మట్టి తరలింపుతో ఏర్పడిన పెద్ద గొయ్యి (ఇన్‌సెట్) మట్టి తరలింపు ప్రాంతం వద్ద పోలీసు వాహనం
ప్రొద్దుటూరు టౌన్ : అధికార పార్టీ నాయకులు తాము అనుకున్నదే చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చెప్పినా.. పట్టించుకోలేదు. పట్టణంలోని గాంధీ పార్కులో ట్యాంక్ నిర్మాణ పనులను మున్సిపల్ పాలకవర్గం ఇటీవల ప్రారంభించింది. పార్కులో ట్యాంక్ నిర్మిస్తే.. ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని ప్రజలు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే.. జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ దృష్టికి గురువారం తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన జడ్జి అక్కడ ట్యాంక్ నిర్మాణ పనులు ఆపాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నకు తెలిపారు. అలాగే అని కమిషనర్ జడ్జికి చెప్పారు. ఒక రోజు కూడా గడవక ముం దే తిరిగి పనులు చేపట్టారు. శుక్రవారం అర్ధరాత్రి 11.30 గంటల నుంచి శని వారం తెల్లవారుజామున 5.30 వరకు అధికార పార్టీకి చెందిన రామాపురం వాసి హిటాచితో వందల ట్రాక్టర్ల మట్టిని తరలించారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకా రం క్రీడా మైదానాలు, ఉద్యానవనాల్లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదనే నిబంధనలు ఉన్నా.. అధికార పార్టీ నేతలు తుంగలో తొక్కి పార్కులో పెద్ద గోతులు తవ్వడం పర్యావరణ ప్రేమికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ట్రాక్టర్ మట్టిని రూ.1000కి పైగా విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. అయినా మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఈ విషయంపై వైఎస్సార్‌సీపీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి అర్ధరాత్రి ఫోన్ చేసినా కమిషనర్ తీయలేదు. శనివారం ఉదయం ఆయన కమిషనర్‌కు తెలిపినా.. కనీసం పార్కులోకి వెళ్లి పరిశీలించిన దాఖలాలు లేవు. ఏది ఏమైనా పార్కులో అర్ధరాత్రి మట్టి తరలింపు చేస్తుంటే.. అధికార పార్టీ నేతల ఆగడాలు శ్రుతిమించాయని స్పష్టమవుతోంది. అర్ధరాత్రి హిటాచిని ఏర్పాటు చేసి ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తుంటే.. అక్కడ పోలీసు వాహనంతోపాటు ఎస్‌ఐ, సిబ్బంది పహారా కాయడం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment