ఫోన్ ట్యాపింగ్పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం: యనమల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోన్ ను తెలంగాణ ప్రభుత్వ ట్యాప్ చేసిందని ఆరోపిస్తూ ఈ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేశామని తెలంగాణ ప్రభుత్వమే చెప్తోందని, ఇది వ్యక్తిగత భద్రత విషయమని, ఇలా ఫోన్ ట్యాప్ చేశామని చెప్పి వదంతులు వ్యాపింపజేయడం సరికాదని అన్నారు. అవసరమైనట్లు కేసును మార్చుకుని ఏపీ ప్రభుత్వాన్ని బదనాం చేశారని తెలిపారు. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని నాశనం చేసేందుకు ఇలా చేశారని, ఈ విషయాన్ని తాము చాలా సీరియస్ గా తీసుకున్నామని, కేంద్ర హోంమంత్రికి నివేదిక తప్పకుండా ఇస్తామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విషయంపై ముగ్గురు కేబినెట్ మంత్రులతో కమిటీ వేస్తున్నామని తెలిపారు.
దాదాపు 125 టేపులు రికార్డు చేసినట్లు తమ వద్ద సమాచారం ఉందని, అసలు టేపులు ఎక్కడనుంచి వచ్చాయి? ఎందుకు వాటిని ప్రసారం చేయాల్సి వచ్చిందో తేలాల్సినవసరం ఉందని చెప్పారు. టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ నేరమని, అది చట్ట విరుద్ధమని అన్నారు. పునర్విభజన చట్టంలో సెక్షన్ 8 గురించి కూడా కేబినెట్ సమావేశంలో చర్చించామని యనమల అన్నారు. దీంతోపాటు చంద్రబాబు పోన్ ట్యాపింగ్ విషయాన్ని కూడా చర్చించామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వాన్ని సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాము ఎన్నిసార్లు గవర్నర్ కు నివేదించుకున్నా విభజన చట్టంలోని అంశాల విషయంలో ఎలాంటి మేలు జరగలేదని చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబునాయుడు రేపు ప్రధానిని, జైట్లీని అవసరం అయితే హోంశాఖ మంత్రిని కలిసి వివరిస్తారని తెలిపారు. ఉమ్మడి రాజధానిలో పౌరుల హక్కుల రక్షణకు అన్ని నిబంధనలు ఉన్నాయని, ఈ విషయంలో గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. విభజన చట్టం ఆదరాబాధరాగా చేశారని, చివరికి వ్యక్తిగత భద్రతకు కూడా ప్రమాదం ఏర్పడిందని చెప్పారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని చెప్పారు. ఈ అంశంపై కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్, కేంద్రానికి నివేదిక ఇస్తామని తెలిపారు. కేంద్ర హోంశాఖను కలిసి కేబినెట్ మంత్రులే ఈ తీర్మానం అందజేస్తారని తెలిపారు.