విశాల్ గున్నీ, గుంటూరు రూరల్ ఎస్పీ
సాక్షి, గుంటూరు: కరోనా (కోవిడ్–19) వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం తన ముందున్న లక్ష్యమని గుంటూరు రూరల్ జిల్లా నూతన ఎస్పీ విశాల్ గున్నీ అంటున్నారు. రూరల్ జిల్లాలో వైరస్ కట్టడికి పోలీస్ శాఖ వైపు నుంచి వేగంగా చర్యలు తీసుకుంటున్నా మంటున్నారు. 68 కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్‌ను పక్కాగా అమలు చేస్తున్నామని, కాంటాక్ట్‌లను కనిపెట్టి కోవిద్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నామని చెబుతున్నారు. రూరల్ జిల్లాలో కోవిడ్–19 కట్టడి, శాంతి భద్రతల పరిరక్షణ, తదితర అంశాలపై ఎలా ముందుకు వెళ్లబోతున్నారో ఎస్పీ విశాల్ వెల్లడించారు.
సాక్షి: పోలీస్ సిబ్బంది, అధికారులు వైరస్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.?
ఎస్పీ: వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో సిబ్బంది, అధికారులు వైరస్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టబోతున్నాం. ప్రతి పోలీస్‌స్టేషన్ ముందు తాత్కాలికంగా ఒక క్యాబిన్ ఏర్పాటు చేస్తాం. ఈ క్యాబిన్‌లో పోలీస్ సిబ్బంది భౌతిక దూరం పాటిస్తూ ఫిర్యాదులు స్వీకరిస్తారు. అలాగే ప్రతి స్టేషన్‌లో డిస్‌ఇన్‌ఫెక్షన్ స్ప్రేయర్లు, ఫెడల్ శానిటైజర్లు అందుబాటులో ఉంచుతాం. పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిస్థితులు అంచనా వేయడానికి థర్మల్ స్క్రీన్ గన్‌లు, పల్స్‌ఆక్సి మీటర్లను ఏర్పాటు చేస్తాం.
సాక్షి: ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వచ్చే వారి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
ఎస్పీ: ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వచ్చే వారు తప్పనిసరిగా స్పందన పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని పాస్ కలిగి ఉండాలి. పాస్ పొందని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం. రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరికీ చెక్‌పోస్టుల వద్ద వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. మహారాష్ట్ర, రాజస్తాన్, ఢిల్లీ వంటి కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారిని తప్పనిసరిగా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నాం.
సాక్షి: తెలంగాణా రాష్ట్రం నుంచి ఎన్‌డీపీఎల్ భారీగా జిల్లాలోకి వస్తోంది. కట్టడికి ఎలాంటి కార్యాచరణ ఎంచుకున్నారు?
ఎస్పీ: ఇసుక, మద్యం, గుట్కా అక్రమ రవాణా, నాటు సారా తయారీ కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాం. కృష్ణా నది పరీవాహక ప్రాంతాలపై రెక్కీ నిర్వహిస్తున్నాం. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్(ఎన్‌డీపీఎల్)ను తరలిస్తున్నట్టు సమాచారం మేరకు పోలీసులు, ఎస్‌ఈబీ సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నాయి. రోడ్డు మార్గంలో అక్రమ మద్యం రాకుండా సరిహద్దు చెక్‌పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేస్తున్నాం. స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ)ను బలోపేతం చేస్తాం.
సాక్షి: రూరల్ జిల్లాపై మీ మార్క్ ఎలా ఉండబోతోంది?
ఎస్పీ: ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచాలి. రూరల్ జిల్లాలో సాయంత్రం 4.30 నుంచి 8 గంటల వరకూ అధికారులు, సిబ్బంది రోడ్లపై విధులు నిర్వహిస్తారు. విజిబుల్ పోలీసింగ్ పేరుతో రోడ్డుపై బైక్‌లు, కార్లు నిలిపి లైసెన్స్, సీట్ బెల్ట్, హెల్మెట్ పెట్టుకోకపోవడం, ఇతర నిబంధనలు పాటించని వారికి చలానాలు రాస్తారు. గుంటూరు రూరల్ జిల్లాలో జరిగే అక్రమాలు, నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు వాట్సప్, ఎస్సెమ్మెస్, కాల్ చేసి తెలపవచ్చు. వెంటనే చర్యలు తీసుకుంటాం.
సాక్షి:బాధ్యతలు స్వీకరించిన రోజు ప్రజలు నేరుగా ఫోన్ ద్వారా సమస్యలు, ఫిర్యాదులు తెలియజేయవచ్చు అని చెప్పారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది.
ఎస్పీ: ప్రజల నుంచి స్పందన బాగా ఉంది. ప్రతి కాల్ నేనే మాట్లాడుతున్నా. జిల్లాలో పల్నాడు ప్రాంతం నుంచి ఎక్కువగా ఫోన్‌లు, మెసేజ్‌లు వచ్చాయి. వెంటనే సిబ్బంది, అధికారులను అలెర్ట్ చేశాను. కొంతమంది ఇతర జిల్లాల నుంచి సైతం ఫోన్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment