వక్ఫ్ భూముల్లో రియల్ వ్యాపారం | wax land Real Business | Sakshi
Sakshi News home page

వక్ఫ్ భూముల్లో రియల్ వ్యాపారం

Published Wed, Mar 4 2015 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM

wax land Real Business

సాక్షి ప్రతినిధి, కర్నూలు : వక్ఫ్ భూముల్లో భారీగా రియల్‌ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. సెంట్ల లెక్కన అడ్డగోలుగా విక్రయిస్తున్నారు. అక్రమంగా నిర్మాణాలూ చేపడుతున్నారు. కల్లూరు మండలంలో ప్రధానంగా సాగిన ఈ వక్ఫ్ ఆస్తుల కబ్జా పర్వం కర్నూలు మండలంలోనూ కొనసాగుతోంది. కర్నూలు మునిసిపల్ కార్యాలయానికి కూత వేటు దూరంలో విలువైన 5.32 ఎకరాల వక్ఫ్‌బోర్డు స్థలంలో కొత్త కొత్త నగర్ల పేరిట బోర్డులు పెట్టి.. అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమంగా నిర్మాణాలూ చేపడుతున్నారు. ఇక్కడ నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని మునిసిపల్ అధికారులకు వక్ఫ్ బోర్డు అధికారులు లేఖలు రాసినా ఉపయోగం లేకుండా పోతోంది. కబ్జాదారులు మాత్రం యథేచ్ఛగా వక్ఫ్ భూముల్లో ‘ధన’యజ్ఞాన్ని చేస్తున్నారు.
 
 ఆ స్థలం మాదే..!
 కర్నూలు గ్రామం పరిధిలో సుంకేసుల రోడ్డులోని సిరినోబుల్ హాస్పిటల్ పక్కన సర్వే నెంబరు 62లోని స్థలం వక్ఫ్ బోర్డునకు చెందినది. ఎస్‌బీఐ కాలనీలో వెనకవైపున ఉన్న ఈ స్థలం విస్తీర్ణం 5.32 ఎకరాలు. ప్రధానమైన కూడలిలో ఉన్న ఈ స్థలం విలువ రూ.కోట్లలో ఉంది. ఈ స్థలం తమదేనని 1963 అక్టోబరు 24నే వక్ఫ్‌బోర్డు ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా 2009 మే 7న  జారీచేసిన ఏపీ గెజిట్ నోటిఫికేషన్‌లో కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ భూమి విలువ కోట్లలో ఉండటంతో కబ్జాదారుల కన్ను పడింది.
 
 ఇంతటి విలువైన స్థలంలో అప్పట్లో అధికార పార్టీ నేతల అండదండలతో కబ్జాదారులు నిర్మాణాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ స్థలం తమదేనని వక్ఫ్ బోర్డు స్పష్టంగా పేర్కొంది. ఈ స్థలంలో ఎటువంటి కట్టడాలు చేపట్టకుండా చూడాలని మునిసిపల్ కార్యాలయానికి రాష్ర్ట వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ 2013లోనే లేఖ రాశారు. అయితే, దీనిపై కబ్జాదారులు హైకోర్టును ఆశ్రయించారు.
 
 ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని.. అందువల్ల ఎటువంటి అనుమతులు ఇవ్వవద్దని 2013 డిసెంబరులో మరోసారి మునిసిపల్ అధికారులకు వక్ఫ్ బోర్డు అధికారులు లేఖ రాశారు. అయినప్పటికీ అప్పట్లోనే కాకుండా ఇప్పుడు కూడా అధికార పార్టీలో ఉన్న నేతల అండదండలతో ఇందుకు భిన్నంగా కబ్జాదారులు నిర్మాణాలు చేపడుతున్నారు. అయినప్పటికీ మునిసిపల్‌శాఖ అధికారులు మాత్రం మిన్నకుండిపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ చేపట్టిన నిర్మాణానికి విద్యుత్‌శాఖ వాళ్లు మీటరు కనెక్షన్‌ను కూడా మంజూరు చేశారు. దీంతో కబ్జాదారులు దర్జాగా నిర్మాణాన్ని చేపడుతున్నారు.
 
 కళ్లప్పగించి చూస్తున్న కమిటీ
 విలువైన వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో వివిధ శాఖలకు చెందిన 10 మంది అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమవుతూ వక్ఫ్ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఉంది. అయితే, ఇప్పటివరకు ఈ కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. దీంతో వక్ఫ్ బోర్డు ఆస్తులకు రక్షణే లేకుండా పోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా వక్ఫ్ బోర్డు స్థలాలను కాపాడాల్సిన బాధ్యత కలెక్టర్ కమిటీ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
 
 ముందుకు సాగని జేసీ విచారణ
 వాస్తవానికి వక్ఫ్ ఆస్తుల కబ్జాపై ‘యథేచ్ఛగా కబ్జా’ శీర్షికన జనవరి 24వ తేదీ సంచికలో సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన మైనార్టీ శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి విచారణకు ఆదేశించారు.
 
  జిల్లా జాయింట్ కలెక్టర్‌ని విచారణ అధికారిగా నియమించారు. వక్ఫ్ ఆస్తులను కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేయడంతో పాటు వారి పేరిట ఉన్న పాసు పుస్తకాలను రద్దు చేసి వక్ఫ్ పేరిట మార్చాలని కూడా జేసీని మంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో వక్ఫ్ ఆస్తులను కబ్జా చేసిన వారి నుంచి భూములు పరిరక్షింపబడతాయని అందరూ ఆశించారు. అయితే, ఇప్పటివరకు జేసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వక్ఫ్ ఆస్తుల కబ్జాపై విచారణ వేగవంతం కాలేదన్న విమర్శలు ఉన్నాయి.
 
 ఇది వక్ఫ్ భూమే
 కర్నూలు గ్రామంలోని సర్వే నెంబరు 62లో ఉన్న భూమి వక్ఫ్ బోర్డునకు చెందిందే. అయితే, ఈ సర్వే నెంబరులో ఎంత భూమి ఉందన్న విషయంపై సర్వే జరగాల్సి ఉందన్నది నా అభిప్రాయం. ఈ సర్వే నెంబరు వ్యవహారం కోర్టులో ఉంది. అందువల్ల ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు. ఈ విషయంపై ఇప్పటికే మునిసిపల్ అధికారులకు లేఖ రాశారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు మొదలుపెట్టాం. నంద్యాలలోని నూనెపల్లి వద్ద వక్ఫ్ స్థలాన్ని ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. జిల్లాలో ఎక్కడైనా వక్ఫ్ స్థలాలు ఆక్రమణకు గురైతే కఠిన చర్యలు తీసుకుంటాం.
 - ముక్తార్ బాష, వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement