కర్నూలు(అగ్రికల్చర్): వక్ఫ్ భూములను ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ జిల్లా జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ హెచ్చరించారు. ఇటీవల ‘సాక్షి’లో వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనాలకు స్పందించి శుక్రవారం జేసీ తన చాంబర్‌లో ప్రత్యేక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 2,500 ఎకరాల వక్ఫ్ భూముల దురాక్రమణలో ఉన్నాయని, వీటిని స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. వక్ఫ్ భూములను ఆక్రమించినవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని తెలిపారు. కల్లూరులో 535 ఎకరాల వక్ఫ్ భూములు దురాక్రమణలో ఉన్నాయని, అక్రమణదారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
535 ఎకరాల భూములకు వక్ఫ్‌సంస్థ పేరు మీద పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయాలని సంబంధిత తహశీల్దార్‌ను ఆదేశించారు. ఈ భూములను స్వాధీనం చేసుకోవడానికి జాప్యం చేవద్దని తెలిపారు. డోన్‌లో సర్వే నంబర్ 264లో 5-82 ఎకరాలు, సర్వే నంబర్ 2-15లో 15.88 ఎకరాలను 50 మంది ఆక్రమించారని ఈ భూములు వక్ఫ్‌వి అయినందున స్వాధీనం చేసుకోవాలన్నారు. ఆక్రమణదారులను వెంటనే నోటీసులు జారీ చేయించాలని, ఇందుకోసం పోలీసుల సహాయం తీసుకోవాలన్నారు. బనగానపల్లె, నందవరం, కర్నూలు ఫోర్త్‌టౌన్, శిరువెళ్ల పోలీస్‌స్టేషన్లలో వక్ఫ్ భూములు ఆక్రమించినవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని తెలిపారు.
కర్నూలులోని సర్వే నంబర్ 62లో వక్ఫ్ భూమిలో నీళ్ల ట్యాంకు నిర్మించారని, ఇందుకోసం ఎంతమేర వక్ఫ్ భూమిని తీసుకొని ఉంటే అంతే భూమిని మరోచోట గుర్తించి వక్ఫ్ బోర్డుకు అప్పగించాలన్నారు. వక్ఫ్ భూములు ఆక్రమించిన వారు ఎంతటివారైనా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో గంగాధర్‌గౌడు, మైనార్టీ సంక్షేమాధికారి షేక్ మస్తాన్ వలి, వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్లు ముస్తాక్ బాషా, అల్తాఫ్ హుసేన్, అజీమ్, వక్ఫ్ ల్యాండ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వక్ఫ్ భూముల ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు
Published Sat, Mar 21 2015 2:37 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement