* పూర్తికాని తాత్కాలిక సచివాలయ నిర్మాణాలు
* పలుచోట్ల కుంగిన ఫ్లోరింగ్.. ఉద్యోగుల్లో ఆందోళన
సాక్షి,అమరావతి: సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్‌నుంచి అమరావతి తరలివచ్చేందుకు ముఖ్యమంత్రి పెట్టిన ముహూర్తం ముంచుకొస్తోంది. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణం మాత్రం ఇంకా పూర్తి కాలేదు. వేలాదిమంది కూలీలతో రేయింబవళ్లు పనిచేయిస్తున్నా 27నాటికి పూర్తయ్యేలా కనిపించడంలేదు. మరోవైపు తాత్కాలిక సచివాలయం ఆరు బ్లాకుల్లో రెండు భవనాల్లో ఫ్లోరింగ్ కుంగిపోవడం కలకలం రేపుతోంది.
మొన్నటికి మొన్న మందడం గ్రామంలో ఓ భవనం కుంగితే యజమాని దాన్ని జాకీలతో పైకిలేపి అత్యాధునిక పద్ధతులతో అడుగు భాగాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ సంఘటన మరువకముందే తాత్కాలిక సచివాలయ నిర్మాణాలు కుంగడం సచివాలయ ఉద్యోగుల్ని మరింత కలవరానికి గురిచేస్తోంది. నాలుగో బ్లాక్‌లో ఫ్లోరింగ్ కుంగడంతో దాన్ని పగులగొట్టి పునర్నిర్మాణం చేపట్టారు.
ఈ విషయాన్ని అధికారులు, ఇంజినీర్లు ధ్రువీకరించకపోయినా అక్కడ పనిచేసే కూలీలు మాత్రం రెండు, మూడుచోట్ల నిర్మాణాలు కుంగినట్లు తెలిపారు. ఈనెల 22న సచివాలయ పనులు పరిశీలించి రోడ్‌మ్యాప్ ప్రకటిస్తానని సరిగ్గా వారం కిందట సీఎం చంద్రబాబు తాత్కాలిక సచివాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయితే సీఎం పర్యటనను 23కి వాయిదా వేశారు. ఆ పర్యటన కూడా వాయిదా పడటం పలు అనుమానాలకు తావిస్తోంది.
కాగా, హైదరాబాద్ నుంచి ఈ నెల 27న తరలిరానున్న అధికారులు తాత్కాలిక సచివాలయం పనుల పరిస్థితిని తెలుసుకుని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గురువారం హైదరాబాద్ నుంచి కొందరు ఉద్యోగులు వచ్చి పనులు పరిశీలించారు. అమరావతి ప్రాంతంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు ఏమాత్రం సాధ్యం కాదని నిపుణులు మొదటి నుంచీ చెబుతున్న విషయం తెలిసిందే.
ఇదిలాఉండగా.. వెలగపూడి వద్ద ప్రభుత్వం నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవనాలు ఎక్కడా కుంగలేదని సీఆర్‌డీఏ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సాయిల్ టెస్టింగ్ చేసి అనుకూలంగా ఉన్నచోటే పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. అటు మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఎక్కడా రాజీలేకుండా భవనాలను నిర్మిస్తున్నామని, నేల కుంగలేదని, ఆందోళన చెందవద్దని సూచించారు.
ముంచుకొస్తున్న ముహూర్తం
Published Fri, Jun 24 2016 2:03 AM | Last Updated on Sat, Aug 18 2018 3:49 PM
Advertisement