‘‘విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎయిర్‌కార్గో అంతర్జాతీయ కేంద్రంగా రూపొందిస్తాం. ఇపుడున్న స్థాయి చాలదు. ఇంకా 105 టన్నుల సామర్థ్యాన్ని మోసే విమానాలు వస్తే ఇపుడున్న సదుపాయాలు చాలవు. అందుకే విశాఖ విమానాశ్రయాన్ని భోగాపురానికి తరలించనున్నాం. ఇక్కడ కోస్తాంధ్ర వ్యాపార, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా చేస్తాం. విశాఖలో ఉండాల్సిన విమానాశ్రయం భోగాపురానికి తరలిస్తే ప్రయాణికులకు వచ్చే నష్టం ఏముంది?‘‘ ఇవీ.. ఇటీవల కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పత్రికల ముందు చేసిన వ్యాఖ్యలు. దీన్నిబట్టి విశాఖ విమానాశ్రయం బిచాణా ఎత్తివేత దాదాపు ఖరారైనట్లుగా భావించవచ్చు!
గోపాలపట్నం: అదిగదిగో.. అక్కడే.. ఎన్‌ఏడీ జంక్షన్‌కు సమీపంలోనే విశాఖ విమానాశ్రయం ఉండేది. ఇప్పుడు భోగాపురానికి తరలిపోయింది... విశాఖ విమానాశ్రయం గురించి ఇలా చెప్పుకునే రోజులు సమీపిస్తున్నాయి. అంటే ఆర్థిక రాజధాని అయిన విశాఖలో అసలు విమానాశ్రయమే లేదా? పొరుగున ఉన్న విజయనగరానికి తరలిపోయిందా అని ఆశ్చర్యపోయే పరిస్థితి దాపురించనుంది. ఇలా ఎందుకు జరగకూడదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ప్రశ్నిస్తుండడంతో కోస్తాంధ్ర ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విశాఖ విమానాశ్రయం చివరికి ఓ జ్ఞాపకంగా మిగిలిపోనుందా అన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
విశాఖ విమానాశ్రయం ఇక కార్గో కాంప్లెక్స్‌కే..
ఇక్కడ పాత టెర్మినల్ భవనంలో దేశీయ కార్గో సర్వీసులు రెండేళ్ల క్రితం ప్రారంభం కాగా, తాజాగా అంతర్జాతీయ కార్గో సర్వీసులూ ప్రారంభమయ్యాయి. శ్రీలంక, దుబాయ్, సింగపూర్, కౌలాలంపూర్‌లకు అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో రోజుకు మూడు టన్నుల నుంచి నాలుగు టన్నుల కార్గో ఉత్పత్తులు దేశీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో విశాఖ విమానాశ్రయాన్ని మొత్తంగా భోగాపురానికి తరలించి ఇక్కడ కేవలం ఎయిర్‌కార్గోని మాత్రమే అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర పౌర విమాన యానశాఖమంత్రి అశోక్‌గజపతిరాజు కొద్ది రోజుల క్రితం స్పష్టం చేశారు.
వదులుకోవడం దేనికి?
విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విశాఖ నుంచి వెళ్లిపోవడాన్ని ఎలా వదులుకుంటామని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. విశాఖ అంతర్జాతీయ ఎయిర్‌కార్గో ద్వారా ప్రస్తుతం మూడు నుంచి నాలుగు టన్నుల ఎగుమతి దిగుమతులు దేశీయ, అంతర్జాతీయంగా జరుగుతున్నాయి.ఇపుడు విశాఖకు వస్తున్న అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణికుల పరిమితి కాక మూడు టన్నుల సరకులు రవాణా చేసే వీలుంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద బోయింగ్ 747లో ప్రయాణికులు లేకుండా ఒకేమారు 43టన్నుల సరకు తీసుకెళ్లే వీలుంది. ఎయిర్‌బస్ 300లో ప్రయాణికులు లేకుండా 43టన్నులు తీసుకెళ్లవచ్చు. బోయింగ్ 727లో 27 టన్నుల సరకు రవాణాకు వీలుంది. అంత మహాపట్టణంగా ఉన్న ఢిల్లీలోనే అశోక్ గజపతిరాజు చెప్పినట్లు 105 టన్నుల సామర్థ్యం మోసే విమానాలు తిరగడం లేదు. ఇలాంటి తరుణంలో బలవంతంగా విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భోగాపురానికి ఎందుకు తరలించాలని పలువురు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ ప్రస్థానం...
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నేవీ అవసరాల కోసం ఏర్పాటైన విశాఖ విమానాశ్రయం 1960 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో 4 వేల అడుగుల పొడవున రన్‌వేతో చిన్న టెర్మినల్ ఉండేది. పదుల సంఖ్యలో ప్రయాణికులుండేవారు. హైదరాబాదు నుంచి విశాఖకు ఒక్క విమానమే నడిచేది. 1970లో మరో టెర్మినల్ బిల్డింగ్, 6500 అడుగుల పొడవైన రన్‌వే విస్తరించుకుంది. 2009లో అంతర్జాతీయస్థాయిలో 10030 అడుగుల రన్‌వేతో రూపుదిద్దుకుంది. ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి కేంద్రం రూ.315కోట్ల నిధులు వెచ్చించగా, నేవీ రూ.100 కోట్ల ఖర్చు చేసింది. నేవీకి, పౌరవిమానాయానశాఖకు సఖ్యత ఉండడంతో 24గంటల విమానాశ్రయ నిర్వహణకు అనుమతులొచ్చాయి. తర్వాత ఇక్కడ అంతర్జాతీయ టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. కావాల్సిన అన్ని సదుపాయాలూ ఏర్పాటయ్యాయి. ఏటా మొత్తంమ్మీద 23.50లక్షల వరకూ ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విమానాలు, దేశీయవిమానాలు పెరగడంతో ఇక్కడ మరో ఆరు పార్కింగ్ బేలు కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించారు. రేపోమాపో ప్రారంభించనున్నారు. దేశీయ విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం వేర్వేరుగా ఏర్పాటవుతున్నట్లు చెబుతుంటే ప్రయాణికులు ఆనందిస్తున్నారు. అయితే ఇంత అభివృద్ధి జరిగాక, ఈ విమానాశ్రయాన్ని ఇక్కడి నుంచి విజయనగరం జిల్లా భోగాపురానికి తరలించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతుండడం ఎవరికీ మింగుడుపడని విషయం. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని అనుమతులూ వచ్చినట్లు తెలుస్తోంది.
98శాతం ప్రయాణికుల వ్యతిరేకత
విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురానికి తరలిపోతుందన్న నిజాన్ని ప్రయాణికులు జీర్ణించుకోలేకపోతున్నారు. మా సంఘం చేపట్టిన సర్వేలో 98 శాతం ప్రయాణికులు విశాఖ విమానాశ్రయాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకా స్థలం ఉంది. అంతర్జాతీయ కార్గోకు సరిపడా సదుపాయం ఉంది. ఇలాంటపుడు మార్పు అవసరం లేదు. కావలిస్తే భోగాపురాన్ని ఉడాన్ టైప్ టూ విమానాశ్రయంగా రూపొందించుకోవచ్చు. – డి.వరదారెడ్డి, భారత విమానప్రయాణికుల సంఘ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment