
బరితెగించిన పయ్యావుల: విశ్వేశ్వరరెడ్డి
అనంతపురం: టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ బరితెగించి వ్యవహరిస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. బోయ సూరయ్య హత్య కేసు నుంచి తన సోదరుడిని కాపాడుతున్నారని ఆరోపించారు. కేసు ఉపసంహరించుకోనందుకు సూరయ్య కుటుంబీకులపై అక్రమ కేసు బనాచించారని అన్నారు. సూరయ్య హత్యతో పయ్యావుల శీనప్పకు సంబంధం ఉందని సీఐడీ తేల్చిందని చెప్పారు.
పయ్యావుల కేశవ్ అధికార దుర్వినియోగంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు బోయ సూరయ్య... ఉరవకొండ మండలం వై.రాంపురంలో 2009 ఆగస్టు 24న దారుణ హత్యకు గురయ్యారు. నిందితుల్లో ఒకరైన పయ్యావుల శీనప్ప తన పేరును చార్జిషీటు నుంచి తొలగింపజేసేందుకు శతవిధాలా ప్రయత్ని విఫలమయ్యాడు. సూరయ్య కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో కక్ష సాధింపునకు దిగాడు.