సాక్షి, ఏలూరు : గ్రామ వాలంటీర్ వ్యవస్థలో వీఆర్వో నుంచి కలెక్టర్ వరకూ అధికారాలు ఉంటాయని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. జిల‍్లా అభివృద్ధి మండలి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జన్మభూమి కమిటీల్లో కలెక్టర్‌కు కూడా అధికారం ఇవ్వలేదని, అందుకే అవకతవకలు జరిగాయని అన్నారు. పార్టీ, కులం, మతం తేడా లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. ఇందులో ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవ‍్వరూ జోక్యం చేసుకునే అర్హత లేదని, ఎవరికైనా సమస్య వస్తే నేరుగా సీఎం పేషీలో కాల్ సెంటర్ ద్వారా 48 గంటల్లో పరిష్కరిస్తామని తెలిపారు.
జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నాళ్ల నాని మాట్లాడుతూ...’జిల్లా అభివృద్ధికి అత్యంత కీలకమైన సమావేశం జిల్లా అభివృద్ది మండలి సమీక్షా సమావేశం. పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి మా వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులంతా కట్టుబడి ఉన్నాం. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విధంగా విద్య, వైద్య రంగాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లా ప్రజా ప్రతినిధులు డీడీఆర్‌సీ సమావేశంలో లేవనెత్తిన సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తాం. భీమవరంలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. పోలవరం ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు మెరుగైన వైద్యం అందిస్తాం. నిడదవోలు, దెందులూరు, చింతలపూడి, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు ప్రాంతాలలో ఆస్పత్రులపై మెరుగైన సౌకర్యాలపై దృష్టి పెడతాం. మన ప్రభుత్వంలో విద్య, వైద్యానికి అధ్యతిక ప్రాధాన్యత ఉంటుంది. మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా రాజీపడం. బడ్జెట్‌లో అత్యధిక నిధులు, ప్రాధాన్యత పశ్చిమ గోదావరి జిల్లాకు దక్కేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించాలి.’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment