నిరాశాకిరణం
- కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటనకు స్పందన నిల్
- పార్టీ పెట్టాక తొలిసారి అడుగుపెట్టినా ఆదరణ శూన్యం
- బెడిసికొట్టిన అంచనాలు
- సబ్బవరంలో జనం లేక
- అర్ధంతరంగా ముగిసిన సభ
సాక్షి, విశాఖపట్నం : పార్టీ ప్రకటించిన తర్వాత తొలిసారి పర్యటనకు విశాఖ వచ్చిన జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్‌కుమార్‌రెడ్డికి జిల్లాలో జనాదరణ కరువైంది. విమానాశ్రయం నుంచి సబ్బవరం సభ వరకు కనీసం చప్పట్లు కొట్టే నాథుడు కూడా లేకపోవడంతో కిరణ్ నీరసించిపోయారు. ఎంతో ఊహించి జిల్లాలో అడుగుపెడితే చివరకు కార్యకర్తల సందడి కూడా కరువవ్వడంతో కంగుతిన్నారు. ఇతర ప్రాంతాల నేతలు, సబ్బంహరి మినహా ఎవరూ వెంట లేకపోవడంతో పర్యటన ఫెయిలైంది.
స్పందనేది? : ఉదయం విమానాశ్రయంలో దిగిన కిరణ్‌కు అక్కడ సాదాసీదా స్పందన ల భించింది. పార్టీకి కనీసం క్యాడర్, నేతలు లేకపోవడంతో నీరసంగా విశాఖ ఫంక్షన్ హాల్‌లో యువతతో సమావేశానికి హాజరయ్యారు. తీరా చూస్తే అక్కడ పెద్దగా విద్యార్థులు లేకపోవడంతో చేసేది లేక చాలాసేపు ఖాళీగా ఉన్నా రు. చివరకు ఎలాగోలా జనాన్ని సమీకరించడంతో పేలవంగా కార్యక్రమం మొదలైంది.
జనస్పందన ఆశించినంత లేకపోవడంతో కిరణ్ నీరసంగా మాట్లాడారు. ఆయన వెంట ఒక్క సబ్బంహరి మినహా జిల్లా నేతలెవరూ కనిపించలేదు. సీఎంగా ఉన్నప్పుడు జిల్లాకు వస్తే జనం, నేతలతో సందడిగా గడిపే కిరణ్ పార్టీ పెట్టాక కనీసం అందులో సగం కూడా స్పందన కనిపించలేదు. సాయంత్రం సబ్బవరంలో డ్వాక్రాగ్రూపు సభ్యులతో బహిరంగ సభ ఉన్నట్టు పార్టీ నేతలు ప్రకటించారు.
సభ ఆలస్యంగా ప్రారంభం, ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకపోవడంతో మహిళలు అక్కడి నుంచి జారుకున్నారు. ఆయన ప్రసంగిస్తుండగానే సభా ప్రాంగణం దాదాపుగా ముప్పావు వంతు ఖాళీగా కనిపించడంతో కిరణ్ తన ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించేశారు. పార్టీ గుర్తు చెప్పును ఆవిష్కరించగానే జనం నుంచి కనీస ఆదరణ లేకపోవడం విశేషం. ఎన్నో అంచనాల మధ్య జిల్లాలోకి అడుగుపెట్టిన కిరణ్‌కు జనస్పందన లేకపోవడంతో అనుకున్న అంచనాలన్నీ తలకిందులైనట్లయింది.
సబ్బవరం బహిరంగ సభకు వచ్చిన కొద్దిమంది జనంలో కూడా ఇతర నియోజక వర్గాల నుంచి తరలించినవారే అధికంగా ఉండడంతో వారంతా చీకటైపోయిందంటూ బయటకు వెళ్లి లారీలు ఎక్కేశారు. దీంతో పర్యటన నీరసంగా..నిస్తేజంగా మారింది. ఒకపక్క నేతలెవరూ చేరకపోవడం, మరోపక్క అనుకున్నంతగా విద్యార్థులు, మహిళల నుంచి స్పందన లేకపోడంతో కిరణ్ నీరసించిపోయారు.