క్రీడావినీలాకాశంలో అసమాన కాంతితో ప్రకాశించే ఉజ్వల భానుడతడు.. భారత క్రికెట్‌లో అనితర సాధ్యుడు... క్రికెట్‌నే శ్వాసించే అభిమానులకు అత్యంత ప్రీతిపాత్రుడు. ఆరాధ్యుడు.. విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాల్లో మహిమాన్వితుడు.. ఒక్కమాటలో చెప్పాలంటే భారత క్రికెట్‌లో ఆదర్శనీయుడు. రెండు దశాబ్దాలకు మించిన సుదీర్ఘ కాలంలో భారత క్రికెట్‌కు, ఆ మాటకొస్తే ప్రపంచ క్రికెట్‌కు కేంద్రమనదగ్గ ఖ్యాతిని సంపాదించిన వాడు..
అసాధారణ రికార్డులు సృష్టించి, మళ్లీ తానే వాటిని తిరగరాసి అభిమానులను అలరించిన ప్రతిభావంతుడు. ఇన్ని విశేషణాలకు ప్రతీకగా నిలిచే సత్తా ఉన్న వాడు.. మాస్టర్‌బ్లాస్టర్.. లిటిల్ మాస్టర్.. ఒకే ఒక్కడు! క్రికెట్ రారాజుగా వన్నె కెక్కిన ‘మాస్టర్’ థండర్ టెండూల్కర్ ఇక తనకు ఆరోప్రాణమైన ఆటకు వీడ్కోలు చెప్పే తరుణం ఆసన్నమైందని ప్రకటించాడు. తన 200వ టెస్ట్ తర్వాత ఇక సెలవని నిష్ర్కమించనున్నట్టు తెలిపాడు. అభిమానులకు అంతులేని నిరాశ కలిగిస్తున్నా.. ఇక తెరమరుగుకు తప్పుకోక తప్పదని ప్రకటించాడు. మాస్టర్ ప్రభంజనాన్ని మళ్లీ చూడలేమన్న బాధ సహజంగానే విశాఖ క్రీడాభిమానులను సైతం వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో విశాఖలో మాస్టర్ మెరుపులపై ‘సాక్షి’ విహంగ వీక్షణమిది.
భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన తొలినాళ్ళలోనే సచిన్ టెండూల్కర్ విశాఖ వాసులతో బంధం పెనవేసుకున్నాడు. భారత్ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ జట్టు మ్యాచ్‌లాడేందుకు వచ్చింది. సిరీస్ ప్రారంభానికి ముందు మూడు రోజుల మ్యాచ్ మున్సిపల్ స్టేడియం జరిగినప్పుడు సచిన్ దర్శనమిచ్చాడు. తొలిసారిగా 2001 ఏప్రిల్ 3న విశాఖ వేదికగా జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో తన సత్తా చాటాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన ఈ వన్డేమ్యాచ్‌లో విశాఖ క్రీడాభిమానులకు సచిన్ అర్ధసెంచరీతో అలరించాడు. విశాఖలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ 1988లో ప్రారంభం కాగా, మరో ఏడాదికే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆరంగేట్రం చేశాడు సచిన్. విశాఖలో క్రికెట్ మ్యాచ్‌లకు శ్రీకారం పడిన తొలినాళ్ళలోనే సచిన్ కెరీర్ తొలి అడుగులు పడుతున్న వేళ కావడం కాకతాళీయమే అయింది. విశాఖలో చివరిసారిగా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ముంబయి ఇండియన్స్ తరఫున డెక్కన్‌చార్జర్స్‌తో ఆడేందుకు వ చ్చినా చేతికి గాయంతో ఆడలేక పోయాడు.
వినమ్రతే విజయానికి కారణం
సచిన్ వినమ్రత అతనిని క్రికెట్ ప్రపంచంలో దిగ్గజంగా నిలిపింది. 1997లో వెస్టీండీస్ పర్యటనకు మేనేజర్‌గా వ్యవహరించాను. మూడున్నర నెలల పాటు సచిన్‌తో గడిపాను. అప్పుడు ఎలాంటి ప్రవర్తన అతనిలో చూశానో, నేటికీ అదే ప్రవర్తన, అదే వినయం.
-డి.వి.సుబ్బారావు, ఏసీఏ అధ్యక్షుడు.
ఇన్‌స్పిరేషన్ సచినే
ఔత్సాహిక క్రికెటర్లకు సచిన్ ఒక ఐకాన్. స్పూర్తిప్రదాత. చిన్నప్పటి నుంచి అయనంటే ఎంతో అభిమానం. బ్యాట్స్‌మెన్‌గా ఆయన్ని చూసి ఎంతో నేర్చుకున్నాను.
- రికీబుయ్, ఔత్సాహిక అంతర్జాతీయ -19 క్రికెటర్.
భారతరత్న ఇవ్వాలి
సచిన్ ఒక్క క్రికెట్‌లోనే కాదు.. అతని అన్ని ఫీల్డ్స్ ఆఫ్ లైఫ్‌లోనూ రోల్‌మోడల్. దేశానికి నిజాయితీగా సేవలందించాడు. అలాంటి వ్యక్తికి భారతరత్నతో గౌరవించాలి. ఔత్సాహిక క్రికెటర్లకు ఆయన చక్కటి సూచనలిస్తాడు.
- ఎం.ఎస్.కె.ప్రసాద్, ఏసీఏ మహిళా క్రికెట్ అకాడమీ ప్రతినిధి.
యంగ్‌స్టర్స్‌కు ప్రోత్సాహం
సచిన్, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటన అనుకున్నదే. ఆయన చక్కటి క్రికెట్ ఆడాడు. అంతకు మించిన రికార్డుల్ని సొంతం చేసుకున్నా వినమ్రతతో మెలిగాడు. ఆయన రిటైర్మెంట్‌తో యంగ్‌స్టర్స్‌కు అవకాశం కల్పించాలనే ఉద్దేశం ఉంది.
- చాముండేశ్వరీనాథ్, మాజీ కార్యదర్శి, ఏసీఏ.
విశాఖ స్మృతుల్లో ‘మాస్టర్’సచిన్ ఇన్నింగ్స్
Published Fri, Oct 11 2013 3:01 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
Advertisement
Advertisement