టౌన్(టౌన్), న్యూస్‌లైన్: పురపాలక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సార్వత్రిక ఎన్నికలు వరుసగా జరగనున్నాయి. జిల్లాలో సుమారు 14.88 లక్షల ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 583 ఎంపీటీసీ, 46 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరపాల్సి ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న జెడ్పీ సీఈఓ మారిశెట్టి జితేంద్ర నిజాయితీ పరులకే ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎన్నికల నిర్వహణపై ‘న్యూస్‌లైన్’కు ఆయన వివరాలు వెల్లడించారు.
న్యూస్‌లైన్: ఎన్నికల నిర్వహణకు ఎంత మంది సిబ్బందిని నియమించారు? ఏర్పాట్ల గురించి వివరిస్తారా..
జితేంద్ర: పోంగ్ ఆఫీసర్లగా 2,167 మంది, అదర్ పోలింగ్ ఆఫీసర్లగా 8,668 మందిని కలిపి మొత్తం 10,833 మందిని నియమించాం. మరికొంతమందిని రిజర్వులో ఉంచేందుకు తీసుకోబోతున్నాం. దాదాపు 4,000 బ్యాలెట్ బాక్సులు సరిపోతాయని అంచనా వేశాం. అయితే 5,000 వరకు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నాం. జెడ్పీటీసీలకు తెలుపు రంగు, ఎంపీటీసీలకు పంక్ కలర్ రంగు బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేశాం. ఇప్పటికే ప్రతి గ్రామానికి ఓటర్లజాబితాలను జిరాక్సు తీసి 25 సెట్లు పంపాం.
న్యూ: సమస్యాత్మక గ్రామాలను గుర్తించారా?
జితేంద్ర: పంచాయతీ ఎన్నికల్లో గుర్తించిన సమస్యాత్మక గ్రామాలనే ప్రామాణికంగా తీసుకుంటున్నాం. వీటి జాబితాను పోలీసు శాఖ నుంచి తీసుకోవాల్సి ఉంది. మా అంచనా ప్రకారం సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలు దాదాపు 500 ఉన్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చాం.
న్యూ: సమస్యాత్మక గ్రామాల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేందుకు తీసుకుంటున్న చర్యలేంటి?
జితేంద్ర: సమస్యాత్మక గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుబందోబస్తును పెంచుతాం. ఇలాంటి గ్రామాల్లో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. సమస్యాత్మక సెంటర్‌లో ఏమి జరుగుతుందో జిల్లా కేంద్రంలో కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో మైక్రో అబ్జర్వర్ లేదా వీడియోగ్రఫీ లేదా వెబ్‌కాస్టింగ్ గాని ఈ మూడింటిలో ఏదో ఒకటి ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అందువల్ల అక్కడ ఏమి జరిగినా తెలిసిపోతుంది.
న్యూ: అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి...
జితేంద్ర: ఎంపీటీసీ అభ్యర్థులు రూ.లక్ష , జెడ్పీటీసీ అభ్యర్థులు రూ.రెండు లక్షల వరకు మాత్రమే ప్రచారానికి ఖర్చు చేయాలి. ఖర్చు చేసే ప్రతి పైసాకు రోజువారీ లెక్కలు చూపాలి. నామినేషన్ సందర్భంగా అభ్యర్థి ఆస్తులు, అప్పులు, తనపై గతంలో ఉన్న కేసులను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలి. ఇందుకు భిన్నంగా ఉంటే అభ్యర్థి గెలిచినా తర్వాత ఎన్నికల కమిషన్ వారి పదవిని రద్దు చేసే అవకాశం ఉంది. డిపార్ట్‌మెంట్ తరపున ఒక కమిటీ వేస్తాం. ఈ కమిటీ పెయిడ్ ఆర్టికల్స్‌ను, అభ్యర్థి ఖర్చు వివరాలను అంచనా వేసి నివేదిక ఇస్తుంది.
న్యూ: బ్యాలెట్ పేపర్లు ఎప్పుడు ముద్రిస్తారు?
జితేంద్ర: 583 మంది ఎంపీటీసీలకు, 46 మంది జెడ్పీటీసీలకు కలిపి 33 లక్షల బ్యాలెట్ పేపర్లు అచ్చువేయాల్సి ఉంది. నామినేషన్లు పూర్తయ్యాక అభ్యర్థులను బట్టి ప్రింట్ చేయాల్సి ఉంటుంది. అక్షర క్రమంలో సెట్ చేసేదానికి కొంత సమయం పడుతుంది.
ప్రశ్న: ప్రజలికిచ్చే సందేశం?
జవాబు: డబ్బుకు, మద్యానికి, చీరకు అమ్ముడు పోయి ఓటేస్తామో అప్పుడు మనం నేతలకు బానిసైనట్టు లెక్క . ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నిజాయితీ పరులకే ఓటేయాలి. అప్పుడే మంచి సమాజం ఏర్పడుతుంది.
నిజాయితీ పరులకే ఓటేయండి
Published Mon, Mar 17 2014 3:51 AM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM
Advertisement
Advertisement