వాళ్ల చర్చలు మీరు చూశారా.. మేం చూశామా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిసిన విషయంలో టీడీపీ నేతలు పెడార్థాలు తీయడం సరికాదని బీజేపీ నాయకురాలు పురందేశ్వరి మండిపడ్డారు. ప్రధానమంత్రిని ఒక ప్రతిపక్ష నేత కలిస్తే తప్పేముందని ఆమె ప్రశ్నించారు. అయినా.. ప్రధానితో జగన్ తన కేసుల గురించి చర్చించడం మీరు చూశారా.. మేం చూశామా అని టీడీపీ నేతలను ఆమె నిలదీశారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో కార్యకర్తల్లో ఆందోళన నెలకొందని, టీడీపీ మిత్రధర్మం పాటించలేదనే అనుమానం నెలకొందని పురందేశ్వరి చెప్పారు. ఇక రాబోయే ఎన్నికల్లో పొత్తుల గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడలేమని, పొత్తుల నిర్ణయానికి ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉందని తెలిపారు.
ఇక ప్రధానమంత్రి మోదీని జగన్ కలవడం మీద టీడీపీ నేతల విమర్శలను కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కావూరి సాంబశివరావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత వెళ్లి ప్రధానమంత్రిని కలిస్తే తప్పేంటని ఆయన అడిగారు. అసలు వాళ్లిద్దరు కలవడం ఏంటనే ప్రశ్న వేయడమే తప్పన్నారు. కేసుల కోసమే కలిశారని ఎవరైనా చూశారా అని కావూరి నిలదీశారు.