అన్ని అవకాశాలను వాడుకుంటాం: శైలజానాథ్
రాష్ట్రం ఐక్యంగా ఉండాలను కోరుకుంటున్నామని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ పునరుద్ఘాటించారు. ప్రజల ప్రతినిధులుగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగువారిని ఐక్యంగా ఉంచడానికి అన్ని అవకాశాలను వాడుకుంటామని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో తమ ప్రాంత ఎంపీలతో అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు.
సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేపు ఢిల్లీ వెళ్తున్నట్టు చెప్పారు. ఎల్లుండి జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర విభజనపై సంప్రదింపులు ముగిశాయన్న హైకమాండ్ ఇప్పుడు ఆంటోని కమిటీ వేసిందన్నారు. అలాగే రాష్ట్ర విభజనపై పార్టీ నిర్ణయం తీసుకున్నా కేంద్రం నిర్ణయం తీసుకోదని భావిస్తున్నట్టు చెప్పారు. సీమాంధ్రలో ప్రజాభిష్టాన్ని పార్టీలు పసిగట్టలేకపోయాయని అన్నారు. చంద్రబాబు బతకడానికి రాజకీయాలే మార్గమనుకుంటున్నారని అందుకే సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని శైలజానాథ్ దుయ్యబట్టారు.
రాష్ట్ర విభజనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత స్పష్టత ఇవ్వాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉండడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. సీఎం కిరణ్ కూడా క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్త అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచే అధికార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.