![Visakhapatnam Joint Collector Provide Shelter To Migrants Workers - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/27/lock-down-777.jpg.webp?itok=MHCcEnJv)
వసతి కేంద్రాల్లో విశ్రాంతి తీసుకుంటున్న వలస కార్మికులు, వలస కూలీలకు నిత్యావసర కిట్లు పంపిణీ చేస్తున్న అధికారులు
సాక్షి,విశాఖపట్నం: హఠాత్తుగా వచ్చిన లాక్‌డౌన్.. వలస కూలీల బతుకులపై పిడుగు పడేలా చేసింది. పొట్ట చేత పట్టుకొని ఊరుగాని ఊరు వచ్చిన వలస జీవుల్ని.. కంటికి కనిపించని కరోనా మహమ్మారి రోడ్డున పడేసింది. పనితోనే జీవితాలు ముడిపడి ఉండే వారంతా.. ఉన్న ఊరిలో ఉండలేక.. సొంత ఊరికి చేరలేక అనాథలుగా మారిన వారిని.. ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. వారి జీవన గమనానికి భరోసా ఇస్తూ ఆదుకుంటోంది. నిత్యావసరాలు పంపిణీ చెయ్యడంతో పాటు.. తలదాచుకునేందుకు షెల్టర్లు ఏర్పాటు చేస్తూ.. వారికి ఏలోటూ రానీయకుండా చర్యలు తీసుకుంది.
కరోనా నేపథ్యంలో వలస కార్మికుల్ని ఎక్కడి వారక్కడే ఉండాలనీ, తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ కూలీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణం చెయ్యొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న వలస కూలీలు, కార్మికులకు ప్రభుత్వం భరోసానిచ్చింది. వివిధ రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన వలస కూలీలు, కారి్మకుల కోసం ప్రత్యేక వసతి ఏర్పాట్లు చెయ్యడంతో పాటు నిత్యావసరాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
12 వేల మంది గుర్తింపు..
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మొత్తం 12 వేల మంది కూలీలు, కార్మికులు వున్నట్టు అధికారులు గుర్తించారు. వీరిలో తొలి విడతగా 9435 మందికి నిత్యావసర వస్తువులను సిద్ధం చేసి పంపిణీ చేస్తున్నారు. రోజుకు ఒక ప్రాంతం చొప్పున ఈ పంపిణీ జరుగుతోంది. ప్రతి ఒక్కరికీ పది కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు, మూడు కిలోల గోధుమ పిండి, లీటర్ వంట నూనె, అరకిలో ఉప్పు, 250 గ్రాముల కారం, 250 గ్రాముల పసుపు పొడి, 2 కిలోల ఉల్లిపాయలు, రెండు కిలోల బంగాళాదుంపలు కలిపి ఒక కిట్‌గా తయారు చేసి పంపిణీ చేస్తున్నారు.
46 వసతి కేంద్రాలు..
వలస కూలీలు, దినసరి కార్మి కుల కోసం జిల్లా వ్యాప్తంగా 46 కేంద్రాల్లో ఉచిత భోజనం, వసతి ఇతర ఏర్పాట్లు చేశారు. జీవీఎంసీ పరిధిలో 26 కేంద్రాలు ఏర్పాటు చెయ్యగా.. రూరల్ ప్రాంతంలో 20 ఏర్పాటు చేశారు. అరకులోయ, పాడేరు, పాయకరావుపేట, జి.మాడుగుల, అనకాపల్లి, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేశారు.
ఇబ్బందులుంటే ఫోన్ చెయ్యండి..
వలస కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వ సూచనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకూ గుర్తించిన వారి కోసం వసతి సౌకర్యాలు ఏర్పాటు చెయ్యడమే కాకుండా.. నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నాం. తొలివిడతలో 9,435 మందికి అందించాం. రెండో విడత నిత్యావసర సరుకుల పంపిణీ చేసేందుకు కిట్లు సిద్ధం చేస్తున్నాం. ఏ వలస కారి్మకుడైనా భోజనానికి, వసతికి ఇబ్బంది ఎదురైతే 1800 4250 0002 నంబర్‌కు కాల్ చేస్తే.. వారి సమస్యలు పరిష్కరిస్తాం.
– ఎల్.శివశంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్
రెండు వారాల నుంచి..
పని నిమిత్తం విశాఖకు వ చ్చాను. కరో నా నేపథ్యంలో అనకాపల్లిలో చిక్కుకుపోయాను. పునరావాస కేంద్రంలో ఉంటున్నాను. భోజనం పెడుతున్నారు. సౌకర్యాలతో కూడిన వసతి కల్పించారు. – ప్రభాకర్, వలస కార్మికుడు, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment