వక్ఫ్‌ స్థలాల్లో.. రియల్‌ దందా | Real Business Fraud | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ స్థలాల్లో.. రియల్‌ దందా

Published Tue, Sep 4 2018 3:51 PM | Last Updated on Tue, Sep 4 2018 3:51 PM

Real Business Fraud  - Sakshi

నంద్యాలలోని జాతీయ రహదారి సమీపంలో వక్ఫ్‌బోర్డు స్థలంలో అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలు

తెలుగుదేశం పార్టీ నాయకులు, వారి అనుచరుల భూదాహానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చివరకు వక్ఫ్‌బోర్డు ఆస్తులను సైతం వదలడం లేదు. వక్ఫ్‌ స్థలాల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించి రెవెన్యూ అధికారులు ఆయా ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ‘హెచ్చరిక బోర్డుల’ను సైతం ఒక్కరోజు కూడా గడవకుండానే తొలగించేసి..దందా కొనసాగిస్తున్నారు. వక్ఫ్‌ స్థలాలను ‘రియల్‌’ వెంచర్లుగా మార్చేసి..పెద్దపెద్ద భవంతులు కడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన వారిని సైతం బెదిరిస్తున్నారు.

నంద్యాల : నంద్యాలలోని పద్మావతినగర్, నూనెపల్లె, టెక్కె తదితర ప్రాంతాల్లో మసీదులకు సంబంధించిన దాదాపు వంద ఎకరాల భూములు, స్థలాలు అక్రమార్కుల పరమయ్యాయి. దాదాపు రూ.100 కోట్లు విలువ చేసే వీటిని తక్కువ ధరలకు కొనుగోలు చేసి.. పంచేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వక్ఫ్‌బోర్డు పరిధిలో నంద్యాల, పరిసర ప్రాంతాల్లో వందల ఎకరాలు భూములు, స్థలాలు ఉండేవి. వీటిని భద్రంగా కాపాడాల్సిన పెద్దలు ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అలాగే బోగస్‌ రిజిస్ట్రేషన్లతో అక్రమార్కులు కొందరు వీటిని గుట్టుచప్పుడు కాకుండా మరొకరికి అమ్మేస్తున్నట్లు తెలుస్తోంది. నంద్యాల–కోవెలకుంట్ల రహదారిలోని రైతునగరం గ్రామ పంచాయతీ మీదుగా ఫోర్‌లేన్‌ జాతీయ రహదారి నూతనంగా ఏర్పడటంతో ఇక్కడి స్థలాలకు డిమాండ్‌ పెరిగింది. ఇదే ఆసరాగా ఇక్కడున్న వక్ఫ్‌బోర్డు స్థలాల్లో టీడీపీ నాయకులు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేసి నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. 

సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డు సభ్యులు పరిశీలించినా.. 

నంద్యాల పట్టణంలో ఆక్రమణలో ఉన్న స్థలాలను సెంట్రల్‌ వక్ఫ్‌ సభ్యులు  ఈ ఏడాది మే నెలలో పరిశీలించారు. సూఫీ మత గురువులు అయిన అల్తాఫ్‌ రజా(రాష్ట్ర ముస్లిం సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి), మౌలానా అఫ్సర్‌ రుజ్మునా(ఆలిండియా ముస్లిం వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షులు), కార్యవర్గ సభ్యులైన మహమ్మద్‌అలీ, హైకోర్టు న్యాయవాది మసూద్‌ అలీజిన్నా, ఇంజినీర్‌ మహమ్మద్‌ హమీద్‌  పట్టణంలోని పద్మావతినగర్, నూనెపల్లె, టెక్కె బాలా కాంప్లెక్స్, ముబారక్‌ ఫంక్షన్‌హాల్‌ తదితర ప్రాంతాల్లోని స్థలాలను పరిశీలించారు. వక్ఫ్‌ ఆస్తులను కొందరు వ్యక్తులు తప్పుడు సర్వే నంబర్లతో ఎన్‌ఓసీలు సృష్టించి ఆక్రమించుకున్నట్లు వీరు గుర్తించారు.  ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని, వీటిలో కట్టడాలు  చేపట్టవద్దని వారు హెచ్చరించారు. అయినప్పటికీ ఆక్రమణదారులు  లెక్కచేయకుండా వెంచర్లు వేస్తున్నారు.  

హెచ్చరిక బోర్డులు తొలగించి.. 

నంద్యాల – కోవెలకుంట్ల రహదారిలోని రైతునగరం పంచాయతీలో నూతనంగా వెంచర్‌ వేసిన శ్రీజగజ్జననీ నగర్‌ కాలనీకి వెళ్లడానికి రహదారి కోసం నాయకులు ఎకరా వక్ఫ్‌బోర్డు స్థలాన్ని ఆక్రమించారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ జయరామిరెడ్డి తన సిబ్బంది, పోలీసులతో కలిసి వెళ్లి ఆక్రమించుకున్న రహదారిని పొక్లెయిన్‌తో తొలగించారు. అనంతరం ‘ఈ ప్రదేశం వక్ఫ్‌బోర్డుకు సంబంధించినది.ఇందులో ఆక్రమణలు నిషేధించడమైనది. ఆక్రమించిన వారు చట్టరీత్యా శిక్షార్హులు’ అని జిల్లా కలెక్టర్‌ పేరుతో బోర్డు పాతించారు. అయితే.. ఒక్కరోజు కూడా గడవకముందే ఆ బోర్డును తొలగించి, రహదారిని సైతం ట్రాక్టర్లు, లారీలు వెళ్లే సైజులో చదును చేశారు.  

నిర్మాణాలు కూడా కొనసాగిస్తున్నారు. ఈ స్థలంలో రహదారి తొలగించడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై నంద్యాల టీడీపీ కౌన్సిలర్‌ కొండారెడ్డి, ఆయన అనుచరులు సీరియస్‌ అయ్యారు. తాము అధికార పార్టీ నాయకులమని, తమ స్థలంలోకే వచ్చి  తొలగిస్తారా అంటూ చిందులు తొక్కారు. అలాగే ఓ వీఆర్‌ఓను కిందకు తోసేశారు. జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు ఉన్నాయని, మీరేమైనా మాట్లాడుకోవాలంటే కలెక్టర్‌తో మాట్లాడుకోవాలని చెప్పినా వారు వినకపోవడం శోచనీయం. అధికారం ఉందన్న ధీమాతో జగజ్జననీనగర్‌లోని ఎనిమిది ఎకరాల్లో వెంచర్లు వేశారు. కనీసం ఆ ప్రదేశాన్ని ల్యాండ్‌ కన్వర్షన్‌ కూడా చేయించలేదు.  

యథేచ్ఛగా కట్టడాలు 

టీడీపీ నాయకులు  నూనెపల్లెలోని వక్ఫ్‌బోర్డు స్థలాలను ఆక్రమించి కట్టడాలను చేపడుతున్నారు. రెండున్నర సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తే రూ.25 లక్షలు, స్థలం అయితే రూ.10 లక్షల చొప్పున ధర నిర్ణయించి విక్రయిస్తున్నారు. అక్రమ కట్టడాలు చేపడుతున్న వారిపై మూడు రోజులుగా రెవెన్యూ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆక్రమిత స్థలాల్లో ‘వక్ఫ్‌బోర్డు స్థలాలు’ అంటూ బోర్డులు పాతారు.

అయితే.. ఆక్రమణదారులు నంద్యాల టీడీపీ ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి రెవెన్యూ అధికారులకు ఫోన్‌ చేయించారు. ఇన్నేళ్లూ లేనిది ఇప్పుడెందుకు మీరు జోక్యం చేసుకుంటున్నారంటూ సదరు ప్రజాప్రతినిధి అధికారులపై చిందులు వేసినట్లు సమాచారం. ఇంతటితో ఆగిపోవాలని, లేకపోతే మీరు జిల్లా పరిసర ప్రాంతాల్లో పని చేయలేరని ఘాటుగా హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో రెవెన్యూ అధికారులు కలెక్టర్‌ ఆదేశాల మేరకే బోర్డులు పాతుతున్నామని, ఏమైనా ఉంటే ఆయనతోనే మాట్లాడుకోవాలని, తమ చేతుల్లో ఏమీ లేదని చెప్పడంతో ఆ ప్రజాప్రతినిధి  తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఆక్రమిత స్థలాల్లో ముస్లింలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలి

వక్ఫ్‌బోర్డు స్థలాలు అన్యాక్రాంతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే కొందరు అక్రమార్కులు వాటిని ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్నారు. మిగిలిన స్థలాల్లో కూడా  వెంచర్లు వేసి రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. వక్ఫ్‌బోర్డు స్థలాల్లో నిర్మిస్తున్న కట్టడాలను ఆపాలి. నంద్యాలలోఎంతో మంది నిరుపేద ముస్లింలు ఉన్నారు. రెవెన్యూ అధికారులు ఆక్రమణలకు గురైన వక్ఫ్‌బోర్డు స్థలాలను స్వాధీనం చేసుకొని.. వాటిలో పేద ముస్లింలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలి. అధికారులు ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గకుండా పని చేసి.. వక్ఫ్‌బోర్డు ఆస్తులను కాపాడాలి.  

–  శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ  నంద్యాల నియోజకవర్గ నేత 

వక్ఫ్‌ స్థలాల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తే చర్యలు 

నూనెపల్లె పరిధిలోని రైతునగర్‌ గ్రామ పొలిమేరలో 70ఎకరాల వక్ఫ్‌బోర్డు భూములను గుర్తించారు. ఎక్కువ శాతం ఆక్రమణకు గురయ్యాయి. వీటిలో కట్టడాలు నిర్మిస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవు. వక్ఫ్‌ స్థలాలను ఆక్రమించి వేసిన రహదారులను రెండు రోజుల క్రితం పోలీసులతో వెళ్లి తొలగించాం.  కలెక్టర్‌ పేరుతో హెచ్చరికబోర్డులు కూడా పెట్టాం. ఈ బోర్డులను ఎవరైనా తొలగిస్తే కేసులు నమోదు చేస్తాం.  

  – జయరామిరెడ్డి, నంద్యాల తహసీల్దార్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement