
విభజన ఆగేదాకా ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటనను ఉపసంహరించుకునేంత వరకు ఉద్యమాన్ని ఇదే తీవ్రతతో కొనసాగించాలని సీమాంధ్ర న్యాయవాదులు నిర్ణయించారు. ఉద్యమంలో భాగంగా వచ్చే నెల 26 వరకు సీమాంధ్రలో విధులను బహిష్కరించాలని వారు తీర్మానించారు. అలాగే వచ్చే నెల 17న ఢిల్లీ వెళ్లి జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించడంతో పాటు ప్రధానమంత్రిని, అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వినతిపత్రాలు సమర్పించనున్నారు. తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకుగానూ వచ్చే నెల 26న విశాఖపట్నంలో సీమాంధ్ర న్యాయవాదుల సదస్సును నిర్వహించాలని తీర్మానించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ‘అడ్వొకేట్‌స యాక్షన్ కమిటీ ఫర్ సమైక్య ఆంధ్రప్రదేశ్’ ఆధ్వర్యంలో సీమాంధ్ర న్యాయవాదుల సదస్సు శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సదస్సులో హైదరాబాద్‌తో పాటు 13 జిల్లాలకు చెందిన సీమాంధ్ర న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా.. కమిటీ కన్వీనర్ సీవీ మోహన్‌రెడ్డి అధ్యక్షత వహించారు.
పంజాబ్, హర్యానా ఇప్పటికీ కొట్టుకుంటున్నాయి..
సదస్సులో సీవీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన వల్ల ప్రజలకు కలిగే కష్టనష్టాలను పట్టించుకోకుండా యూపీఏ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రకటన చేసిందని ఆరోపించారు. రాష్ట్ర విభజన చేస్తే తలెత్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించజాలమన్నారు. వచ్చే పది, పదిహేను ఏళ్లలో నీటి యుద్ధాలు తప్పవని, ఇది తాను చెబుతున్న మాట కాదని, రాజకీయ నిపుణులు చెబుతున్న మాటని ఆయన తెలిపారు. పంజాబ్, హర్యానా ఎప్పుడో విడిపోయినా.. ఇప్పటికీ ఆ రెండింటి మధ్యా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయని మోహన్‌రెడ్డి చెప్పారు. అప్పులు, ఆస్తులు, నీటి పంపకాలు ఇలా ప్రతి విషయంలోనూ విభేదాలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ వంటి నగరాన్ని సీమాంధ్రలో నిర్మించుకోవాలంటే అందుకు కనీసం 50 నుంచి వందేళ్లు పడుతుందని ఆయన చెప్పారు.
రైతుల నోట్లో మట్టే..
అనంతరం బార్ కౌన్సిల్ సభ్యుడు ద్వారకానాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. విభజన జరిగితే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందన్నారు. కలిసి ఉంటే అన్ని ప్రాంతాలు కూడా నీటిని పంపిణీ చేసుకోవడం సులభమవుతుందన్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ప్రస్తుతం సాగుతున్న పంపిణీ, విభజన వల్ల కష్టసాధ్యమవుతుందని, తద్వారా ఇరు ప్రాంతాల మధ్య విభేదాలు నెలకొంటాయని చెప్పారు. సభలో మాట్లాడేందుకు కొందరికే అవకాశం ఇస్తున్నారని, జిల్లాల నుంచి వచ్చిన తమకు అవకాశం ఇవ్వాలని కొందరు న్యాయవాదులు కొద్దిసేపు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. వారికి సర్దిచెప్పడంతో సదస్సు సజావుగా సాగింది. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్, రామిరెడ్డి, గంటా రామారావు, కె.చిదంబరం, ముప్పాళ్ల సుబ్బారావు, శ్రీనివాసరెడ్డి, ఎన్.హరినాథ్‌రెడ్డి, సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కో కన్వీనర్ జయకర్, సుప్రీంకోర్టు న్యాయవాది గల్లా సతీష్, ఏపీఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, ఏపీ పరిరక్షణ వేదిక సమన్వయకర్త లకష్మణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కొందరు తెలంగాణ న్యాయవాదులు అశోకా గార్డెన్‌సలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు.