మేమెలాంటి ఆదేశాలివ్వలేం! | we can't to do - Committee of the Central Electricity Authority | Sakshi
Sakshi News home page

మేమెలాంటి ఆదేశాలివ్వలేం!

Published Tue, Aug 5 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM

మేమెలాంటి ఆదేశాలివ్వలేం!

మేమెలాంటి ఆదేశాలివ్వలేం!

‘విద్యుత్’ వివాదంపై చేతులెత్తేసిన కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ కమిటీ
14వ తేదీలోగా కేంద్రానికి నివేదన రెండు రాష్ట్రాలకు వేర్వేరు ఈఆర్‌సీలకు ఓకే
సమావేశానికి కమిటీ చైర్‌పర్సన్  నీర్జా మాథూర్ గైర్హాజరు

 
 హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తలెత్తిన విద్యుత్ వివాదాన్ని పరిష్కరించడంలో కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ చేతులెత్తేసింది. ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రానందున తాము ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేమని పేర్కొం ది. దీనిపై ఈ నెల 14వ తేదీలోగా కేంద్రానికి తమ నివేదికను అందజేస్తామని.. కేంద్రం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు దీనిపై మరోసారి సమావేశాన్ని నిర్వహించబోమని కమిటీ తెలి పింది. ప్రస్తుతం సరఫరా అవుతున్న మేరకు యథావిధిగా ఇరు రాష్ట్రాలకు విద్యుత్ కోటా పంపిణీ జరగాల్సిందేనని స్పష్టం చేసింది. షెడ్యూలింగ్ మేరకు విద్యుత్ సరఫరా జరగకపోతే.. జరిమానా వసూలు చేస్తామని ఆంధ్రప్రదేశ్‌కు కమిటీ తేల్చిచెప్పింది. మొత్తం మీద రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదం చివరికి కేంద్రం కోర్టులోకి చేరింది. ఈ భేటీకి కమిటీ చైర్ పర్సన్ నీర్జా మాథూర్ హాజరుకాకపోవడం గమనార్హం.

పీపీఏల రద్దుతో మొదలు..

 విద్యుత్ పీపీఏలను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మొదలైన విద్యుత్ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర విద్యుత్ శాఖ సీఈఏ చైర్‌పర్సన్ నీర్జా మాథూర్ నేతృత్వంలో ఒక కమిటీని జూలై 1న ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత నెల 14న మొదటిసారిగా భేటీ అయింది. అనంతరం 31వ తేదీన ముసాయిదా నివేదికను ఇరు రాష్ట్రాలకు పంపింది. పీపీఏల రద్దు చెల్లదని, కృష్ణపట్నం, హిందూజా ప్లాంట్ల విద్యుత్‌ను కూడా తెలంగాణకు ఇవ్వాలని... ప్రస్తుతమున్న ఏపీఈఆర్‌సీ ఆంధ్రప్రదేశ్‌కే చెల్లుతుందని పేర్కొంటూ ముసాయిదాలో పేర్కొంది. తాజాగా కమిటీ రెండో భేటీ సోమవారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. సుమారు గంటన్నరపాటు సాగిన సమావేశంలో ఏ ఒక్క అంశంపైనా ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదు.

ముసాయిదాను వ్యతిరేకిస్తున్నాం..: ఏపీ

విద్యుత్ పీపీఏల రద్దు చెల్లదని చెప్పే అధికారం కమిటీకి లేదని సమావేశంలో ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడింది. ‘‘ముసాయిదా నివేదికను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. పీపీఏల రద్దు చెల్లుతుందంటూ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఇచ్చిన అభిప్రాయాన్ని కమిటీ పరిశీలించాలి. న్యాయపరమైన అంశాన్ని సాంకేతిక అంశాల ఆధారంగా ఎలా నిర్ణయిస్తారు? న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోకుండా నిర్ణయానికి ఎలా వస్తారు? మొదటి సమావేశంలో చర్చించని కృష్ణపట్నం, హిందూజా ప్లాంట్లపై కూడా నిర్ణయం తీసుకుని తెలంగాణకు విద్యుత్ ఇవ్వాలని ముసాయిదా నివేదికలో ఎలా పేర్కొంటారు? విభజన చట్టంలో రెండు వేర్వేరు ఈఆర్‌సీలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పుడు చట్టానికి భిన్నంగా ఏపీనే తీసుకోవాలని ఎలా అంటారు? రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ సరఫరా లైన్లకు అంతరాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలను వసూలు చేయవద్దు’’ అని ఏపీ స్పష్టం చేసింది.

ఏపీకి జరిమానాలు విధించాలి..: తెలంగాణ

 కమిటీ ఇచ్చిన ముసాయిదా నివేదికను స్వాగతిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. పీపీఏల రద్దుపై ఆంధ్రప్రదేశ్ వెనక్కి తగ్గితే కేంద్ర విద్యుత్ ప్లాంట్ల (సీజీఎస్) కోటా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్ వాటా పెంపునకు (1.77 శాతం) అంగీకరిస్తామని స్పష్టం చేసింది. ‘‘కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటు నిర్వహణ మాకే ఇవ్వాలి. సీలేరుతో పాటు కృష్ణపట్నం ప్లాంటు విద్యుత్ ఉత్పత్తి వివరాలను ఇవ్వడం లేదు. దీంతో ఆ రెండు ప్లాంట్ల నుంచి కోటా మేరకు మాకు విద్యుత్ రావడం లేదు. గ్రిడ్ ఆదేశాలను ఏపీ పాటించటం లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. జరిమానా వసూలు చేయాలి. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ సరఫరా లైన్లకు అంతరాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలను వసూలు చేయవద్దు’’ అని టీ సర్కారు కోరింది.

వేర్వేరు ఈఆర్‌సీలు..!

ప్రస్తుతమున్న ఏపీఈఆర్‌సీ ఆంధ్రప్రదేశ్‌కే చెందాలన్న అభిప్రాయాన్ని కమిటీ వెనక్కి తీసుకుంటున్నట్టు సమాచారం. విభజన చట్టం మేరకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ర్టం ప్రత్యేక ఈఆర్‌సీలను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వెళ్లాలని, కేంద్రం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని పేర్కొన్నట్టు తెలిసింది. అదేవిధంగా అంతరాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలను వసూలు చేయవద్దంటూ ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చినందున.. దీనిని కేంద్రానికి సిఫారసు చేస్తామని కమిటీ పేర్కొన్నట్లు సమాచారం.
 
 కొరత ఉన్నప్పుడు ఏమిటీ నిర్ణయాలు?  ఏపీ తీరుపై కేంద్రానికి కేసీఆర్ ఫిర్యాదు


హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ కోతలకు ఏపీ ప్రభుత్వ నిర్వాకమే కారణమని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఒకవైపు విద్యుత్ కొరత ఉన్న పరిస్థితుల్లో వార్షిక మరమ్మతుల పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుదుత్పత్తి నిలిపివేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆమేరకు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ 146 మిలియన్ యూనిట్ల (ఎంయూ)వరకు ఉండగా... సరఫరా 123 ఎంయూలుగా ఉంది. మిగిలిన 23 ఎంయులకు కోతలు విధిస్తున్నారు. ఈ స్థాయిలో విద్యుత్ లోటు ఉన్నప్పుడు... 210 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్‌టీపీపీ) ఒక యూనిట్‌ను, విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్(ఎన్‌టీటీపీఎస్)లో 210 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లను వార్షిక మరమ్మతుల పేరుతో నిలిపివేయడాన్ని ఆయన తప్పుపట్టారు. దీంతో మొత్తం 630 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీనిపై కేసీఆర్ మండిపడ్డారు.
 
 కోటా మేరకు ఇవ్వాల్సిందే


కోటా మేరకు తెలంగాణకు విద్యుత్ ఇవ్వాల్సిందేనని కమిటీలో ఉన్న ఎస్‌ఆర్‌పీసీ ప్రతినిధి ఆంధ్రప్రదేశ్‌కు తేల్చిచెప్పారు. ‘‘ఎస్‌ఆర్‌పీసీ ఆదేశించినట్లుగా రెండు ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి వివరాలను ఎస్‌ఆర్‌పీసీకి సమర్పించాల్సిందే. ప్రస్తుతం అమలవుతున్న కోటా మేరకు తెలంగాణకు 56.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం విద్యుత్ సరఫరా చేయాల్సిందే. ఈ కోటా మేరకు విద్యుత్ సరఫరా చేయకపోతే జరిమానా వసూలు చేస్తాం. దీనిపై కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ) వద్ద పిటిషన్ వేస్తాం..’’ అని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే థర్మల్ ప్లాంట్ల షెడ్యూలింగ్‌ను ఇస్తున్నామని, కోటా మేరకు విద్యుత్ ఇస్తున్నామని ఏపీ వర్గాలు తెలిపాయి. కానీ సీలేరు, కృష్ణపట్నం ప్లాంట్లలో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను తమకు ఇవ్వడం లేదని తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఈ అంశంలో ఇప్పటికే ఏపీజెన్‌కోకు నోటీసులు ఇచ్చామని ఎస్‌ఆర్‌పీసీ ప్రతినిధి పేర్కొన్నారు.   తెలంగాణకు రావాల్సిన కోటా మేరకు  సరఫరా కానుండటంతోఆప్రభుత్వవర్గాలు కాసింత ఊపిరి పీల్చుకున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement