భూపాలపల్లి, న్యూస్‌లైన్ :ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వరంగల్ రీజియన్ రూ.2.93కోట్ల లాభాలు ఆర్జించిందని ఏపీఎస్ ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎ.పురుషోత్తంనాయక్ తెలిపారు. భూపాలపల్లి బస్ డిపో నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించి స్థానిక అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వరంగల్ రీజియన్‌లో గత ఆర్థిక సంవత్సరం రూ.78 లక్షల నష్టం వాటిల్లగా ఈ ఆర్థిక సంవత్సరంలో అధికారులు, కార్మికుల కృషితో లాభాల బాటలో నడుస్తుందన్నారు.
కరీంనగర్ జోన్‌లో ఇప్పటికే రూ. 6.5 కోట్ల నష్టం వాటిల్లిందని, అయినా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కల గకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భూపాలపల్లి బస్‌డిపో నిర్మాణ పనుల్లో అలస్యం జరిగిందన్నారు. ఫ్లోరింగ్, టైల్స్, ఎలక్ట్రిక్ తదితర పనులు జరగాల్సి ఉందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకోసం ఏపీఎన్‌పీడీసీఎల్‌కు రూ.1.70లక్షలు చెల్లించినట్టు వివరించారు. మరో పదిరోజుల్లో జనరేటర్ బిగిస్తామని చెప్పారు. ఆయిల్‌బంక్ ఏర్పాటు చేసేవరకు బయటినుంచి డీజిల్ కొనుగోలు చేస్తామన్నారు.
ఇప్పటి వరకు 95 శాతం పనులు పూర్తయ్యాయని మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. వచ్చే నెల 20వ తేదీలోపు భూపాలపల్లి బస్‌డిపోను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. డిపో ప్రారంభానికి ఆర్టీసీ చెర్మైన్, ఎండీలు హాజరవుతారని చెప్పారు. జిల్లాలోని 8 డిపోల నుంచి భూపాలపల్లి డిపోకు 80 బస్సులు, సుమారు 600 మంది కార్మికులను కేటాయించనున్నట్టు చెప్పారు. కోల్‌బెల్ట్ జిల్లాలైన కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలతో పాటు తిరుపతి, రాయిచూరు, షిర్డీలాంటి దూర ప్రాంతాలకు సైతం బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతానికి పట్టణంలో ఉన్న బస్ షెల్టర్‌లనే వినియోగించుకుంటామన్నారు.
బస్టాండ్ నిర్మాణానికి రూ.కోటితో ప్రతిపాదనలు తయారుచేస్తున్నట్లు పురుషోత్తం తెలిపారు. ఈడీ వెంట వరంగల్ రీజినల్ మేనేజర్ యాదగిరి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మురళీమోహన్, పరకాల, భూపాలపల్లి డిపో మేనేజర్లు జి.రాజేందర్‌రెడ్డి, జి.జగన్, డీఈ పవీ నర్సింహారావ్, ఎలక్ట్రికల్ ఏఈలు శ్రీనివాస్, జి భాస్కర్‌లు ఉన్నారు.
లాభాల బాటలో వరంగల్ రీజియన్
Published Tue, Aug 27 2013 6:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement
Advertisement