
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, భూమా నాగిరెడ్డి ‘ఆత్మ స్నేహితుడు’ ఏవీ సుబ్బారెడ్డి మధ్య వార్ మరింత ముదిరింది. ఏకంగా భూమా అఖిలప్రియకు సంబంధించిన వార్తలను ప్రసారం చేయకూడదని ఏవీ సుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాల నేపథ్యంలో నంద్యాల సిటీ కేబుల్‌లో మంత్రి వార్తలతో పాటు నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కార్యక్రమాలను కూడా ప్రసారం చేయడం లేదు. నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ, బనగానపల్లె ప్రాంతాల్లోనూ వీరి వార్తలకు బ్రేక్ పడింది.
అయితే.. సిటీకేబుల్‌లో తమకూ వాటా ఉందని, తమ వార్తలను ఎందుకు ప్రసారం చేయరంటూ కేబుల్ సిబ్బందిని మంత్రి అఖిలప్రియ హెచ్చరించారు. ఏ విషయమైనా ఏవీతోనే తేల్చుకోవాలని వారు స్పష్టం చేశారు. ఆయనతో మాట్లాడే ప్రసక్తే లేదని అఖిలప్రియ భీష్మించారు. మొత్తమ్మీద వారం రోజులుగా వీరిద్దరి వార్తలు లేకుండానే సిటీకేబుల్ నడుస్తుండటం చర్చనీయాంశమయ్యింది. భూమా కుటుంబ వార్తలు లేకుండా ఉండటం సిటీ కేబుల్ చరిత్రలోనే మొదటిసారి కావడం గమనార్హం.
రోజురోజుకూ...
భూమా నాగిరెడ్డికి ఏవీ సుబ్బారెడ్డి ఆత్మగా వ్యవహరించేవారు. ఏవీ లేకుండా ఏ రాజకీయ నిర్ణయమూ భూమా తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. అయితే, భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఇరు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. ఒకరినొకరు మాట్లాడుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇక కొత్త సంవత్సరం సాక్షిగా వీరి మధ్య అగాధం మరింత పెరిగింది. నూతన సంవత్సర వేడుకల పేరుతో ఏవీ సుబ్బారెడ్డి భారీ విందును ఆళ్లగడ్డలో ఏర్పాటు చేశారు. దీనికి వెళ్లొద్దని మంత్రి ఆదేశాలు జారీచేశారు. అయినా, వారి కుటుంబ సభ్యులు కూడా కొద్ది మంది హాజరుకావడం గమనార్హం.
తాజాగా ఏవీ హెల్ప్‌లైన్ పేరుతో సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో కార్యకలాపాలు ప్రారంభించారు. మార్కెట్‌యార్డులో రైతులకు భోజన వసతి కల్పించే విషయంలో కూడా గొడవ పడ్డారు. నేరుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేదాకా వెళ్లారు. ఇదే తరుణంలో కేబుల్ వార్‌కు ఏవీ సుబ్బారెడ్డి తెరలేపారు. మొదటగా మంత్రి అఖిలప్రియకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేయొద్దని సిటీ కేబుల్ సిబ్బందిని ఆదేశించారు. ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కార్యక్రమాలను మాత్రం ప్రసారం చేశారు. అయితే..తన సోదరి అఖిలప్రియ కార్యక్రమాలనూ కవర్ చేయాలని బ్రహ్మానందరెడ్డి కోరారు. ఇందుకు ఏవీ ససేమిరా అన్నారు.
ఈ నేపథ్యంలో తన వార్తలు కూడా ప్రసారం చేయొద్దని బ్రహ్మానందరెడ్డి తేల్చిచెప్పినట్టు సమాచారం. దీంతో వాటిని కూడా నిలిపివేశారు. కాగా.. సిటీ కేబుల్‌లో తమకూ 50 శాతం వాటా ఉందని, ఎందుకు ప్రసారం చేయరంటూ మేనేజర్ జయచంద్రారెడ్డితో అఖిలప్రియ వాదించినట్టు సమాచారం. అయితే, ఏ విషయమూ ఏవీ సుబ్బారెడ్డితోనే తేల్చుకోవాలని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. ఏవీతో మాట్లాడే ప్రసక్తే లేదని అఖిలప్రియ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వారం రోజుల నుంచి ఇద్దరి వార్తలకు నంద్యాల సిటీ కేబుల్‌లో బ్రేక్ పడింది.
Comments
Please login to add a commentAdd a comment