కంటైనర్ టెర్మినల్‌కు పర్యావరణ అనుమతి
రూ.633.11 కోట్ల ప్రాజెక్టుకు త్వరలో పనులు
మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుకూ లైన్ క్లియర్
రూ.200 కోట్లతో ఆయిల్ రిఫైనరీ బెర్త్‌లు ఆధునికీకరణ
విశాఖపట్నం : సముద్ర రవాణాలో ఎప్పటికప్పుడు నూతన పోకడలను ఆవిష్కరిస్తున్న విశాఖ పోర్టులో రూ.633.11 కోట్ల వ్యయంతో కంటైనర్ టెర్మినల్ విస్తరణ ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కనుంది. విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేటు లిమిటెడ్ చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. మరోవైపు రూ.400 కోట్ల నిధులతో నిర్మిస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుకూ లైన్ క్లియర్ అవుతోంది. రూ.200 కోట్లతో ఆయిల్ రిఫైనరీ బెర్త్‌లు ఆధునికీకరించనున్నారు.
పోర్టులో ప్రస్తుత కంటైనర్ టెర్మినల్ సామర్థ్యం 0.4 మిలియన్ టీఈయూ(ట్వంటీ ఫుట్ ఈక్వలెంట్ యూనిట్స్)లు మాత్రమే. 2015 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య 4.6 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ జరిగింది. 2014-15లో ఇదే సమయానికి 3.9 మిలియన్ టన్నులే చేయగ లిగారు.
కాగా విస్తరణతో దానిని 0.94 మిలియన్ టీఈయూలకు పెంచాలనుకుంటున్నారు. దీనికి తాజాగా కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు వచ్చాయి. దీంతో టెర్మినల్‌కు అవసరమైన భూమిని వీసీటీపీఎల్‌కు అప్పగించేందుకు పోర్టు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో పోర్టులో ఉన్న రెండు ఆయిల్ రిఫైనరీ బెర్త్‌లు ఓఆర్1, 2లను కూడా ఆధునికీకరించాలని పోర్టు నిర్ణయించింది. దీని కోసం రెండు, మూడేళ్లలో రూ.200 కోట్లు ఖర్చు చేయనుంది.
వీటిని ఆధునికీకరిస్తే పానామాక్స్ వెసల్స్ నేరుగా పోర్టులోకి వచ్చే వెసులుబాటు కలుగుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్టును చెన్నై ఐఐటీ తయారు చేయనుంది. విడతల వారీగా, ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులకు ఆటంకం కలగకుండా ఈ బెర్త్‌లను ఆధునికీకరణ పనులు చేయాలనుకుంటున్నట్లు పోర్టు వర్గాలు చెబుతున్నాయి.
11 ఎకరాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు
దాదాపు రూ.400 కోట్ల నిధులతో 100 ఎకరాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కు చెందిన 11 ఎకరాల స్థలాన్ని తీసుకుంటున్నారు. అంతే విలువైన పోర్టు స్థలాన్ని ఏఏఐకు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దానికి ఇటీవలే కేంద్రం నుంచి అనుమతి వచ్చింది. ఈ పార్కు పూర్తయితే 4 లక్షల టీఈయూ కార్గో హ్యాండిల్ చేసే సౌకర్యం కలుగుతుంది.
విస్తరణ దిశగా విశాఖ పోర్టు
Published Wed, Apr 6 2016 4:58 PM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM
Advertisement