అలలకు బలి
- ఉసురుతీసిన సముద్ర స్నానం
- ఇద్దరు యువకుల దుర్మరణం
- మరొకరు గల్లంతు
- ఇద్దర్ని రక్షించిన లైఫ్‌గార్డ్సు
విశాఖపట్నం: కొబ్బరితోట ఎస్‌వీపీ నగర్‌కు చెందిన ఎనిమిది మంది స్నేహితులు ఆదివారం మధ్యాహ్నం ఆర్కే బీచ్‌లో స్నానానికి దిగారు. కొంతసేపు ఉల్లాసంగా గడిపారు. అక్కడి నుంచి నోవాటెల్ ఎదురుగా ఉన్న బీచ్‌కు వచ్చారు. వీరిలో ముగ్గురు బాలురు కూడా ఉన్నారు. వీరంతా స్నానానికి దిగగా అలల ఉధృతికి కాకర చంద్రమౌళి(18), కాకర మహేష్(19), అప్పలరాజు (24), రమేష్(19)లు లోపలికి కొట్టుకుపోయారు.
లైఫ్‌గార్డులు వెంటనే స్పందించి చంద్రమౌళి, రమేష్‌లను రక్షించారు. మహేష్, అప్పలరాజును రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కొద్ది సేపటికి అప్పలరాజు మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. గల్లంతయిన మహేష్ కోసం గాలిస్తున్నారు. వీరితో పాటు వచ్చిన రాజు, సాయి, చందు, పైడిరాజులు సురక్షితంగా బయటపడ్డారు. అప్పలరాజు మృతదేహాన్ని చూసి స్నేహితులు విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో..
అప్పలరాజు కష్టజీవి. మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉన్నాడు. అతని తండ్రి రామునాయుడు ఆటో డ్రైవర్. తల్లి నూకరత్నం కూలి పనులకు వెళ్తుంటుంది. అక్కకు పెళ్లి చేశాడు. తమ్ముడిని చదివిస్తున్నాడు. ఇల్లు కట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ విధంగానే ఇల్లు కట్టాడు. పెళ్లికి సిద్ధమైన తరుణంలో అలల రూపంలో మృత్యువు కబళించింది.
చిన్నతనం నుంచే కుటుంబానికి అండగా..
అలల ఉధృతికి గల్లంతయిన మహేష్(19) నిర్మాణ రంగ సంస్థలో సూపర్ వైజర్‌గా పని చేసేవాడు. ఇటీవలే పాలిటెక్నిక్‌లో ప్రవేశం పొందాడు. తండ్రి పార్థసారథి అనారోగ్యంతో ఐదేళ్ల క్రితం మృతి చెందడంతో కుటుంబ పోషణ భారాన్ని మోస్తున్నాడు. తల్లి ఓ ప్రయివేట్ క్లినిక్‌లో పనిచేస్తోంది. తమ్ముడు చంద్రమౌళి ఇటీవలే పదో తరగతి పాసయ్యాడు. ఐటీఐలో ప్రవేశం పొందాడు.
తమ్ముడు అనుకోలేదు
గోపాలపట్నంలో ఉన్న బంధువులను బీచ్‌రోడ్డు విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో ఎగ్జిబిషన్‌కు తీసుకొచ్చాను. చాలాసేపు బీచ్‌లోనే ఉన్నాను. అప్పటికే ఎవరో మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చిందని అనుకున్నారు. కానీ తమ్ముడు(బంధువు) మృతదేహమని అనుకోలేదు. కొబ్బరితోట వెళ్లే సరికి ఫోన్ వచ్చింది. ఇలా బీచ్‌లో స్నానానికి దిగి చనిపోయాడని. వెంటనే బీచ్‌కు వచ్చా.
- నూకరాజు, ఆటోడ్రైవర్, అప్పలరాజు బంధువు
లైఫ్‌గార్డ్స్ వల్లే బతికి బయటపడ్డాం..
లైఫ్‌గార్డ్స్ లేకపోతే నాతో పాటు స్నేహితుడు రమేష్ కూడా లోపలికి వెళ్లిపోయేవాడు. సరదాగా స్నేహితులందరం స్నానానికి దిగాం. ఇంతలోనే పెద్ద కెరటం వచ్చి మమ్మల్ని లోపలికి తీసుకెళ్లిపోయింది. సమీపంలో ఉన్న లైఫ్‌గార్డ్స్ మమ్మల్ని రక్షించగలిగారు.
-కాకర చంద్రమౌళి, లైఫ్‌గార్డ్స్ రక్షించిన యువకుడు