మా అనుమానాలు తీర్చాలి: చిరంజీవి
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మినహా మార్గం లేదని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో తెలుగువారందరి భాగస్వామ్యం ఉందన్నారు. చిదంబరంను కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని చిరంజీవి చెప్పారు.
హైదరాబాద్ గురించి మరోసారి ఆలోచించాలని కోరామన్నారు. ఉద్యోగులు, విద్యార్థుల భయాలు తొలగించాలని సూచించామన్నారు. హైదరాబాద్లో ఉన్న సీమాంధ్రులకు ఎలాంటి భద్రత కల్పిస్తారో చెప్పాలని కోరామన్నారు. అందరికీ న్యాయం చేయాలని, తమ అనుమానాలు తీర్చాలని కోరినట్టు తెలిపారు.
అన్యాయం జరుగుతుందని తెలిస్తే తదుపరి కార్యాచరణ తీవ్రంగా ఉంటుందన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసినందున విధులకు దూరంగా ఉన్నట్టు తెలిపారు. చిరంజీవితో పాటు కావూరి సాంబశివరావు, జేడీ శీలం, పురందేశ్వరి కూడా చిదంబరంను కలిశారు. జీవోఎం సమావేశానికి ముందు ఈ భేటీ జరిగింది.