వాళ్లు పోలీసులో.. గూండాలో కూడా తెలీదు
విమానం దిగగానే తమను పోలీసులు అడ్డుకున్నారని, వ్యాన్ ఎక్కమని చెప్పారని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. రన్‌వే మీదనే తమను అడ్డుకున్నారని, స్థానిక పోలీసులు మఫ్టీలో వచ్చి అక్కడ ఆపారని అన్నారు. అసలు మఫ్టీలో వచ్చామంటున్న వాళ్లు పోలీసులో గూండాలో కూడా తమకు తెలియడంలేదని ఆయన అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన, ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మరికొందరు నాయకులు విశాఖ విమానాశ్రయం రన్‌వే మీద బైఠాయించారు.
అసలు అక్కడకు వచ్చింది స్థానిక పోలీసులు అయినా, వాళ్లు రన్‌వే మీదకు రావడమే తప్పన్నారు. ఇదంతా చాలా అప్రజాస్వామికంగా జరుగుతోందని, చివరకు అసలు ప్రయాణికుల లాంజ్ వద్దకు కూడా తమను వెళ్లనివ్వలేదని ఆయన చెప్పారు. ప్రివెంటివ్ ఆర్డర్లు ఉన్నాయని, 144 సెక్షన్ అమలులో ఉందని అంటున్నారని రాంబాబు అన్నారు.