కరీంనగర్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ఎంపీ పొన్నం ప్రభాకర్ మరోసారి మండిపడ్డారు. రచ్చబండ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి ఫోటోను దిష్టిబొమ్మలా పెట్టుకుంటున్నామని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజనపై మంగళవారం మాట్లాడిన పొన్నం..కిరణ్ అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. తెలంగాణలో రచ్చబండకు సీఎంను రావద్దని చెబుతున్నా ఆయన వస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎంకు నిజంగా సిగ్గు అనేది ఉంటే రచ్చబండకు రాకుండా ఉండాలని తెలిపారు. అంతకుముందు జిల్లాలోని ఇల్లెంతకుంట రచ్చబండ సభలో సీఎం ప్రసంగ పాఠవాన్ని ప్రజా ప్రతినిధులుచ అధికారులు బహిష్కరించారు.
మెదక్ జిల్లాలో ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తలపెట్టిన రచ్చబండ కార్యక్రమం వాయిదా పడింది. టీఆర్ఎస్, జేఏసీ బెదిరింపులకు భయపడి కార్యక్రమాన్ని వాయిదా వేశారని విమర్శలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్లో తెలంగాణ సభ ఉన్నందునే మెదక్లో రచ్చబండ వాయిదా వేసినట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి తెలిపారు. ఎవరు బెదిరింపులకు భయపడి రచ్చబండను వాయిదా వేయలేదన్నారు.