విజయనగరం : విజయనగరం జిల్లాలో నిత్యవసర వస్తువుల కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. నిత్యావసరాల వస్తువులు, కూరగాయల కోసం జనాలు రైతు బజార్ల వద్ద బారులు తీరారు. మరోవైపు బాధితుల అవసరాలను పలువురు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. నిత్యావసరాలను బ్లాక్ చేసి, అధిక ధరలకు విక్రయించి అడ్డగోలుగా సొమ్ము చేసుకున్నారు.
విజయనగరంలో ఇంకా విద్యుత్ పునరుద్ధరణ కాలేదు. కేవలం 25 శాతమే విద్యుత్ను పునరుద్ధరించారు. దాంతో చాలా గ్రామాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. ఇక తుఫాను విధ్వంసం ముగిసి ఏడు రోజులు గడుస్తున్నా బాధితులకు మాత్రం సాయం అంతంత మాత్రంగానే ఉంది.
తుపాను బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కనీసం బియ్యం కూడా పూర్తి స్థాయిలో సరఫరా చేయలేకపోతోంది. మొదట్లో 5 లక్షల బాధిత కుటుంబాలకు నిర్ణయించిన మేరకు సరుకులన్నీ ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయించినా ఆ మేరకే సేకరణ చేయలేదు. ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రూపొందించ కపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.