మా మొదటి ప్రాధాన్యత సమైక్యాంధ్రకే: కావూరి
ఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంపై తమ మొదటి ప్రాధాన్యత సమైక్యాంధ్రాకే ఉంటుందని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం చేయాల్సి వస్తే హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. సమైక్యాంధ్రకు సంబంధించి సోమవారం మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ అభివృద్ధిలో మూడు ప్రాంతాల కృషి ఉందని కావూరి తెలిపారు. సమైక్యాంధ్రాకే తన ఓటన్నారు. కాంగ్రెస్ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందని ఆశిస్తున్నానన్నారు. కాంగ్రెస్ నుంచి తిరిగి ప్రకటనే వెలువడే అకవాశం ఉందని కావూరి తెలిపారు. ఈ అంశానికి సంబంధించి సాయంత్రం తొమ్మిది మంది సీమాంధ్ర మంత్రులతో సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు.
మరో ఎంపీ పనబాక లక్ష్మి మాట్లాడుతూ..తమపై అనవసర ప్రచారం చేస్తున్న కారణంగానే మీడియాకు దూరంగా ఉంటున్నామని తెలిపారు. కొందరు మాత్రమే మీడియాతో మాట్లాడాలని నిర్ణయించామన్నారు. అందుకే మీడియా ఎదుట హాజరు కావడం లేదని తెలిపారు. ఆంటోనీ కమిటీ ముందు సమైక్య వాదనలు వినిపిస్తామని పనబాక అన్నారు.