మేం చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేయలేదు: ఏకే ఖాన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తదితరుల ఫోన్‌లను ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు పూర్తిగా నిరాధారాలని తెలంగాణ అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) డైరెక్టర్ జనరల్ అబ్దుల్ ఖయ్యుం ఖాన్ ఖండించారు. తెలంగాణ ఏసీబీ పూర్తి వృత్తి నిబద్ధత కలిగిన దర్యాప్తు సంస్థ అని ఆయన స్పష్టం చేశారు. ఏ కేసు విషయంలోనైనా పూర్తిగా చట్టం, నియమనిబంధనలకు లోబడి దర్యాప్తు చేస్తోందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఆ రాష్ట్ర ముఖ్యుల ఫోన్‌లను ట్యాపింగ్ చేశారని వార్తాపత్రికలు, చానళ్లల్లో వస్తున్న వార్తలను ఖండిస్తూ మంగళవారం రాత్రి ఆయన ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోడానికి ఆ పార్టీ ‘బాస్’ నేతృత్వంలో జరిగిన భారీ కుట్రను తెలంగాణ ఏసీబీ చేదించిన విషయం తెలిసిందే.
ఏపీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల ఫోన్‌లను ట్యాపింగ్ చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అదే విధంగా మంగళవారం ఏపీ ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో ఓ మంత్రివర్గ ఉప సంఘాన్ని సైతం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై తెలంగాణ ఏసీబీ స్పందిస్తూ పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేయడం గమనార్హం. ఆంగ్లో ఇండియన్ స్టీఫెన్‌సన్ ఫిర్యాదు అనంతరం ఆయన ఫోన్‌పై ఏసీబీ నిఘా వుంచగా, ఆయనకు చంద్రబాబుతో పాటు ఇతర ముఖ్య నేతల ఫోన్ చేసి ప్రలోభాలకు గురిచేసిన విషయం బయటపడిందని తెలుస్తోంది.