సాక్షి ప్రతినిధి, అనంతపురం : చాగల్లు రిజర్వాయర్ భూసేకరణలో తీగలాగితే అక్రమాల డొంకంతా కదులుతోంది. అధికార పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై రైతుల పేరుతో భారీ ఎత్తున ప్రజాధనాన్ని కాజేశారు. భూనిర్వాసితులకు ఇప్పటిదాకా చెల్లించిన రూ.64 కోట్లలో రూ.21 కోట్లకుపైగా రెవెన్యూ అధికారులు, రాజకీయ దళారులే కొట్టేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్) రెండో దశ భూసేకరణ కార్యాలయం ఏర్పాటైనప్పటి నుంచి అక్కడే పని చేసి.. ఇటీవల జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)కు బదిలీ అయిన ఓ రెవెన్యూ అధికారి కీలకపాత్ర పోషించారు.
రైతుల ముక్కుపిండి వసూలు చేసిన ముడుపులతో ఆ అధికారి అనంతపురం పాతూరులోని ఓ బంగారు దుకాణంలో మూడు కిలోల నగలు కొనుగోలు చేయడం ఆ శాఖ అధికారులనే నివ్వెరపరిచింది. ఇప్పటికీ ఆయన చాగల్లు రిజర్వాయర్ భూసేకరణను అనధికారికంగా పర్యవేక్షిస్తోండటం గమనార్హం. పెద్దపప్పూరు మండలం జూటూరుకు సమీపంలో పెన్నానదిపై రూ.244.50 కోట్ల అంచనా వ్యయంతో 1.50 టీఎంసీల సామర్థ్యంతో చాగల్లు రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. దీని ద్వారా 4,500 ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు.
రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం(ఎఫ్‌ఆర్‌ఎల్) 265.930 మీటర్లుగా నిర్ణయించారు. ఎఫ్‌ఆర్‌ఎల్ పరిధిలోకి వచ్చే భూమిని సేకరించి ఇవ్వాలని హెచ్చెల్సీ అధికారులు పీఏబీఆర్ స్టేజ్-2 భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు డిసెంబర్ 25, 2005న ప్రతిపాదనలు పంపారు. భూసేకరణ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన ఓ అధికారి.. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఎవరొచ్చినా బుట్టలో వేసుకోవడంలో దిట్ట. జిల్లాలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మెదిలే ఆ అధికారి.. అదే పార్టీకి చెందిన కొందరు నేతలను దళారులుగా నియమించుకుని అక్రమాలకు తెర లేపారు.
ఎకరాకు రూ.30 వేలు
చాగల్లు రిజర్వాయర్‌లో మునిగిపోయే భూములకు నష్టపరిహారం చెల్లించాలంటే ఎకరాకు రూ.30 వేలు ముడుపులు ఇవ్వాలని ఆ అధికారి షరతు విధించారు. అలా ఇస్తే బంజరు భూమైనా పండ్ల తోటలుగా చూపి అధికంగా పరిహారం ఇస్తామని ఆశ చూపారు. దాంతో రైతులు వడ్డీలకు అప్పులు తెచ్చి ముడుపులు ముట్టజెప్పి... ఆ తర్వాత పరిహారం పొందారు. భూసేకరణ సమయంలో కచ్చితంగా ఆ భూముల ఫొటోలు తీసుకోవాలి. పరిహారం చెల్లించేటప్పుడు సంబంధిత రైతుల ఫొటోల(పరిహారం చెక్ తీసుకుంటున్నట్లుగా)ను సేకరించాలి.
ఫొటోలు తీస్తే తమ దోపిడీ బాగోతం బయటపడుతుందనే మిషతో ఆ నిబంధనను సదరు అధికారి తుంగలో తొక్కారు. చాగల్లు రిజర్వాయర్ వల్ల పెద్దపప్పూరు మండలంలోని చిన్న ఎక్కలూరు, దేవుని ఉప్పలపాడు, సింగనగుట్టపల్లి, తబ్జుల, శింగనమల మండలంలోని ఉల్లికల్లు, ఉలికుంటపల్లి, రాచేపల్లి భూములు ముంపునకు గురవుతాయని అధికారులు లెక్కకట్టారు. ఇప్పటిదాకా 3,158.71 ఎకరాల భూమిని సేకరించారు. భూనిర్వాసితులకు రూ.64 కోట్లకుపైగా నష్టపరిహారం పంపిణీ చేశారు. తాజాగా ముంపు గ్రామాల్లో 398 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొందరు రెవెన్యూ ఉన్నతాధికారులు, ఆ అధికారి, రాజకీయ దళారులు కుమ్మక్కై రూ.21 కోట్లకుపైగా పరిహారాన్ని ముడుపుల రూపంలోనే కాజేసినట్లు ఆ శాఖ అధికార వర్గాలే స్పష్టీకరిస్తున్నారు. రైతుల నుంచి ముడుపులు వసూలు చేసి.. పరిహారం చెల్లించకపోవడంతో పెద్దవడుగూరు మండలానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ఆ అధికారి ముక్కుపిండి రైతుల సొమ్ము వాపసు ఇప్పించడమే ఇందుకు తార్కాణం.
స్థానభ్రంశమైనా వదలని వైనం
చాగల్లు భూనిర్వాసితుల నుంచి దండుకున్న ముడుపులతో ఇటీవల అనంతపురంలోని పాతూరులో ఉన్న ప్రముఖ నగల దుకాణంలో ఆ అక్రమాధికారి మూడు కిలోల బంగారు కొనుగోలు చేసినట్లు రెవెన్యూ శాఖకు చెందిన ఓ కీలకాధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. ఆయన అనంతపురం నగరంలోని ఓ ప్రముఖ చిట్‌ఫండ్ కంపెనీలోనూ బినామీ పేర్లతో వాటాలు కల్గివుండటం గమనార్హం.
అక్రమార్జనకు మరిగిన ఆ అధికారిని ఇటీవల జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా)కు బదిలీ చేశారు. అయితే.. ఆయన డ్వామా పనులను పక్కనబెట్టి చాగల్లు భూసేకరణపైనే అనధికారికంగా దృష్టి కేంద్రీకరించారు. ఆ అధికారి ఏం చెబితే.. భూసేకరణ కార్యాలయంలో అదే జరుగుతుంది. భూసేకరణ విభాగంపై లోతుగా విచారణ జరిపితే ముగ్గురు ఉన్నతాధికారులతో పాటూ ఆ అక్రమాధికారి నిర్వాకాలు బట్టబయలవుతాయని భూనిర్వాసితులు స్పష్టీకరిస్తున్నారు.
అక్రమాధికారిదే హవా!
Published Mon, Feb 17 2014 3:06 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement