అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా 188 కేంద్రాల్లో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) పరీక్షలు ఆదివారం సజావుగా ముగిశాయి. జిల్లాలో 64 వీఆర్‌వో పోస్టులకు 62,238 మంది దరఖాస్తు చేసుకుని 52,230 మంది (85 శాతం) పరీక్షకు హాజరయ్యారు. 167 వీఆర్‌ఏ పోస్టులకు 4637 మంది దరఖాస్తు చేసుకుని 4175 మంది (90 శాతం) పరీక్షకు హాజరయ్యారు. కొన్నిచోట్ల ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్దకు పరుగులు తీయడం కనిపించింది. ఎక్కడా అభ్యర్థులను అనుమతించని ఘటనలు లేవు. ప్రశాంతంగా పరీక్షలు జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన మంత్రి
జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను ఉన్నతాధికారులు జిల్లా కేంద్రం నుంచే పర్యవేక్షించారు. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి జిల్లా కేంద్రానికి రావడంతో జిల్లా యంత్రాంగం ఆయన వెం టే ఉంది. దీంతో జిల్లాలో పర్యటించేందుకు అవకాశం లేకపోయిందని అధికార వర్గాలు వెల్లడించాయి. కలెక్టర్ లోకేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఏజేసీ వెంకటేశం తదితరులతో కలిసి మంత్రి రఘువీరారెడ్డి ఆర్ట్స్‌కళాశాల పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు.
ఆర్టీసీ బస్టాండ్ కిటకిట
అనంతపురం అర్బన్ : వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలకు అభ్యర్థులు హాజరయ్యేందుకు ఆర్టీసీ రెగ్యులర్ సర్వీసులతోపాటు 200 ప్రత్యేక బస్సులను నడిపింది. ఆర్టీసీకి రూ. కోటి 30 లక్షల ఆదాయం లభించినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
తెల్లవారుజామున 3.30 గంటల నుంచే బస్టాండ్‌లో బస్సులను అందుబాటులో ఉంచారు. ఉదయం నుంచి అభ్యర్థులతో బస్టాండ్ కిటకిటలాడింది. సాధారణ ప్రయాణీకులకు కూడా ఇబ్బంది లేకుండా సర్వీసులు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ డెప్యూటీ సీటీఎం మధుసూదన్, డీఎం కేవీ రమణ, యూనియన్ నాయకులు కలిసి బస్సు సర్వీసులను పర్యవేక్షించారు.
ప్రశాంతంగా వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలు
Published Mon, Feb 3 2014 2:39 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement