సీఎం నా బంధువు | CM is my relative | Sakshi
Sakshi News home page

సీఎం నా బంధువు

Published Fri, Jul 24 2015 2:25 AM | Last Updated on Sat, Aug 18 2018 6:11 PM

సీఎం నా బంధువు - Sakshi

సీఎం నా బంధువు

ఓ కార్యదర్శి వసూళ్ల బాగోతం
 కర్నూలుకు కూతవేటు దూరంలోని
 పంచాయతీలో పాగా
 కలిసొచ్చిన రియల్ ఎస్టేట్ భూం
 ఇదే ప్రాంతంలో వెలుస్తున్న విద్యా సంస్థలు
 నిబంధనల పేరిట పనికో రేటు

 
 కర్నూలుకు కూతవేటు దూరంలోని పంచాయతీ అది.నగరం వేగంగా విస్తరిస్తుండటంతో అక్కడరియల్ ఎస్టేట్ వ్యాపారంఊపందుకుంది. ఇదే అదనుగా ఆ కార్యదర్శి ఫైలుకో రేటు కట్టారు. సీఎం బంధువనేట్యాగ్ తగిలించుకొని అధికారులను సైతం బుట్టలో వేసు కున్నాడు. ఇప్పుడు ఆ గ్రామంలో సామాన్యులుమొదలు.. బడా బాబుల వరకు ఏ పని కావాలన్నా ఆయన చేయి తడపాల్సిందే.
 
 కర్నూలు సిటీ: అధికార పార్టీ ముద్ర. సీఎంకు బంధువుననే ప్రచారం. ఇంకేముంది.. ఆ చిరుద్యోగి ముందు జిల్లా అధికారులు కూడా దిగదుడుపే. పని చేస్తుంది ఓ గ్రామ పంచాయతీలోనే అయినా.. ఆయన ఆదాయం లక్షల్లో ఉంటోంది. కర్నూలు వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో నంద్యాల రోడ్డులోని భూములకు డిమాండ్ పెరిగింది. ఇదే దారిలోని ఓ పంచాయతీ అధికారి రియల్ భూంనుతన ఆదాయ వనరుగా మలుచుకున్నాడు. ఓ ఇల్లు కట్టుకోవాలన్నా.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా స్థలం కొని పెట్టుకోవాలన్నా అందరి దృష్టి ఇప్పుడు ఈ పంచాయతీపైనే. ఈ నేపథ్యంలో భూములు, స్థలాలకు సంబంధించి అనుమతులకు ఆ ఉద్యోగి ముక్కుపిండి వసూలు చేస్తున్నాడు.
 
  ఆర్థిక స్థోమత ఉన్న వారి మాట సరేసరి.. లేనివాళ్ల నుంచీ దబాయిస్తుండటంతో ఆయన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. నిబంధనల సాకుతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సుమారు రూ.80లక్షలు వెనకేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ ప్రాంతంలోనే విద్యా సంస్థలు, గోదాములు అధికంగా ఉండటం ఆ ఉద్యోగికి కలిసొస్తుంది. అడిగినంతా ఇచ్చుచోకపోతే కొర్రీలు పెట్టడం.. నిలదీసిన వారికి సీఎం పేరు చెప్పి నోరు నొక్కేయడం ఆయన నైజం. ముఖ్యమంత్రి స్వగ్రామమైన నారావారిపల్లెలో ఆయన కుటుంబ సభ్యులకు తన బంధువునిచ్చి వివాహం చేశామని.. బాబుతో తనకు దగ్గరి సంబంధం ఉందనే ప్రచారం నేపథ్యంలో ఉన్నతాధికారులు కూడా ఈయన వ్యవహారంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
 
 చేయి తడిపితేనే..
 రెండేళ్ల పంచాయతీ పరిధిలోని పెద్దల మద్దతుతో కార్యదర్శిగా పాగా వేసిన ఆ ఉద్యోగి ఇప్పుడు పాతుకుపోయాడు. ఇంటి పన్ను కట్టాలని వెళితే.. ఆయనే ఇళ్ల వద్దకు వెళ్లి నిబంధనల పేరిట వేధింపులకు పాల్పడటం.. ఆ తర్వాత బేరమాడి రూ.2వేల నుంచి రూ.20వేల వరకు వసూలు చేయడం పనిగా పెట్టుకున్నాడు. పంచాయతీ పరిధిలో ఎవరైనా మరణించినా.. ధ్రువీకరణ పత్రం జారీకి కూడా పైసలివ్వాల్సిందే. అక్రమార్జనకు కొందరు అధికారులు, పత్రికా విలేకరుల పేర్లు అడ్డం పెట్టుకోవడం సరికొత్త కోణం. ఓ ఉదాహరణను పరిశీలిస్తే.. పోలీసు శాఖకు చెందిన ఓ అధికారి బంధువులు ఈ పంచాయతీ పరిధిలోని కాలేజీ వద్ద గ్యాస్ గోడౌన్ నిర్మిస్తున్నారు. ఇందుకు జిల్లా అధికారుల నుంచి అన్ని అనుమతులు పూర్తయ్యాయి. టెక్నికల్ అనుమతి కోసం నిర్ణీత ఫీజు చెల్లించి పంచాయతీ అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు.
 
 ఈ ఫైల్‌ను డీటీపీసీ అనుమతికి పంచాయతీ అధికారులే పంపించాల్సి ఉంది. యథావిధిగా అక్కడి కార్యదర్శి తన రేటు వారి ముందుంచారు. ఉన్నతాధికారులే అనుమతి ఇచ్చాక.. నీకెందుకివ్వాలని వారు నిలదీస్తే డీటీపీసీ అనుమతి లేకుండా ఎలా గోడౌన్ నిర్మిస్తావో చూస్తానంటూ మొండికేశాడు. అంతటితో ఆగక.. నిర్మాణ పనులను తరచూ అడ్డుకుటుండటంతో చివరకు గోడౌన్ యజమానులు ఆయనతో ఒప్పందానికి రాక తప్పని పరిస్థితి. ఆ తర్వాత కూడా అధికారులు, విలేకరుల పేరిట రూ.8లక్షలు డిమాండ్ చేయడంతో ఆ యజమాని ఫోన్లో వాయిస్ రికార్డు చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే సీఎం బంధువనే ముద్ర ఉండటంతో తమకెందుకొచ్చిన గొడవని వాళ్లు కూడా మౌనం దాల్చడం గమనార్హం.
 
 అక్రమాలు కొన్ని..
 నగర శివారు పంచాయతీ సమీపంలో ఓ వెంచర్ పక్కనే మరో వెంచర్ వేశారు. ఇక్కడికి వెళ్లేందుకు దారి లేదు. ఆ సదుపాయం కోసం కార్యదర్శిని కలువగా రూ.10లక్షలు డిమాండ్ చేశాడు. అందుకు వారు నిరాకరించడంతో ప్లాట్ల వ్యాపారం ఎలా చేసుకుంటావో చూస్తానంటు దబాయించడంతో చివరకు రూ.6లక్షలకు ఒప్పందం చేసుకున్నారు.
 ఓ వెంచర్ ఓపెన్ ప్లేస్ విషయంలోనూ రూ.10 లక్షల నుంచి రూ.15లక్షలు వసూలు చేశాడు.
 గ్రామంలో ఓ భవన నిర్మాణానికి అనుమతి కోసం రూ.లక్ష గుంజాడు.
 నిర్మాణంలోని ఓ విద్యా సంస్థ నుంచి రూ.10 లక్షలు వెనకేసుకున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement