'రైతులకోసం మేం పోరాడుతాం'
అమరావతి: ల్యాండ్ పూలింగ్లో భూములిచ్చిన రైతులకు న్యాయం జరగలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గ్రామ కంఠాల సమస్యలు పరిష్కరించకుండా అన్యాయం చేస్తున్నారని అన్నారు. లంక భూములిచ్చిన ఎస్సీ ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో తమకు ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపిందంటూ పలువురు ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తాత్కాలిక ఏపీ తాత్కాలిక సచివాలయం పరిశీలనకు వచ్చిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల బృందాన్ని రైతులు కలిశారు.
స్థలాల కేటాయింపు, ప్లాట్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వారు గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ రైతులందరికీ న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పారు. రాజధాని ప్రాంత రైతులకు భూములు ఇస్తామన్న భూములు ఇప్పటికీ ఇవ్వలేదని పెద్దిరెడ్డి తెలిపారు. తాత్కాలిక సచివాలయం పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం వృధా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడంబరాలకు చేస్తున్న ఖర్చుపై ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా ఏపీ తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను వైస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. అనంతరం మంత్రులు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డిలను ఎమ్మెల్యేలు కలిశారు. అసెంబ్లీ నియోజక వర్గాల నిధులు విడుదల చేయాలని ఈ సందర్బంగా వారు మంత్రులను కోరారు. అయితే నిబంధన ప్రకారం గత ఏడాది నిధులను విడుదల చేశామని.. ఈ ఏడాది ఇంకా నిధులు విడుదల కాలేదని యనమల అన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్, అసెంబ్లీ నిర్మాణాలపై ఎమ్మెల్యేలు మంత్రులతో చర్చించారు.