
రాష్ట్రాల మధ్య జలజగడం
- ‘పాలమూరు’కు అడ్డొస్తే పట్టిసీమను ఎత్తిచూపాలని తెలంగాణ నిర్ణయం
- మహారాష్ట్ర, కర్ణాటకలతో కలసి ఏపీపై ఒత్తిడిపెంచే వ్యూహం
- తమ వాటా నీటితోనే ప్రాజెక్టులు చేపడుతున్నట్లు స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్యా జల వివాదాలు మరింత ముదురుతున్నాయి. గత ఏడాది ప్రాజెక్టుల్లో నీటి పంపకాలపై తగవులాడుకున్న రెండు రాష్ట్రాలు ఈ ఏడాది రెండు నదుల బేసిన్‌ల పరిధిలోని ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటి నిల్వలు చేరకముందే జల జగడానికి దిగాయి.
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల(కురుమూర్తి), డిండి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం, ట్రిబ్యూనల్, బోర్డుల అనుమతి లేదని ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతుండగా.. పట్టిసీమకు ఎలాంటి ముందస్తు అనుమతులున్నాయో తెలపాలంటూ టీ-సర్కారు అదేస్థాయిలో ప్రతిస్పందిస్తోంది.
ఎగువ రాష్ట్రాలతో కలసి పోరాటం..
కృష్ణా నదిలో 90 టీఎంసీల వరద జలాలను వినియోగించుకునే ప్రణాళికతో చేపడుతున్న పాలమూరు ఎత్తిపోతలకు ఏపీ అడ్డుపడితే పట్టిసీమ ప్రాజెక్టులో నీటి వాటాలపై పట్టుబట్టాలని టీ-సర్కారు భావిస్తోంది. పట్టిసీమ వద్ద 80 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకానికి గోదావరి బోర్డు అనుమతి లేకుండా, కనీససమాచారం ఇవ్వకుండా ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులివ్వడంపై తెలంగాణ ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.
పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమే అయితే 80 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాలకున్న 35 టీఎంసీల వాటాను కర్ణాటక, మహారాష్ట్ర కృష్ణా జలాల్లో మినహాయించుకునే అవకాశం ఉంది. మిగతా 45 టీఎంసీల వాటా ఉమ్మడి ఏపీకి సంబంధించినది. 45 టీఎంసీల్లో ఏపీ, తెలంగాణ 58:42 నిష్పత్తిలో పంచాల్సి వస్తే.. తెలంగాణకు 19 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంటుందనేది తెలంగాణ నీటిపారుదల శాఖ వాదన. ఒకవేళ పాలమూరుపై ఏపీ కొర్రీలు పెడితే పట్టిసీమలో తమకు దక్కాల్సిన వాటాతో పాటు ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాలపై ఆ రాష్ట్రాలతో కలసి ఉమ్మడిగా పోరాడాలని టీ-సర్కారు నిర్ణయించినట్లు తెలిసింది.
వాటాలను ఎక్కడ వాడుకుంటే ఏంటీ?
కృష్ణా జలాల వినియోగం విషయంలో బచావత్ అవార్డు మేరకు కృష్ణాలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఈ నీటి వినియోగంలో ప్రాజెక్టువారీ కేటాయింపులున్నా, అవేవీ ప్రస్తుతం పూర్తికాకకపోవడంతో, తనకున్న నీటి వాటాను రాష్ర్ట్ర పరిధిలో ఎక్కడైనా వాడుకుంటానని చెబుతూ టీ-సర్కారు ఆ మేరకు నీటిని వాడుకుంటోంది. ఉమ్మడి ఏపీకి క్యారీఓవర్ కింద ఇచ్చిన 150 టీఎంసీలు, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో పూడిక కారణంగా వాడుకోలేకపోతున్న 170 టీఎంసీలు, పట్టిసీమలో భాగంగా ఉమ్మడి ఏపీకిచ్చిన 45 టీఎంసీల్లో తమకు దక్కే వాటాల నీటితోనే పాలమూరు, డిండి ప్రాజెక్టులను చేపట్టామని బలంగా చెబుతోంది.
దీనిపై నీటి పారుదల శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ’ట్రిబ్యూనల్ కేవలం ఎవరి వాటాలు ఎంత అని మాత్రమే నిర్దేశిస్తుంది. రాష్ట్రానికి జరిపిన వాటా మేరకు నీటిని వాడుకోవాలంటే ముందుగా దాన్ని నిల్వ చేయాలి. అది చేయాలంటే ప్రాజెక్టు కట్టాలి. అందులో భాగంగానే పాలమూరు, డిండి కడుతున్నాం. ట్రిబ్యునల్ సైతం వాటాలు నిర్ణయిస్తుంది కానీ, ప్రాజెక్టులు కట్టాలా? వద్దా? అన్నది నిర్ణయించదు కదా‘ అని వ్యాఖ్యానించారు.