రైతు రుణాలతోపాటే డ్వాక్రా రుణాలూ..!
డ్వాక్రా రుణాల మాఫీకి తాము కట్టుబడి ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. డ్వాక్రా మహిళలకు నోటీసులు ఇవ్వొద్దని బ్యాంకర్లను కోరుతామని చెప్పారు. రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకున్నప్పుడే డ్వాక్రా రుణాల మాఫీపై కూడా నిర్ణయం తీసుకుంటామని ఆమె అన్నారు.
ఇకపై పింఛన్ల మంజూరుకు, ఇళ్ల లబ్ధిదార్ల ఎంపికకు ఆధార్‌ను అనుసంధానం చేస్తామని మృణాళిని తెలిపారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, 50 లక్షల ఇళ్ల లబ్ధిదారులపై జియో టెక్నాలజీ ద్వారా విచారణ జరిపించి అక్రమాలు బయటపడ్డాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. ఈ విచారణ పూర్తయ్యాక మాత్రమే కొత్తగా ఇళ్లు మంజూరు చేస్తామని మృణాళిని అన్నారు.