయాణించగా, 2017–18లో ఆ సంఖ్య 2.48 మిలియన్లకు పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ విమానాశ్రయం టెర్మినల్ బిల్డింగ్‌ను 19,800 నుంచి 29,650 చదరపు మీటర్లకు విస్తరిస్తున్నారు. అలాగే ఎయిర్‌క్రాఫ్ట్‌ల పార్కింగ్ సదుపాయాన్ని 8 నుంచి 16కి పెంచారు. మరోవైపు డొమెస్టిక్ (దేశీయ) కార్గో రవాణాలో గత ఏడాది తొలి త్రైమాసికానికి 1,283 టన్నుల కార్గో రవాణా చేయగా ఈ ఏడాది అది 15.43 శాతం పెరిగి 1,481 టన్నులకు చేరింది. 2017–18 మొత్తమ్మీద 4,846 టన్నుల కార్గో రవాణా నిర్వహించింది.
రికార్డు స్థాయిలో వృద్ధి
విశేషమేమిటంటే ఈ ఏడాది తొలి క్వార్టరు రికార్డు స్థాయిలో అంతర్జాతీయ కార్గో రవాణాలో 747 శాతం వృద్ధి సాధించింది. గత సంవత్సరం తొలి క్వార్టరులో 15.70 టన్నుల అంతర్జాతీయ కార్గో రవాణా జరగగా, ఈ ఏడాది అది 133 టన్నులకు పెరిగింది. కార్గో రవాణాలో రొయ్యలు, ఫార్మా ఉత్పత్తులు, బ్రాండిక్స్‌లో తయారైన దుస్తులు, వజ్రాల ఎగుమతులు ఎక్కువగా ఉంటున్నాయి.
ఇలా చేస్తే ఇక దూసుకుపోవడమే..
హైదరాబాద్, చెన్నైకంటే కార్గో హ్యాండ్లింగ్ చార్జీలు విశాఖలో 20 శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ప్రగతి కనిపిస్తోంది. అవే రాయితీలు ఈ విమానాశ్రయానికి కూడా అమలు చేస్తే మరింత గణనీయమైన వృద్ధి సాధించడానికి వీలవుతుందని వ్యాపారవేత్తలు, ఎగుమతిదార్లు, ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ విమానాశ్రయం నుంచి కార్గో రవాణా మరింత విస్తృతం కావాలంటే మరికొన్ని చర్యలు తీసుకోవాలని వీరు సూచిస్తున్నారు. అంతర్జాతీయ ఎయిర్ కార్గో కాంప్లెక్స్, దేశీయ కార్గోలో మౌలిక వసతుల విస్తరణ, పచ్చి సరకులు చెడిపోకుండా టెంపరేచర్ కంట్రోల్ జోన్, డ్రగ్ కంట్రోల్, యానిమల్ క్వారంటైన్ ఆఫీసర్ల నియామకం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. వీటిని సమకూర్చడంతో పాటు రాయితీలిస్తే ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులను ఇతర రాష్ట్రాల ఎయిర్‌పోర్టు నుంచి కాకుండా విశాఖ విమానాశ్రయం ద్వారా జరిపే వీలుంటుందని విశాఖ డెవలప్‌మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడు ఒ.నరేష్‌కుమార్, ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డీఎస్ వర్మ ‘సాక్షి’తో చెప్పారు.
ఆంక్షల ఎత్తివేతతో ఊరట
అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ విమానాశ్రయంపై నావికాదళం పౌర విమానాల రాకపోకలపై ఇటీవల ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తం కావడంతో కొద్దిరోజుల్లోనే నేవీ ఆంక్షల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ తరుణంలో ఇప్పుడు కార్గో రవాణా కూడా ఊపందుకోవడంపై విశాఖ వ్యాపార, వాణిజ్య వర్గాల్లో ఒకింత ఆనందం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment