ఎట్టకేలకు ‘నీటి’ఎన్నికలు | Water Bodies Elections | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు ‘నీటి’ఎన్నికలు

Published Wed, Aug 19 2015 11:59 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

ఎట్టకేలకు ‘నీటి’ఎన్నికలు - Sakshi

ఎట్టకేలకు ‘నీటి’ఎన్నికలు

చేతులెత్తే పద్ధతిలో ఏకాభిప్రాయం
వచ్చే నెలాఖరులోగా ప్రక్రియ ముగింపు
ఏర్పాట్లలో ఇరిగేషన్ అధికారులు


 
వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న నీటి సంఘాలకు ఎట్టకేలకు ఎన్నికలు జరుగనున్నాయి. ప్రభుత్వం ఈ మేరకు జీవో జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు ఇరిగేషన్ శాఖాధికారులు కసరత్తు మొదలు పెట్టారు. గ్రామాల్లో అప్పుడే సందడి సంతరించుకుంది.
 
విశాఖపట్నం : ఆయకట్టు స్థిరీకరణలో సాగునీటి సంఘాలదే క్రియాశీలక పాత్ర.  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వీటి బలోపేతానికి విరివిగా నిధులుకేటాయించడమే కాకుండా సకాలంలో ఎన్నికలుకూడా నిర్వహించారు. 2008లో పదవీకాలం ముగియగానే వీటికి ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత ఈ సంఘాలను పట్టించుకునే వారే కరువయ్యారు. 2013తో వీటి పదవీకాలం ముగియగానే..ఆర్నెళ్లకోసారి చొప్పున వీటి కాలపరిమితిని పొడిగిస్తూ రెండేళ్లుగా ఎన్నికలు వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు ఎన్నికల నిర్వహణకు సర్కార్ గ్రీన్‌సిగ్నెల్ ఇవ్వడంతో పల్లెల్లో సందడి మొదలైంది. జిల్లాలో ఒక్క తాండవ ప్రాజెక్టు పరిధిలో మాత్రమే ఐదు డిస్ట్రిబ్యూటరీ కమిటీ(డీసీ)లు ఉన్నాయి. మిగిలిన ప్రాజెక్టులకు డీసీలులేవు. కాగా తాండవ పరిధిలో 24, రైవాడ పరిధిలో 10,కోనాం పరిధిలో ఎనిమిది సాగునీటి సంఘాలుండగా, మైనర్ ఇరిగేషన్ వనరుల పరిధిలో మరో 304 సాగునీటి సంఘాలున్నాయి. వచ్చే నెలాఖరులోగా ఈ సంఘాల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఎన్నికల నిర్వహణ కోసం సర్కార్ తనదైన విధానాన్ని రూపొందించింది.

 తొలుత అర్హుల నిర్ధారణ
 తొలుత గత ఎన్నికల్లో ఓటుహక్కు కలిగిన వారి జాబితాలను సిద్ధం చేస్తారు. వీరిలో ఎంతమంది ఓటు వేసేందుకు అర్హులో తొలుత నిర్ధారిస్తారు. ఆ తర్వాత ఆయకట్టు వారీగా రైతుమహా జనసభలు ఏర్పాటు చేస్తారు. ఆ సభల్లో రైతులందరి ఏకాభిప్రాయంతో కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు నలుగురు సభ్యులు ఎంపిక చేస్తారు. గతంలో ఈ కమిటీల ఎన్నికల సమయంలోగ్రామాల్లో రైతుల మధ్య తీవ్ర పోటీ ఉండేది. పార్టీ రహితంగానే ఈఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ గ్రామాల్లో పార్టీల వారీగా వేరుపడి తలపడే వారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో సాగునీటి సంఘాలకు కూడా తీవ్ర పోటీ ఉండేది. రైతుల మధ్య విభేదాలకు దారితీసేవి. ఈ సమస్యలకు పుల్‌స్టాప్ పెట్టేందుకే చేతులెత్తే పద్ధతిలో ఏకాభి ప్రాయ సాధనతోనే ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ స్పష్టం చేసింది.
 
 టీడీపీ వారికి కట్టబెట్టేందుకే..

 టీడీపీ సానుభూతి పరులైన వారికి మాత్రమే పగ్గాలు వచ్చేలా పథకరచన చేస్తున్నారు. ఈదఫా ఎన్నికల విధానంలో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. రైతువారీగా ఏకాభిప్రాయంతో మాత్రమే కమిటీలను ఎన్ను కోవాలని సూచించింది. ఈ నూతన విధానం ద్వారా ఆయకట్టులో 20 సెంట్లకుపైగా భూములున్న రైతులు మాత్రమే సాగునీటి సంఘాల్లో సభ్యులుగా ఉంటారు. ముందుగా ఓటుహక్కు కలిగిన రైతులు మాత్రమే సాగునీటి సంఘాల పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిఉంటుంది. ఆ తర్వాత డీసీ ఎన్నికలను కూడా ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏకాభిప్రాయం కుదరకపోతే అధికారులే ఆయా సంఘాలకు పర్శన్ ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తారు. దిగువ, మధ్య స్థాయి కమిటీల ఎంపిక పూర్తయ్యాక ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు జరుగుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement